ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వింత నక్క (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
November 16, 2020 • T. VEDANTA SURY • Story
అనగనగా ఓ జిత్తులమారి నక్క. దానితో ఎవ్వరూ స్నేహం చేయడం లేదు. దానిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆ నక్క ఎదురు పడితేనే ముఖం చాటేసుకొని వెళ్తున్నాయి జంతువులు, పక్షులు. చాలా జీవులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తనకు ఎందుకు లేదని బాధపడుతుంది నక్క. ఇక లాభం లేదనుకుని తానూ మిగతా జీవులను అనుకరించాలనుకుంది. అలా చేస్తే అన్ని జీవుల దృష్టి తనమీద పడుతుందని, తన గౌరవం అమాంతంగా పెరిగిపోతుందని అనుకుంది.
 
       ఒకరోజు అది నెమలిలా నాట్యం చేయాలని అనుకుంది. ప్రయత్నం చేయసాగింది. ఆ నక్క చుట్టూ చాలా జంతువులు చేరి పగలబడి నవ్వసాగాయి. హేళన చేయడం మొదలు పెట్టాయి‌ అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరో రోజు రాయంచను అనుకరిస్తూ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుంది. మళ్ళీ చాలా జీవులు గుమిగూడి హేళన చేయసాగాయి. మళ్ళీ అవమానంతో వెళ్ళిపోయింది. 
 
      ‌మరి అందరూ తనను గుర్తించాలంటే ఏమి చేయాలబ్బా! అనుకుంది. కోకిల గానానికి ఎంతో మంది పరవశించిపోతారు కదా! కోకిలను తలదన్నేలా పాడాలని అనుకుంది. వినూత్నంగా పాడటానికి ప్రయత్నించింది. ఏ జీవీ పట్టించుకోవడం లేదు. ఇక లాభం లేదనుకుని ఆపకుండా పాటలు పాడుతూనే ఉంది. కర్ణ కఠోరమైన ఆ శబ్దానికి అటుగా వెళ్తున్న ఎలుగుబంటికి చికాకు వేసింది. వెనుక నుంచి అమితమైన వేగంతో వస్తూ నక్క మీద దాడి చేసింది. ఆ దెబ్బకి నక్క మరో నెలరోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. 
 
       ఇక లాభం లేదనుకుని రకరకాల రంగులను పులుముకుని అడవిలో ప్రవేశించింది. ఈ నక్కకు పిచ్చి పట్టిందని అందుకే వింతగా ప్రవర్తిస్తుందని నిశ్చయించి ఆ అడవి జంతువులు నక్కను ఆ అడవి నుంచి వెళ్ళగొట్టాయి. వెళ్తూ వెళ్తూ తన బాధను కుందేలుకు చెప్పుకుంది. అప్పుడు కుందేలు ఇలా అంది. "నీ వింత ప్రవర్తనకు కారణం ఇదా నక్క మామా! ప్రతి ప్రాణిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను నిలుపుకుంటే దానికి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. తన ప్రత్యేకతను చంపుకొని మిగతా వాటిని అనుకరిస్తే ఇలాగే నవ్వులపాలు కావాల్సి వస్తుంది. అన్ని ప్రాణులతో స్నేహం చెయ్యి. వాటికి ఏ రకమైన సహాయం కావాలన్నా చెయ్యి. ఆపదలో ఆదుకో. ఏ ప్రాణికీ అపకారం చేయకు. అప్పుడు చూడు. నిన్ను గుర్తించని జీవి ఉండదు." అంది. నక్క సరేనంది. కుందేలు మిగతా జంతువుల వద్దకు వచ్చి, "ఈ నక్కను ఈ ఒక్కసారికి వదిలిపెడదాం. మరోసారి వింతగా ప్రవర్తిస్తే అడవి నుంచి వెళ్ళగొడుదాం." అని అంది. సరేనన్నాయి. నక్క అప్పటి నుంచి కుందేలు చెప్పినట్లు నడుచుకుంటూ మంచిపేరు తెచ్చుకుంది.