ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రాయపురం--దక్షిణ భారతదేశులో తొలి రైల్వే స్టేషన్ గా చరిత్ర పుటలకెక్కింది రాయపురం. కానీ మద్రాసు సెంట్రల్, ఎగ్మూర్ రైల్ స్టేషన్లను అభివృద్ధి చేసినంతగా రాయపురం స్టేషన్ వృద్ధి కాలేదు.ఆంగ్లేయుల పాలనలో 1856 జూన్ 28వ తేదీన రాయపురం రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం అప్పటి గవర్నర్ లార్డ్ హారిస్ చేతులమీదుగా జరిగింది. సింప్సన్ అండ్ కంపెనీ ఏర్పాటు చేసిన రైల్లో ఆంగ్లేయులతోపాటు ప్రత్యేక అతిథులు వెరసి మొత్తం మూడు వందల మంది ప్రయాణం చేశారు. ఈ రైలు రాయపురం వాలాజా బాద్ మధ్య నడిచింది.ఈ రైల్వే స్టేషన్ వయస్సు 164 ఏళ్ళు. అయితే దీనిని సరిగ్గా పట్టించుకోవడం లేదని కొన్ని పత్రికలు వార్తకథనాలు ప్రచురించాక రైల్వే నిర్వాహకులు కళ్ళు తెరిచారు.. ఇక్కడి పాతకట్టడానికి మరమ్మతులు చేపట్టారు. అంతేకాకుండా పారంపర్య కట్టడంగా ప్రకటించి ప్రత్యేకంగా ఉత్సవం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ పట్టించుకోవడం మానేశారు.76 ఎకరాల విస్తీర్ణంలో 17 రైల్వే లైన్లు ఏర్పాటు చేయవచ్చన్నది పలువురి కోరిక. అతివేగంగా అభివృద్ధి చెంది 1873లో ఆరు మీటర్ గేజ్ లైన్లతో ప్రారంభమైన మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం పదిహేను ప్లాట్ ఫారాలున్నాయి. అలాగే 1906లో మూడే మూడు మీటర్ గేజ్ లైన్లతో ప్రారంభమైన ఎగ్మూరు రైల్వే స్టేషన్ కూడా చెప్పుకోదగ్గస్థాయిలో తొమ్మిది బ్రాడ్ గేజ్ లైన్లతో నడుస్తోంది.కానీ 1856లో ప్రారంభమైన రాయపురం రైల్వే స్టేషన్ మాత్రం నత్తనడకన నడుస్తోంది.రైల్వేకు సొంతమైన రాలీస్ ఇండియా లీజ్ కాలం ముగిసింది. అక్కడి కట్టడాన్ని కూల్చి వేయడంతో అది ఖాళీగానే ఉంది.ఇక ఇబ్రహీం రోడ్డులో ఉన్న రైల్వే ప్రింటింగ్ ప్రెస్సుని పెరంబూరుకి మార్చేశారు.దీంతో ఇక్కడి భవనం నిరుపయోగమై మిగిలిపోయింది.దీనికి సమీపంలో తిరుమలై కెమికల్స్ రైల్వే వారి నుంచీ లీజుకీ తీసుకున్న భాగమూ ఖాళీగానే ఉంది. వీటన్నింటినీ బాగుచేసి 76 ఎకరాల రాయపురం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరచడానికి ఎంతో వీలుందన్నది పలు వర్గాల అభిప్రాయం. అనేక ఎక్స్ ప్రెస్ రైళ్ళను నడిపే వీలుందని అనేక సంఘాలవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరాలు రాశారు. వాటిని ఇప్పటివరకూ పట్టించుకున్న నాథులు లేరని వాపోతున్నారు. - యామిజాల జగదీశ్
June 27, 2020 • T. VEDANTA SURY • News