ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రత్నావతి.బేతాళకథ 9.డా.బెల్లంకొండ. పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుని ఆవహించిన శవాన్నిబంధించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. శవం లోని బేతాళుడు 'మహిపాల, అమరులు-సిధ్ధులు-సాధ్యులు-గరుడులు-కిన్నెరులు-కింపురుషులు-గంధర్వులు-యక్షులు-విద్యాధరులు-భూతములు-పిశాచములు-రుద్రులు-మునిగణములు-ఉరుగులు-తుషితులు-దైత్యులు-భాస్వరులు-గుహ్యకులు-నరులు-నాగులు నీదాన వీర శూర గుణం తెలిసినవారే! మన ప్రయాణంలో అలసట తెలియకుండా నీకు రత్నావతి అనే కథ చెపుతాను విను...... అయోధ్యను వీరకేతు అనే రాజు పరిపాలిస్తుండేవాడు.ఆదేశ రాజధానిలో రత్నదత్తుడు అనే నగల వ్యాపారి ఉన్నాడు,అతని భార్య పేరు నందయంతి వీరికి అందాల రాశి అయిన కుమార్తె రత్నావతి ఉంది. సకలవిద్యలు పూర్తి చేసిన ఈమె బాల్యంనుండి శివుని భక్తితో పూజలు చేస్తూ ఉండేది. ఈమెకు వివాహం చెయదలచి తండ్రి తెచ్చిన యువకులను నిరాకరించసాగింది. అలా కొద్ది రోజులు గడిచాక,రాజధానిలో దొంగల బెడద అధికం కావడంతో రాజుగారు స్వయంగా దోంగలను బంధించి నగర వీధులగుండా తీసుకువస్తుండగా,దొంగల నాయకుడు వీరయ్య రూపురేఖలను చూసి న రత్నావతి అతన్నివివాహం చేసుకుంటానని తండ్రికి తెలియజేసింది. 'తల్లి నేను నగల వ్యాపారిని కదా! ఇప్పుడు నేను రాజు గారి వద్దకు వెళ్ళి వీరయ్యకు క్షమాభిక్ష పెట్టండి అని అడిగితే అతను ఇంతకాలం దొంగిలించిన బంగారు నగలు నాకే అమ్ముతున్నాడని రాజు గారికి నాపై సందేహం రాదా?అటువంటి అపవాదు నేను భరించలేను ఈ కార్యం నావల్లకాదు 'అన్నాడు రత్నదత్తుడు. మరుదినం వీరయ్యను ఉరి తీయడానికి తీసుకువెళుతుండగా,తల్లి తండ్రులతో కలసి ఏడుస్తు శివుని వేడుకుంటూ రత్నావతి వీరయ్యను అనుసరించసాగింది. ఉరితీసే ముందు రత్నావతి తనను ప్రేమిస్తుందని తెలుసుకుని వీరయ్య ఒక్క సారిగా పకపకా నవ్వి భోరునవిలపించాడు.అనంతరం వీరయ్య ఉరితీయ బడ్డాడు.అదృశ్యం చూసిన రత్నావతి వీరయ్యలేని జీవితం వృధా అని తలచి తను ప్రాణత్యాగం చేయదలచి చితి ఏర్పాటు చేయించి శివుని స్మరిస్తూ చితికి ముమ్మరు ప్రదక్షణం చేయ సాగింది.ఆదృశ్యం చూసిన నగర ప్రజలు రత్నావతి తల్లితండ్రులు ఆహాకారాలుచేసారు. ఆ దారి వెళుతున్నా మునిశ్వరుడు విషయం తెలుసుకుని 'అమ్మయి నువ్వు నిత్యం పూజించే శివుడే నన్ను పంపంచాడు,వీరయ్యను బ్రతికిస్తాను పదా! అని వీరయ్యను బ్రతికించి వారి ఇరువురికి పూమాలలు మార్పించి వారిని ఆశీర్వదించి తన దారిన తాను వెళ్ళిపోయాడు ముని.ఆవిషయం తెలుసుకున్న రాజు వీరయ్యకు సైన్యంలో దళపతి పదవి కల్పించాడు. 'విక్రమార్క మహారాజా రత్నావతి కథ విన్నావుగా మరణించబోఏ వీరయ్యను సుగుణాల రాశి అయిన రత్నావతి ఎందుకు ప్రేమించింది.దొంగ అయినప్పటికి వీరయ్యను వివాహం చేసుకుంటానని ఎందుకు పట్టుబట్టింది. వీరయ్య మరణించేముందు రత్నావతిని చూసి ఎందుకు నవ్వాడు అంతలోనే ఎందుకు ఏడ్చాడు? తెలిసి నాప్రశ్నకు సమాధానం చెప్పక పోయావో నీతల పగిలి మరణిస్తావు'అన్నాడు బేతాళుడు. 'బేతాళా ముఖ పరిచయమైనా లేని ఒ అందాలరాశి చావబోతున్న తనను ప్రేమించానని తనప్రాణాలు కాపాడమని శివుని వేడుకోవడం చూసి న వీరయ్య విధి లీలకు నవ్వాడు. అయ్యో ఇంతటి ప్రేమ కనపరిచే యువతిని భార్యగా పొందలేక పోయానే అనే బాధతో ఏడ్చాడు.ప్రేమ అనేది సహజ చర్య,అది ఎప్పుడు ఎవరిపై ఎందుకు కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఆవిధంగా రత్నావతి వీరయ్యను ప్రేమించింది'అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టుపైకి చేరాడు. పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు (కల్పితం)
June 22, 2020 • T. VEDANTA SURY • Story