ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రాయడం--- యామిజాల జగదీశ్
October 13, 2020 • T. VEDANTA SURY • Poem

ఔనౌను, 
నాలుగు దశాబ్దాలపైనే
అవుతోంది కలం పట్టి
కానీ ఇప్పటికీ 
కాగితంమీద పాళీ పడగానే
తెలియని జంకు
ఏం రాస్తానో అనే కన్నా
ఏ తప్పులు రాస్తానో అని

అందుకు కారణం
చదువుకోవలసిన తరుణంలో
గాలికొదిలేశాను మనసుని

పరభాష వరకూ ఎందుకు, 
తల్లిభాషనే సరిగ్గా చదువుకోలేదు
నాకు తెలిసిన మాటలు 
బహు తక్కువ
వ్యాకరణమైతే వశమవలేదు
అలంకార శాస్త్రమైతే ఆమడదూరం

నాన్నగారి రాతకోతలు చూసి 
నేనూ ఏదో ఒకటి రాయాలనుకునే ఆశతో
కొన్ని పుస్తకాలు చదివాను
అలాగని వాటిలోనిదంతా 
మెదడులోకెక్కించలేదు
కానీ తప్పో ఒప్పో 
రాయాలంటూ రాస్తున్నానే తప్ప
నాకేదో పట్టుందని రాయడం లేదు

చెప్పుకోవడానికి చాలానే ఉంది
చెప్పాలనే తపనా ఉంది
కానీ మాటలే కొరత

ఎన్నో ఏళ్ళుగా రాస్తున్నా
ఎప్పటికప్పుడు
ఇప్పుడే తొలిసారి రాస్తున్నాననే
అన్పిస్తుంటుంంది
ఎవరే తప్పు పడతారని భయం
అయినా తప్పులు తెలిస్తే
సరిదిద్దుకోవడానికి పనికొస్తుందనే
రాస్తున్నాను....