ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
లైట్ హౌస్---లైట్ హౌస్ నుంచి వెలువడే కాంతిపుంజం సముద్ర జలాలపై ప్రయాణం చేసే నౌకలకు చీకట్లో తీరం ఉనికిని తెలియ జేయడానికి ఉపయోగపడుతుంది. మన దేశంలో మొత్తం 179 లైట్ హౌసులున్నాయి. అతి ఎత్తయినది గుజరాతులో ఉంది.నేను మద్రాసులో లైట్ హౌసుని తీరం నుంచే చూశాను. లోపలికెళ్ళి చూడాలనే కోరిక నేటి వరకూ తీరలేదు. మెరీనా బీచ్ ఒఢ్ఢున ఉంది. ఆలిండియా రేడియో స్టేషనుకి ఎదురుగాకామరాజర్ శాలైలో ఉందీ లైట్ హౌస్. దీనిని కడర్ కరై శాలై అని కూడా అంటారు. బీచ్ రోడ్డు అని అర్థం. మెరీనా బీచ్ ఒడ్డున ఉత్తర భాగాన దీనిని చూడవచ్చు. కామరాజర్ రోడ్డు, శాంతోం హై రోడ్డు, డాక్టర్ రాధాకృష్ణన్ రోడ్డు కలిసే కూడలిలో పది అంతస్తులతో కూడిన కట్టడమే ఈ లైట్ హౌస్. వీటిలో తొమ్మిది అంతస్తుల వరకూ వెళ్ళడానికి లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ కట్టడంలో 242 మెట్లున్నాయి. దీనిని పునర్ నిర్మించిన తర్వాత 2013 నవంబర్ 14 నుంచి దీనిని ప్రజలు తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు.గతంలోకెళ్తే, 1796 లో మొదటిసారిగా సెంట్ జార్జ్ కోటలో మొట్టమొదటిసారిగా లైట్ హౌసు ఏర్పాటు చేసారు. అయితే 1844 లో ఫ్లవర్ బజార్ ఈస్టిండియా వర్తకులు 161 అడుగుల ఎత్తున ఓ లైట్ హౌస్ ని నెలకొల్పారు.1894లో మద్రాసు హైకోర్టు భవన ప్రాంగణంలో 175 అడుగుల ఎత్తున ఉన్న గోపురంపై ఓ దీపం ఏర్పాటు చేశారు.1977 లో మెరీనా బీచ్ తీరాన 45 మీటర్ల.ఎత్తున లైట్ హౌస్ నెలకొల్పారు. .1994 లో భద్రతను దృష్టిలో ఉంచుకుని లైట్ హౌస్ సందర్శించడాన్ని నిషేధించారు.మరో పదిహేడేళ్ళ తర్వాత 2013లో ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. ఇదిలా ఉండగా, మహాబలిపురంలోనూ ఓ లైట్ హౌస్ ఉంది. దీనినీ దగ్గర నుంచే చూశాను. పల్లవుల కాలంలో ఇది నిర్మితమైంది. 1904 నుంచి ఇది పూర్తి స్థాయిలో పని చేయడం మొదలుపెట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా 2001లో సందర్శకులెవరూ దీనిని చూసేందుకు వీలులేకుండా నిషేధం విధించారు. 2011లో కట్టుదిట్టమైన భద్రతతో సందర్శకుల వీక్షణకు అనుమతిస్తున్నారు.- యామిజాల జగదీశ్
June 24, 2020 • T. VEDANTA SURY • Memories