ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వరలక్ష్మీ విజయం (కథ).సరికొండ శ్రీనివాసరాజు--మధు 1వ తరగతి నుంచి ఆ తరగతిలో మొదటి ర్యాంకు వచ్చేవాడు. ఇప్పుడు 9వ తరగతిలోకి వచ్చాడు. రమేశ్ అనే అబ్బాయి ఎప్పుడూ రెండో ర్యాంకు వచ్చేవాడు. వరలక్ష్మి అనే అమ్మాయి 3వ ర్యాంకు వచ్చేది. అయితే మధు, రమేశులు ఇద్దరూ ఎవరికి వారు విడిగా చదువుకునేవారు. ఎవరితో కలసి చదవడం కానీ, ఎవరికీ చదువులో సహాయం చేయడం కానీ చేయకపోయేవారు. అలా చేస్తే ఇంకెవరైనా తమకు పోటీ వస్తారని వారి భయం. వరలక్ష్మి మాత్రం తన స్నేహితులతో కలిసి చదివేది. చదువులో వెనుకబడిన వారిని బతిమాలి, ఆఖరికి తిట్టి అయినా వారికి చదువు చెప్పేది. అలా ఎంతోమందిని తెలివైన వారిని చేసింది. ఒకరోజు వరలక్ష్మి తన స్నేహితులు అయిన ఆశ్రిత, అలివేలు, శ్రావణి, స్రవంతి, స్వాతి, శివానీలతో కలసి చదువుకుంటుంది. అప్పుడు అటుగా వెళ్తున్న మహేంద్ర మధుతో "చూడరా మధు! అమ్మాయిలు ఎంత చక్కగా కలసి చదువుకుంటున్నారో! అలా కలసి చదువుకోవడం వల్ల అందరికీ ఉపయోగం. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నీ తెలివిని ఎవరికీ పంచడం లేదు. ఏనాటికైనా ఆ అమ్మాయిలే బాగుపడతారు." అన్నాడు. అప్పుడు మధు "వారి మొహం! వారందరి మార్కులు కలిపినా జన్మలో నా మార్కులన్ని కావు. వారేమి బాగు పడతారు. నీకు బాగుండాలని ఉంటే వాళ్ళతో కంబైన్డ్ స్టడీ చేయరా!" అని పగలబడి నవ్వాడు. వీడికి జన్మలో మరచిపోనంత బుద్ధి చెప్పాలని అనుకుంది వరలక్ష్మి. తన స్నేహితులతో ఇలా అంది. "రేపటి నుంచి మనం మరింత పట్టుదలతో చదవాలి. మంచి మార్కులు రావాలంటే ముందు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినాలి. అమ్మమ్మ చెప్పిన కథలవై, మనకు నచ్చిన సినిమాలపై ఎంత శ్రద్ధ చూపుతామో మన గురువులు చెప్పే పాఠాలపై అంత శ్రద్ధ చూపించాలి. ఆ చెప్పిన పాఠాలను ఇంటివద్ద టెక్స్ట్ బుక్స్ తీసి మరింత శ్రద్ధగా చదవాలి. ఈ రెండు సంవత్సరాలు మనం పూర్తి పట్టుదలతో చదివితే విజయం మనదే. ప్రతిరోజూ ప్రణాళిక వేసుకొని ఖాళీ సమయంలో బృందంగా చదువుదాము." అని. వరలక్ష్మి పిలుపు మేరకు రెట్టించిన ఉత్సాహంతో చదవడం ప్రారంభించారు అమ్మాయిలంతా. "అమ్మాయిలు ఎవ్వరూ ఫెయిల్ కాకూడదు." అని చెప్పి ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించింది. 9వ తరగతి పూర్తి అయ్యేసరికి మధు అనూహ్యంగా 10వ ర్యాంకుకు పడిపోయాడు. మొదటి 9 ర్యాంకులను అమ్మాయిలే సాధిస్తున్నారు. 10వ తరగతికి వచ్చేసరికి మధు మరింత శ్రద్ధగా చదవడం మొదలు పెట్టాడు. కానీ ఎవరికీ సాయం చేయడం లేదు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో సైతం మొదటి 10 ర్యాంకులు అమ్మాయిలే సాధించారు. మధు 11వ ర్యాంకు సాధించాడు. మార్కుల మెమోలు తీసుకోవడానికి అందరినీ ఒకేరోజు రమ్మని, ఆరోజు అందరితో సమావేశం ఏర్పాటు చేశారు ప్రధానోపాధ్యాయులు. మంచి మార్కులు సాధించిన అమ్మాయిలు అందరినీ పేరు పేరునా అభినందించారు.‌ మొదటి ర్యాంకు సాధించిన వరలక్ష్మికి మూడు వేల రూపాయలను బహూకరించారు. తదుపరి 9 ర్యాంకుల విద్యార్థులకు మంచి బహుమతలు అందించారు. వరలక్ష్మికి ఆమె స్నేహితులు కృతజ్ఞతగా అందరూ కలిసి విలువైన బహుమతిని అందించారు. వరలక్ష్మి వద్దన్నా వినిపించుకోలేదు. వరలక్ష్మి స్నేహితులు మధుతో ఇలా అన్నారు. "ఆనాడు నువ్వు మమ్మల్ని హేళన చేయడంతో పట్టుదలతో చదివి మేము ఏమిటో నిరూపించుకున్నాము‌ పంచేకొద్దీ పెరిగేది విద్య అని మన గురువులు చెప్పిందే కదా! అలా వరలక్ష్మి తన చదువును ఎందరికో పంచి, ఒక దీపంతో మరెన్నో దీపాలను వెలిగించింది. ఆ పుణ్యంతో ఆమె మొదటి ర్యాంకు సాధించింది. ఆమె ప్రోత్సాహం ఫలితంగా మాకు భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండబోతుంది. వరలక్ష్మిని జీవితాంతం మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం. మరి నీకు ఎంతమంది కృతజ్ఞతలు చెప్పుకుంటారు." అని. ‌ సిగ్గుతో తల వంచుకున్నాడు మధు.
August 11, 2020 • T. VEDANTA SURY • Story