ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రాత్రీ పగలూ --- యామిజాల జగదీశ్
October 26, 2020 • T. VEDANTA SURY • Story

పూర్వం ఏడాదిలో ఆరు నెలలు పగలుగానూ, మిగిలిన ఆరు నెలలు రాత్రిగానూ ఉండేది. 

వెలుగనే పగలు లేని కాలంలో పక్షులూ జంతువులూ చాలా అవస్థలు పడుతుండేవి.

ఓ కుందేలు చీకట్లో ఓ గోతిలో పడిపోయింది. దాంతో పక్షులూ జంతువులూ కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. కొన్ని జంతువులు తాము వెలుతురు లేనప్పుడు పడుతున్న కష్టాలను చెప్పుకున్నాయి. మరికొన్ని వెలుతురు మరీ ఎక్కువవడంతో పడుతున్న కష్టాలు చెప్పుకున్నాయి. 

గుడ్లగూబ తమకు వెలుగే అక్కర్లేదంది. ఎలుగుబంటి తాను పడుకోవడానికి రాత్రే అనువైనదని చెప్పింది. పగలు అక్కర్లేదంది. కుందేలు, జింక, చిలుక పగలు కావాలని విన్నవించాయి. 

చివరికి కుందేలూ గుడ్లగూబా ఒక పోటీకి ఒప్పుకున్నాయి. 

గుడ్లగూబ "రాత్రీ రాత్రీ రాత్రీ" అని చెప్తూ ఉండాలి.

కుందేలు "పగలూ పగలూ పగలూ" అని చెప్తూ ఉండాలి.

అయితే ఎవరైతే ఇలా చెప్పడంలో తడబడుతారో తాము చెప్పవలసిన మాట బదులు మరొక మాట చెప్పినా లేక మాట చెప్పడం ఆపినా వారు ఓడిపోయినట్టేనని ఆ పోటీ నిబంధన.

పోటీ ప్రారంభమైంది. 

గుడ్లగూబ రాత్రీ రాత్రీ అని ఆగక చెప్తోంది. 

కుందేలు పగలూ పగలూ అని చెప్తోంది.

గుడ్లగూబ పక్కనే ఉన్న ఎలుగుబంటి పగలు అని చెప్పకు అని గుడ్లగూబను అప్రమత్తం చేసింది. ఈ మాట విన్న గుడ్లగూబ మాట తడబడింది. రాత్రీ రాత్రీ అంటూనే పగలూ పగలూ అనికూడా నోరు జారింది. 

దీంతో గుడ్లగూబ ఓడినట్లయింది.

ప్రపంచమంతటా పగటితో నిండిపోయింది. 

అయితే కుందేలు పెద్దమనసు చేసుకుని మనమందరం ఐకమత్యంతో ఒక్కటిగా జీవించడానికి ఓ సూచన చేయాలనుందని చెప్పింది.

ఈరోజునుంచి రోజులో పన్నెండు గంటలు పగటిపూటగానూ, మిగిలిన పన్నెండు గంటలు రాత్రిపూటగానూ ఉండొలని చెప్పింది. 

ఈ మేరకు రాత్రీ పగలూ సమానంగా ఏర్పడినట్లు ఎక్కడో ఎప్పుడో చదివాను తమిళంలో. అయినా మూలకథ ఎక్కడిదో తెలీదు. నాకు నచ్చి ఇక్కడ పంచుకున్నానంతే....