ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వాడుకభాషా వత్సలుడు(గిడుగు రాంమూర్తి): పచ్చిమట్ల రాజశేఖర్ జగిత్యాల9676666353
August 30, 2020 • T. VEDANTA SURY • Poem

పాలకభాష పండితభాష
ప్రామాణిక భాషంటూ
భాషను బహురూపుల బంధించి
శుద్ధగ్రాంథీకంలో సాహిత్యరచన జేసి
విద్యను బ్రహ్మపదార్థంగా
సామాన్య జనానికి సదువు వాసన సోకకుండా
పండితుల వంటింటి కుందేలునుజేసి
వాడుకభాషకు విలువనీయక
మేధావులంతా తత్సమభాషను
మేథస్సు నిదర్శనంగా ఊరేగుతున్న కాలంలో
ప్రజలభాష పరపతిపెంచి
సదువులతల్లిని సర్వజనుల
చేరదీసి చేయికందించిన
వ్యవహారికభాషోద్యమపితామహుడు గిడుగు

మాటలుతప్ప లిపిలేని
సవరభాషను సవరించి
సవర సాహిత్య సృజనకు
పునాదివేసిన భాషాశాస్త్రవేత్త గిడుగు

తెలుగుపత్రికను స్థాపించి
పండితప్రశంసాయుత గ్రాంధికభాషను గద్దెదించి
పామరజనరంజక ప్రజలవాడుకభాషకు పట్టంగట్టి
మాటలకుమాత్రమే పరిమితమై
గ్రామ్యంగా ముద్రవేయబడి
పలురకాల పరిహాసమొందిన
పల్లెభాషను
కావ్యభాషగా మెరిపించి మురిసిన భాషాయోధుడు గిడుగు!
సాధారణభాషలో సాహితీసృజనకు బాటలువేసిన సాహిత్యపిపాసి గిడుగు!

మాట్లాడేభాష వేరు సదివే భాష వేరుగ
చదివేపిల్లల శ్రమజూసి
పాఠ్యపుస్తకాలన్ని ప్రజలభాషలుండాలని
సాహిత్యమేగాక విజ్ఞానాన్ని
ప్రజలభాషకు మార్చి
సదువులమ్మను సామాన్యప్రజల లోగిల్లలో నిలిపిన 
అపర భగీరథుడు గిడుగు