ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రామపథం..బహు ఆదర్శనీయం!--సుజాత.పి.వి.ఎల్.
August 28, 2020 • T. VEDANTA SURY • Story

మన పురాణాలలో ఇతిహాసాలలోనూ ఉన్న కథలు, గాథలు ఆశ్చర్యాన్ని వినోదాన్ని కలిగిస్తుంటాయి.  కొన్ని విచిత్రంగా అభూతకల్పనగానూ అనిపించినా వాటిలో ఎంతో అంతరార్థం దాగుంటుంది.
ఇలా నిగూఢమైన అర్థంతో కూడిన సంఘటనలు మనకు రామాయణంలో ఎన్నో కానవస్తాయి. అందులోని 'ధర్మపథం' నుంచి మీ కోసం.
దశాననుడు లంకకు అధిపతి. చెడు స్వభావం కలవాడు. శ్రీరాముని వనవాస సమయంలో రాముని నుండి సీతను ఎడబాపి, సీతాదేవిని తన లంకకు తీసుకుపోయాడు.
కుంభకర్ణుడు రావణుని తమ్ముడు.  అన్నకు అండగా ఉన్నాడు. వాయుపుత్రుడైన హనుమంతుడు రాముని భక్తుడు. అతడు సముద్రాన్ని దాటి లంకకు పోయి, సీతను చూసి, సంభాషించి, సీతారాములు తిరిగి కలుసుకొనుటకు ముఖ్యకారకుడైనాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇందులో ఇమిడియున్న అంతరార్థం ఎంత మందికి తెలుసు. అదేమిటంటే..పది ఇంద్రియాలకూ..అంటే పది తలల రావణుడికి ఐదు చక్షురాదులగు జ్ఞానేంద్రియాలు,   వాగాదులైన ఐదు కర్మేంద్రియాలకు అధిష్టానమైన దేహమే లంక. దానిని ఆశ్రయించి యున్న అహంకార, మమకారాలే రావణ కుంభకర్ణులు. 
సీతాదేవి ప్రకృతి, రాముడు పురుషుడు. ప్రకృతి, పురుషుల ఎడబాటుకు అహంకార, మమకార రూపమైన దుర్భుద్ధి ఇందుకు కారణం. 
హనుమంతుడు చేతనం. రామభక్తి సాధనం. అందువల్ల చైతన్యశక్తి మాయారూపమైన సముద్రాన్ని దాటడం సాధ్యమైంది. ఆంజనేయుడు వాయుపుత్రుడు..అనగా ప్రాణాయామయోగం ప్రక్రియ యందు మిక్కిలి సమర్థుడు. అందువల్లనే గాలిలో ఎగిరి సముద్రాన్ని లంఘించాడు. ప్రాణాయామయోగ శక్తిగలవారు నేల నుండి పైకి లేవడం సులభంగా ఎరుగుదురు. అందువల్లనే ప్రకృతి పురుషులైన సీతారాముల సమాగమాన్ని సాధింపగలిగాడు. అందుచేతనే ఆజంనేయుడు అందరి ఆరాధ్య దైవమైనాడు. 
ఇదే శ్రీరామాయణ తత్త్వం. బహు ఆదర్శనీయం.!