ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
రావణాసురుడు--అయోధ్యలో ఆగస్టు అయిదున రామమందిరానికి భూమి పూజ జరిగిన క్రమంలో ఓ పత్రికలో ఓ సమాచారం చదివాను. అదేంటంటే ఉత్తరప్రదేశ్ లోని బిస్రఖ్ అనే చోట ఉన్న రావణాసుర ఆలయ పూజారి మహంత్ రామదాస్ స్థానిక భక్తులకు లడ్డూలు పంచుతామన్నదే ఆ వార్త. నిజంగా నాకప్పటివరకూ తెలీదు, బిస్రఖ్ లో రావణాసురుడికి ఆలయం ఉన్నట్లు, అక్కడే రావణాసురుడు పుట్టాడని.ఈ ఆలయంలో దసరా రోజున కణకణ మండే అగ్ని గోళాలతో రావణాసురుడిని కాల్చుతారట. రోజూ ఈ ఆలయాన్ని వందలాది భక్తులు దర్శిస్తుంటారు. పూజలు చేస్తారు. ఇక్కడే కాదు, మన దేశంలోనే మరి కొన్ని చోట్ల కూడా రావణాసురుడి ఆలయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఉన్న రావణాసురుడి ఆలయంలో రావణ విగ్రహాలతోపాటు, మహాశివుడి విగ్రహమూ ఉంది. రావణుడు గొప్ప శివభక్తుడన్నది తెలిసిందేగా.కాన్పూర్ లోని ఉన్న ఆలయంలో రావణుడిని రాక్షసుడిగా కాక ఓ దేవుడిగా పూజిస్తారు. ఇక, మధ్య ప్రదేశ్ లోనివిదిషలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై రావణాసురుడి సన్నిధిలో ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. ఇక్కడి రావణాసురుడి విగ్రహం ఎత్తు పది అడుగులు.మండ్సుర్, మండోర్ తదితర ప్రాంతాలలోనూ రావణాసురుడి ఆలయాలున్నాయి.ఇదిలా ఉండగా మా నాన్నగారు ఆంధ్రపత్రికలో రామాయణం రాస్తున్న రోజుల్లో ఓమారు గుంటూరులో రామాయణంపై సభలూ సమావేశాలు జరిగాయి. ఆ సభలలో మా నాన్నగారిని రావణాసురుడిపై ప్రసంగించమని అందుకున్న ఉత్తరము , ఆయన ఆ సభలకు వెళ్ళి మాట్లాడటమూ నాకు బాగా గుర్తు. అప్పుడు రావణాసురుడికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు కూడా.శివుని పొగుడుతూ అతని దగ్గర ఉన్న ఢంకాను వాయిస్తూ రావణాసురుడి శివతాండవ స్తోత్రం నాకెంతో ఇష్టం. మా నాన్నగారొకమారు ఇందుకు అర్థాలు చెప్పారు. కానీ మరిచిపోయాను. ఈ తాండవ శ్లోకాలకు ఇంతకాలానికి ఓ చోట భావముంటే ఇక్కడ ఇస్తున్నా వాటిని సంగ్రహించి శ్లోకాలతోపాటు..... శివ తాండవ స్తోత్ర భావం...--జటాఝూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న మెడతో, మెడలోని సర్పహారం మాలలావే లాడుతుండగా చేతిలోని ఢమరుకం ఢమ ఢమ ఢమ ఢమ అని మోగుతుండగా శివుడు ప్రచండ తాండవం చేశాడు. ఆ తాండవ నర్తకుడు సకల శుభాలూ ప్రసాదించాలి.శివుని జడలు నీటిని ఒడిసిపట్టే లోతైన బావిలా ఉండగా, అందులో సురగంగ వేగంగా సుడులు తిరిగాయి. అప్పుడు దానిలో బారులు తీరి ప్రకాశించిన తరంగాలతో ఆయన శిరం మిరిమిట్లుగొలిపింది. అటువంటి మహాదేవుని నుదుటి భాగం ధగ ధగ మెరుస్తూ అగ్నిని, శిరస్సుపై బాలచంద్రుని ధరించి ఉన్న శివుడి పట్ల నాకెంతో ఆసక్తి ఉంది. ఎవరి మదిలోనైతే తేజోమయమైన విశ్వంలోని జీవులు వర్ధిల్లుతాయో, ఎవరు పర్వతరాజు కుమార్తె పార్వతీదేవికి తోడై ఉంటాడో, ఎవరు తన కరుణా కటాక్షాలతో ఎంతటి ప్రమాదాన్నయినా అడ్డుకోగలడో, ఎవరంతటా విరాజిల్లుతుంంటాడో, ఎవరు ముల్లోకాలను వస్త్రాలుగా కప్పుకుని ఉంటా డో అటువంటి పరమశివుడిలో నా మనస్సు రమించాలి.అన్ని దిక్కులనూ పాలించే దేవతల చెక్కిళ్ళపై ఎర్రని కాంతులను విరజిమ్మేలా ప్రకాశించే మణిని పడగలపై ఉంచుకున్న సర్పాన్ని చుట్టుకుని, మదపుటేనుగు చర్మంతో చేయబడిన అందమైన ఉత్తరీయాన్ని భుజాన ధరించి, అందరికీ సమ న్యాయం చేసే, భూతనాథుడైన పరమ శివునిపై నా మానస్సు మహానందభరితమై వర్ధిల్లాలి.చంద్రుని తలపై కిరీటంగా కలవాడైన, ఎర్రని సర్పమాలతో కేశాలను ముడివేసిన వాడైన, ఇంద్రాదిదేవతల సిగదండలలో పువ్వుల పుప్పొడితో ధూళి దూసరమై ఉన్న నల్లని పాదపీఠంగల వాడైన పరమేశ్వరుడు తరగని సిరులతో కరుణించాలి.ఏదైతే ఇంద్రాది దేవతలతో మ్రొక్కబడుతుందో, ఏదైతే చంద్రరేఖతో శోభాయమానంగా వెలుగుతోందో, అటువంటి నుదుటిని కలిగి, దానిలో ప్రజ్వరిల్లే అగ్గిరవ్వల సెగలతో ఎవరు, మన్మథుని హరించాడో అటువంటి పరమశివుని చిక్కులు పడిన జటల నుండి సంపత్కరమైన సిద్ధులు మమ్మల్ని అనుగ్రహించాలి.విశాల నుదుటి భాగాన ధగ ధగమనే మహాగ్నిజ్వాలలతో ప్రచండుడై, మన్మధుని ఆహుతి చేసి, పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి కుచాగ్రాలపై, మకరికాపత్రరచనా శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించే ముక్కంటి వేలుపు స్వామిపై నా మనస్సు లగ్నమై వర్ధిల్లాలి.యావత్ ప్రపంచ భారాన్ని తనపై ఉంచుకున్నవాడు, చంద్రుని ధరించి శోభించేవాడు, సురగంగను తనలో కలవాడు, కారు మబ్బులు చెలరేగి చుట్టుముట్టిన అమావాస్య నాటి అర్ధరాత్రిలోని చిమ్మచీకట్లను ముద్దగా చేసి ఇక్కడ బంధించేరా , అన్నట్టున్న నల్లని కంఠం కలవాడైన మహాదేవుడు సకల సిరులతో కరుణించాలి.వికసించిన నల్ల కలువ పూల మధ్య మూల భాగం ఎంత నల్లటి కాంతిని విరజిమ్ముతుందో అంతటి నల్లదనంతో ప్రకాశించే కంఠం కలిగి మన్మథుని హరించినవాడు, త్రిపురాలను సంహరించినవాడు, భవబంధహరుడు, సంసారహారి, గజదనుజారి, అంధకాసురుని చీల్చి చెండాడిన శూలపాణి, యముడిని అదుపు చేసిన శివుడికి నమస్కరిస్తున్నాను సర్వమంగళ కళావిలాసాలతో, కదంబ పూల నుండి వచ్చే తేనెల గుభాళింపులకు, గండు తుమ్మెదలా ఆసక్తుడై చెలగు ప్రభువైన ఆ నటరాజుకి మ్రొక్కుతున్నాను.వేగంగా చరిస్తూ, సర్పాలు చేసే బుసల శ్వాసలకు, మరింతగా రాజుకుని ఎగసిపడే అగ్ని కీలలతో ఉన్న నుదురు గల రుద్రుడికీ, ధిమి, ధిమి అను మద్దెల సమున్నత మంగళ ధ్వనులకు తగినట్లుగా అడుగులు వేస్తూ తాండవించే నటరాజుకి జయము జయము.కటికనేలను, హంసతూలికా తల్పాన్ని – సర్పాన్ని, చక్కని ముత్యాల దండను, మహారత్నాన్ని, మట్టిబెడ్డను, గడ్డిపరకను, కలువకంటిని, సామాన్య ప్రజలను, భూమండలాధీశుడైన మహారాజును, మిత్ర పక్షాన్ని, శత్రుపక్షాన్ని సమప్రవృత్తితో తిలకించే సదాశివుడికి తాను సేవ చేసుకుంటాను.గంగానది ఒడ్డున ఆశ్రయం ఏర్పాటు చేసుకుని, చిత్తమున గల దురాలోచనలను విడిచి, చంచల దృష్టిని స్థిరంగా చేసి, నుదుటిమధ్య మనసు నిలిపి, శివనామ మహామంత్రాన్ని ఉచ్చరిస్తూ తరించే మహాభాగ్యం నాకెప్పుడు కలగాలి.నిత్యమూ ఈ స్తోత్రం చదివినా, అర్ధాన్ని స్మరించినా, వివరిస్తూ పలికినా, మానవుడు పరిశుద్ధుడవుతాడు. మహా శివ భక్తుడవుతాడు. శివశక్తి సంపాదనకు ఇంతకన్నా మరో దారి లేదు. శరీరధారుల అజ్ఞానం శివ ధ్యానంతో మాత్రమే నశిస్తుంది.ప్రదోషకాలంలోనూ శివపూజ ముగింపులోనూ ఎవరీ శివార్చన పరమైన రావణకృతియైన ఈ స్తుతిని పఠిస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుంది. రథగజతురంగాలతో సదా సుప్రసన్నుడై స్థిరసంపదలు పొందగలడు.- యామిజాల జగదీశ్
August 6, 2020 • T. VEDANTA SURY • News