ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వజ్రాలవాన-డి.కె.చదువులబాబు--9440703716
October 4, 2020 • T. VEDANTA SURY • Story

చంద్రగిరి రాజ్యానికి రాజు చంద్రసేనుడు.
ఆయన  పాలనలో రాజ్యం పాడిపంటలతో
తులతూగుతూ ఉండేది. ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు.
   ఒకరోజు మహాతపశ్శక్తి సంపన్నుడైన ఋష్యంతుడనే మునీశ్వరుడు ఆ రాజ్యానికొచ్చాడు.రాజు ఆయనను గౌరవంగా ఆహ్వానించి,కాళ్ళు
కడిగి అతిథి మర్యాదలతో  సేవించాడు.
ఆయన రాజు వినయ విథేయతలకు,భక్తికి,
రాజ్యపరిపాలన నైపుణ్యానికీ సంతోషించాడు.ప్రజలకు ఉపయోగపడే ఏవైనా రెండు వరాలను కోరుకోమన్నాడు.
చంద్రసేనుడు ఆయనకు నమస్కరించి...
"మహర్షీ! నా ఆధీనంలో ఉన్న
చంద్రగిరి రాజ్యంలో ప్రతిరోజూ వజ్రాలవాన కురిసేలాఅనుగ్రహించండి"అనికోరుకున్నా డు.
ఋష్యంతుడు నవ్వి "మహారాజా!మీ కోరిక సమంజసంగా లేదు,మరేదయినా కోరుకోండి"అన్నాడు.
"మీరు కోరుకోమన్నారు.నేను కోరుకున్నాను. రాజువద్దమాత్రమేకాకుండా,నాప్రజలందరివద్దా సంపద ఉండాలని నా కోరిక.మీకు సమంజసంగాలేదనిపిస్తే కనీసం మాసానికి ఒక్కసారయినానారాజ్యంలోవజ్రాలవానకురిసేలా అనుగ్రహించండి."అన్నాడు.
"అలాగే !మీకోరికతీరుస్తాను.ప్రతినెలా పౌర్ణమి నాడు వెన్నెల్లో వజ్రాలవాన కురుస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో నన్ను స్మరించి రెండవకోరిక కోరుకో.తీరుస్తాను."అని చెప్పి వెళ్ళి పోయాడు.
ఆనెలనుండీ ప్రతినెలా పౌర్ణమినాడు వెన్నెల్లో వజ్రాలవాన కురవసాగింది.ప్రజలు ఎవరిశక్తికొలదీ వాళ్ళు వజ్రాలను తెచ్చి ఇళ్ళునింపుకున్నారు.పొరుగు రాజ్యాలకెళ్ళి గుర్రం బండ్లుకొని,నిత్యవసర సరుకులు,అవసరమైనవన్నీ వజ్రాలతోకొనితెచ్చుకోసాగారు.రైతులు పంటలుపండించడంమానుకున్నారు.అన్నివృత్తులవాళ్ళూ వాళ్ళపనులు మానుకున్నారు.సోమరిగా కూర్చుని పనికిరాని కబుర్లతో,పులిజూదం లాంటి
ఆటలతో గడపసాగారు.వైద్యులు వైద్యంమానుకున్నారు.ఇంటినిండా వజ్రాలు మూల్గుతుంటే ఉద్యోగంతో పనేముందని
ఉద్యోగులు,సైనికులు వాళ్ళఇళ్ళలో ఉండిపోయారు.మొక్కలు నాటే వాళ్ళు లేక,చెట్లను సంరక్షించే వాళ్ళు లేక ఎండిపోయాయి.వర్షాలు ఆగిపోయాయి.చెరువులు,బావులూవానలేకఅడుగంటాయి.భూములుబీళ్ళయ్యాయి.చిన్నచిన్న జబ్బులక్కూడా పొరుగురాజ్యాలకు పరుగెత్తడం కష్టంగా మారింది.
ప్రతి అవసరానికీచంద్రగిరి రాజ్య ప్రజలందరూ పొరుగురాజ్యాలపై పడ్డారు.ఆ సంవత్సరం పొరుగురాజ్యాల్లో కరువుతో పంటలుసరిగా పండలేదు.ఎన్ని వజ్రాలిస్తామన్నా మిగులుపంట లేక అమ్మేవారులేరు.వజ్రాలు తినటానికి పనికిరావుకదా!చంద్రగిరి ప్రజలకు సంపదఉన్నా తిండిగింజలు దొరకని పరిస్థితి ఏర్పడింది.సరైన తిండిలేక పశుసంపద తగ్గిపోసాగింది.దూరదేశాలకు వెళ్ళిఅవసరమైనవన్నీ కొనితెచ్చుకోవటం చాలా కష్టంతో కూడినపని.తమ వద్ద నిల్వఉన్న సరుకులు ఖర్చయిపోతే తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డారు.
  పరిస్థితి ఇలాఉంటే దురంధరుడనే పొరుగుదేశం రాజుకు వజ్రాలవాన గురించి
తెలిసింది.చంద్రగిరిరాజ్యాన్నిజయించి,ఆక్రమించుకుంటే సంపదకు కొదవ ఉండదని భావించి యుద్దం ప్రకటించాడు.
సైనికులు లేకపోవటంతో చంద్రసేనుడికి ఏం చేయాలో పాలుపోలేదు.రాజు,మంత్రులు రాబోయే యుద్దంగురించి రాజ్యంలో స్వయంగా ప్రకటించారు.సైన్యంలోచేరమని ఆహ్వానించారు.ఇంటినిండా వజ్రాల సంపదఉంటే ప్రాణాలకు తెగించి
యుద్దమెందుకు చేయాలి?రాజు ఎవరైతే ఏంటి ? కూర్చొని తినటానికి వజ్రాలవానఉందిగా!'అని ప్రజలు మిన్నకుండిపోయారు.ఫలితంగా దేశభక్తి
కూడా మాయమైంది.రాజుకు ఏంచేయాలో
పాలుపోలేదు.
చంద్రసేనుడు పరిష్కారంకోసం శతవిధాలా
ఆలోచించి ,చివరకు ఒక నిర్ణయానికొచ్చాడు.
'అయ్యా!దురంధరమహారాజా!మీరు వజ్రాలవాన కోసం మా రాజ్యాన్ని ఆక్రమించ వలసిన పనిలేదు.మీరు నాకు మూడు  మాసాల సమయమిస్తే సువిశాలమైన మీ రాజ్యమంతటా వజ్రాలవాన కురిసేలా చేయగలను.నేను అలా చేయలేనిచో నా రాజ్యాన్ని నేనే మీకు అప్పజెబుతాను. ఆలోచించుకోండి'అని దేశభక్తిపరుడైన తన అంతరంగికుడితోదురంధరుడికి వర్తమానం పంపించాడు చంద్రసేనుడు.
"తన రాజ్యమంతటా వజ్రాలవానకురిసేలా
చంద్రసేనుడు చేయగల్గితే అంతకంటే కావల
సిందేముంది?తన రాజ్యంలో వజ్రాలవాన
ప్రారంభమైన తర్వాత తీరిగ్గా చంద్రగిరిని ఆక్రమిస్తే సరిపోతుంది.రెండురాజ్యాలూ
తన వే అవుతాయి'అని  ఆలోచించి ఒప్పుకున్నాడు దురంధరుడు.
జీవుల ప్రాణాలను నీరు,ఆహారం మాత్రమే కాపాడగలవని,వాటిని సమకూర్చే వర్షం చినుకులు వజ్రాలకంటే విలువైనవని, నీటినిమించిన సంపదలేదని
చంద్రసేనుడు గ్రహించాడు.తన రెండవ వరంగా వజ్రాలవానను నిలిపేసి,
వర్షాన్ని ప్రసాదించమని ఋష్యంతుడిని ప్రార్థించాడు.
ఆ మాసంనుండి వజ్రాలవాన ఆగిపోయింది.వర్షం కురవసాగింది.ప్రజలు రెండుమాసాలు ఎదురు చూసారు.వజ్రాల జాడలేదు.ఉన్నవజ్రాలతో ఆహారధాన్యాలు కొందామంటే,ఏరాజ్యం పంటలు  ఆరాజ్యప్రజలకు సరిపడటమే కష్టమయింది.
చంద్రగిరి రాజ్యప్రజలందరికీ అందజేసే స్థాయిలో మిగులు పంటలేదు.
'శరీరంలో అన్ని అవయవాలు దేనిపని
అవి సక్రమంగా చేస్తే శరీరం బాగుంటుంది.
అలాగే ఎవరిపని వారుసక్రమంగా చేస్తే , సమాజం,రాజ్యం బాగుంటుంది. వజ్రవైఢూర్యాలు కడుపునింపలేవు.'అని ప్రజలు గుర్తించారు.
రైతులు బీడుభూములను బాగుచేసుకుని
వ్యవసాయం చేపట్టారు.అన్ని వృత్తులవాళ్ళు ఎవరి పనివారు చేయసాగారు.సైనికులు,ఉద్యోగులు వారి పనుల్లో చేరారు.
చంద్రగిరి రాజ్యంలో వజ్రాలవాన ఆగిపోయిందని,సైనికులు విధుల్లో చేరిపోయారని తెలిసి యుద్దప్రయత్నం మానుకున్నాడు దురంధరుడు.
ఏ అవయవం పని చేయకుండా సోమరిగా తింటూ కూర్చుంటే శరీరం ,ఆరోగ్యం ఎలా పాడవుతాయో,పౌరులు కూడాసోమరులై
తే రాజ్యంకూడా పాడవుతుందని,పాడి పంటలకు,వృత్తికి,శ్రమకు మించిన సంపద లేదని,రాజు,ప్రజలూ తాముచేసిన పొరపాటును తెలుసుకున్నారు.
అనతికాలంలోనే చంద్రగిరి రాజ్యంలో ప్రతి ఇల్లు పాడిపంటలతో నిండిపోయింది.