ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
విద్య నిగూఢమగు విత్తము --ఎం బిందుమాధవి
November 12, 2020 • T. VEDANTA SURY • Story

"విద్య నిగూఢగుప్తమగు విత్తము; రూపము పురుషాళికిన్
విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే?!"

విద్య -చదువు అనేది సర్వకాల సర్వావస్థలయందు వాంఛింపదగినది.

విద్యార్జనలో అంతర్లీనంగా సంపాదనా శక్తి ఉండటం వల్లనే విద్య కలిగిన వారు భోగములు పొందుతారు అని చెప్పబడింది.
ధనాన్ని ఎవరయినా దొంగిలించే అవకాశం ఉన్నది కానీ, విద్యని దొంగిలించలేరు.
ఇతరులతో పంచుకున్న కొద్దీ పెరిగేది, విద్య....తరిగేది ధనం!

చదువుకున్న వ్యక్తుల  రూపం- ఆహార్యం- వ్యక్తిత్వం..... వారి విద్యా స్థాయిని చెప్పకనే చెబుతాయి.

 రిక్త హస్తాలతో....  మనవారెవరూ లేని దూరదేశం వెళ్ళవలసివచ్చినా, మన విద్య మనకి జీవనాధారమై కడుపు నింపుతుంది.
పూర్వం రాజరికాలు ఉండే రోజుల్లో.....పండితులకి  పదిమంది మధ్యలో ప్రత్యేకతని చాటి, రాజుల ఆశ్రయాన్ని సాధించి పెట్టినట్లుగా చరిత్రలోను ... ఎన్నో కధల్లోను, మనం చదువుకున్నాము.

సమకాలీన సమాజంలో మనం విద్య ప్రాధన్యాన్ని తెలుసుకుని ఎలా ప్రయోజనాన్ని  పొందుతున్నామో ఈ కధ ద్వారా మరింత విపులంగా తెలుసుకుందాము.

******

మాలతి బాల్యం  లో స్కూల్ కెళ్ళి అందరి అమ్మాయిల్లాగే  హై స్కూల్ చదువు పూర్తి చేసింది. అంతకు మించి చదివించే స్థోమతు లేక, తండ్రి కుటుంబరావు తన పరిచయస్తుల్లో వెతికి తన స్థాయి కి తగ్గట్టు పెళ్ళి చేశాడు.

మాలతి మొదటి నించీ మంచి చురుకైనది.
అత్తగారింటికి వెళ్ళాక తన భర్త మానసిక ఎదుగుదల లేని మనిషి అనే విషయం తెలిసింది. పెళ్ళికి ముందు ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు, మగ పెళ్ళివారు.
తండ్రి కుటుంబ స్థితిగతులు తెలుసు కనుక....ఈ విషయం బయటపెడితే తల్లి-తండ్రి తన్ని బుజ్జగించి ఎలాగో సర్దుకుపోమ్మా! ఇప్పుడు నువ్వు రాద్ధాంతం చేస్తే నీ తరువాతి పిల్లల
జీవితాలు ఇరుకున పడతాయి అని తనకే నచ్చ చెబుతారు.

అందువల్ల జరిగే ప్రయోజనం కంటే, నష్టం ఎక్కువ అని మనసులో నిర్ధారించుకుని...తన జీవితంలో జరిగిన ఈ నష్టాన్ని ఎలా చక్కదిద్దాలా అని ఆలోచించింది.

అత్తమామలు పల్లెటూరివారు. వారికి కూడా చదువు సంధ్యలు లేవు. మాలతిది  హైస్కూల్ చదువే అయినా...చదువుకున్న కోడలు అని గౌరవంగా చూసేవారు.

మాలతి భర్త కృష్ణ చేతిపనులు బాగా చేస్తాడు. మానసిక ఎదుగుదల తక్కువ కనుక చదువైతే లేదు కానీ... ఏదైనా పని అప్పచెబితే దిగ్విజయంగా...అవతలి వారు అనుకున్న పద్ధతిలో...పూర్తి చేస్తాడు.

మాలతి ఇక కాలయాపన చెయ్యకుండా... దూరవిద్య ద్వారా తను డిగ్రీ చదివే ఏర్పాట్లు చేసి, భర్తకి చేతివృత్తులకి సంబంధించిన శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేసింది.

మాలతి ప్రయత్నాలు చూసి, అత్తగారు....'అమ్మా మాలతీ వీటికన్నిటికీ  డబ్బు కావాలి కదా. మనదేమో ఒక పూట తింటే రెండో పూట వెతుక్కోవలసిన సంసారం! ఇల్లు స్వంతం కాబట్టి అద్దె కట్టక్కరలేదు కానీ ఇతర ఖర్చులకి మనకున్న పొలం మీద వచ్చే ఆదాయం హానీ-హానిగా సరిపోతుంది. ఇక ఏ వైద్య అవసరాలో వస్తే భగవంతుడి మీద భారం వెయ్యాల్సిందే కానీ అంత ఖర్చులు పెట్టే పరిస్థితి లేదు.'

'నువ్వు చదువుకున్న దానివి...ఎక్కువగా చెప్పక్కరలేదు, మా వాడి మీద పెట్టే ప్రతి పైసా ఖర్చు వృధానే. అంత చురుకు, తెలివి వాడికి లేవు,' అన్నది.

ఆ మాటకి మాలతి ...'అత్తయ్యా, నా పరీక్షలకి ఈ ఊర్లో పని చేస్తున్న టీచర్ సహాయం తీసుకుని చదువుకుంటున్నాను. ....చిన్న క్లాస్ పిల్లలకి ట్యూషన్ లు  చెబుతూ ఫీజులకి కావలసిన డబ్బు సంపాదించుకుంటున్నాను. ఇక మీ అబ్బాయికి డబ్బేమీ కట్టక్కరలేదు. ప్రభుత్వ సంస్థలవారే ఇలాంటివారికి....వారి వారి ఆసక్తిని బట్టి....శిక్షణ ఇస్తారు.'

'మీకు ఇప్పటివరకూ, ఎవరూ చెప్పకపోవటం వల్ల వీటి గురించి తెలియదు. మీరే చూస్తారుగా  ఒక ఏడాది కాలంలో మీ అబ్బాయిలో వచ్చే మార్పుని.' అన్నది.

*****

పిల్లకి పెళ్ళి చేసి పంపించి ఒక ఏడాది అయిందని, చూడటానికి వచ్చారు కుటుంబరావు దంపతులు.

కుటుంబరావు గారు వచ్చేసరికి, మాలతి వాళ్ళ పక్కింటి ఆంజనేయులు గారు కూర్చుని వీళ్ళతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు.

లేచి కుటుంబరావుగారికి నమస్కారం చేసి, ఉభకుశలోపరి అయ్యాక.. 'కుటుంబరావు గారూ, మీ అమ్మాయని చెప్పటం కాదు కానీ...మాలతి మంచి తెలివైన పిల్ల. సంవత్సర కాలంలో ఎన్ని  అద్భుతాలు సాధించిందండీ! గాలికి తిరుగుతున్న చిన్న పిల్లల్ని పోగు చేసి వారికి ట్యూషన్ లు చెబుతూ తను ప్రైవేట్ గా డిగ్రీ చదువుకుంటున్నది. మందబుద్ధి అయిన భర్తకి చేతివృత్తుల్లో శిక్షణ ఇప్పిస్తున్నది. కృష్ణ లో ఎంత మార్పు వచ్చిందో...చూస్తే  మాకు భలే ఆశ్చర్యంగా ఉన్నది.'

'రేపో మాపో అతను కూడా తను నేర్చుకున్న వృత్తి విద్య ద్వారా  సంపాదించే ప్రయత్నాల్లో ఉన్నాడు.'

'ఒక్కసారిగా మా బావ వెంకట్రావు జీవితంలో ఆర్ధికంగానైతేనేమి, నాగరికత పరంగానైతేనేమి చాలా మార్పు వచ్చేసిందండి.'

'మాకు ఈ పల్లెటూళ్ళో చదువులు లేక, చెప్పేవారు లేక ....ఉన్న వసతులు ఉపయోగించుకోవటం తెలియక ఎదుగు-బొదుగూ లేని జీవితాలు గడుపుతున్నాం.'

'మా చుట్టు పక్కలే ఉండి, మేము తెలుసుకోలేకపోయిన విషయాలని, మాలతమ్మ వచ్చి చెప్పి మా జీవితాలని తీర్చిదిద్దుతున్నది,' అని

'ఎంతైనా చదువుకున్నోళ్ళంటే వారి తరహాయే వేరండి,' అన్నాడు.

ఆసక్తి ఉన్నా, పై చదువులు చదివించలేని తన కూతురు...ఆ ఉన్న చదువుతోనే తన జీవితాన్ని తీర్చి దిద్దుకున్న వైనం విని కుటుంబరావు దంపతులు సంతోషించారు.

****
ఆ ఊళ్ళో వంశ పారంపర్యంగా సంగీతాన్ని నమ్ముకుని బతుకుతున్న కుటుంబం, శ్యామశాస్త్రిగారిది.
ఆసక్తి ఉండి, కాస్త వాక్శుద్ధి ఉన్న పిల్లలకి రోజు సాయంత్రం పాఠం చెబుతూ ఉంటారు, ఆయన.

బయటి పిల్లలతో పాటు తన కూతుళ్ళు...కొడుకులకి కూడా శిక్షణ ఇచ్చి తీర్చి దిద్దుతున్నారు.

ఉన్న కాస్త కొండ్ర తో పాటు, సంగీత పాఠం చెప్పుకుంటున్న పిల్లలు ఇచ్చే తృణమో పణమోతో కుటుంబాన్ని గౌరవంగా నడుపుతున్నారు.
కాలంలో .....పిల్లలు  తము నేర్చుకున్న సంగీతంలో ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు.
పెళ్ళిళ్ళయి జీవితాల్లో స్థిరపడ్డారు.

శ్యామశాస్త్రి గారి పట్ల గౌరవం ఉండి,   బాగా చదువుకున్న ....వారి దగ్గర బంధువుల్లో వారే శాస్త్రి గారితో బంధుత్వం కలుపుకున్నారు.

శ్యామశాస్త్రిగారి రెండో కూతురు మణి ఆ ఊళ్ళో ఉన్న హై స్కూల్లో టెంథ్ క్లాస్ పాస్ అయింది. సంగీతం లో రెండు -మూడు స్థాయి పరీక్షలు పాస్ అయింది. పెళ్ళయిన 5-6 సంవత్సరాలకి అల్లుడు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్ళాడు. ఆలోపే సిటీలో మణి సంగీతంలో ఎమ్మే పూర్తి చేసింది.

అమెరికా వెళ్ళిన రెండేళ్ళకి ఒక రోడ్ యాక్సిడెంట్ లో శ్యామశాస్త్రిగారి అల్లుడు వాసు మరణించాడు.

స్కూల్ చదువుల్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని ఆ దేశం కాని దేశంలో పెంచటానికి కావలసిన చదువు-డిగ్రీలు మణికి లేవు.

ఎక్కడో దూరదేశం లో ఉన్న కూతురుకి వచ్చిన కష్టాన్ని తీర్చేశక్తి కానీ, సమర్ధతకానీ శ్యామశాస్త్రిగారికి లేవు. మంచాన పడలేదు కానీ, వార్ధక్యపు తాలూకు అశక్తత వచ్చింది.

దిగులు పడకుండా జీవితాన్ని జాగ్రత్తగా చక్కదిద్దుకోమని హితవు మాత్రం  చెప్పగలిగారు.

ఆ షాక్ నించి తేరుకుని మణి, అక్కడ చుట్టుపక్కల ఉన్న భారతీయ కుటుంబాల సహాయంతో పదిమంది పిల్లలకి సంగీత పాఠాలు చెప్పటం మొదలుపెట్టింది.

శ్యామశాస్త్రి గారి కుమార్తె కనుక శాస్త్రంలో మంచి పట్టున్నది. అదే పది నించి ఇరవై-ముప్ఫై మంది స్టూడెంట్స్ ని అతి తక్కువ కాలంలో సమకూర్చింది.

పరిచయస్తులు-స్నేహితులు కలిసి భారతీయ పండుగలు వచ్చినప్పుడు అక్కడి దేవాలయాల్లో మణి చేత కచేరీలు ఏర్పాటు చేయించేవారు. అలాంటప్పుడు, మణి ముందుగా తన స్టూడెంట్స్ తో తక్కువ నిడివి కచేరీలు పెట్టించి...తరువాత తను పాడేది.

మణి స్టూడెంట్స్ స్థాయిని బట్టి, ఆవిడ నేర్పే విధానం...ఆ దేశలో పుట్టిన  పిల్లలకి అక్కడి యాక్సెంట్ రాకుండా తీసుకునే జాగ్రత్తల గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు దూరప్రాంతాల నించి కూడా తమ పిల్లల్ని మణి  దగ్గర సంగీత పాఠాలకి చేర్పించారు.

మణి  స్టూడెంట్స్ అమెరికాలో అనేక సభల్లో వాయించి తమ గురువు గారికి పేరు తేవటమే కాక, వారి ద్వారా ఆమెకి అనేక సన్మానాలు కూడా జరిగాయి.

వీరుంటున్న రాష్ట్రం లో ప్రభుత్వ పెద్దలని ఒక సారి మణి కచేరీకి ఆహ్వానించటం జరిగింది. అలౌకికమైన ఆ పాటకి, మణి గాత్రానికి ముగ్ధులైన ఆ ప్రభుత్వాధికారులు మణికి సన్మానం చేసి ఇక నించీ ఆ రోజుని "ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ డే" గా నిర్వహించాలని ప్రకటన చేసేసరికి మణికి ఉద్వేగంతో నోట మాట రాక కంటినిండా నీటితో తనకి అలాంటి విద్యని బోధించిన తండ్రి కి చేతులెత్తి మొక్కింది.

మణి పిల్లలు పెద్దవాళ్ళయి, చదువులు పూర్తయ్యాక తమ తల్లి తనకి తెలిసిన సంగీత విద్య ద్వారా సాగించిన జీవన పోరాటాన్ని అందరికీ ఎంతో గొప్పగా చెప్పేవారు.

*******

మాలతి పెళ్ళయి వచ్చే నాటికే మణి పట్నం వెళ్ళటం...అక్కడి నించి అమెరికా వెళ్ళటం...అక్కడ భర్తని పోగొట్టుకుని బెంబేలెత్తిపోకుండా జీవితానికి ఎదురీది పిల్లల్ని పెంచుకోవటం ....ఊళ్ళో ఆ నోటా-ఈనోటా విన్నది.

శ్యామశాస్త్రి గారి సంగీతం గురించి అందరూ గొప్పగా చెప్పుకోగా విని, ఆయనలాంటి పండితుడిని చూసే భాగ్యం కలగనందుకు విచారించేది.

ఆ సంవత్సరం వేసవిలో మణి పిల్లలు అర్జున్-ఆలేఖ్య తమ అమ్ముమ్మ గారి ఊరు చూద్దామని వచ్చారు.

అందరి ఇళ్ళకి తీసుకెళ్ళి పిల్లల్ని పరిచయం చేసింది. మాలతి వాళ్ళ ఇంటికొచ్చి, 'ఏమ్మా నీ గురించి అందరూ గొప్పగా చెప్పారు. నేను ఈ ఊరి ఆడపడుచుని కదా! చాలా సంతోషించాను. ఊరి రూపురేఖలు మార్చేశావని, ఎవరెవరి సమర్ధతలని బట్టి వారికి వృత్తి విద్యలు నేర్పిస్తున్నావని ఇందాక ఆంజనేయులు పెదనాన్నగారింటికి వెళ్ళినప్పుడు చెప్పారు.' అన్నది.

మణి కి జీవితం లో ఎదురైన పరీక్షలు, ఆవిడ వాటిని పరిష్కరించుకున్న తీరు విని ఉండటం వల్ల మాలతి సిగ్గుతో తలవంచుకుని, 'మీకంటే ఎక్కువేం కాదండీ! దేశం కాని దేశంలో, మన భాష రాని చోట...ధైర్యంగా నిలబడి మీకొచ్చిన విద్యతో పిల్లల్ని చదివించుకోవటమంటే మాటలు కావు కదండీ!'

'మీరు మన ఊళ్ళో అందరికీ మీ అనుభవాలు చెప్పి ఆ స్ఫూర్తి వారిలో కలిగించాలండీ' అన్నది.

ఆ సాయంత్రం జరిగిన  ఆత్మీయ  సన్మాన సభలో మణి అందరికీ నమస్కరించి

"విద్య నిగూఢగుప్తమగు విత్తము; రూపము పురుషాళికిన్
విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్ "

అని చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నాకు దాని అర్ధం పూర్తిగా బోధపడలేదు. ఇప్పుడు  నా జీవితం లో జరిగిన అనుభవాల ద్వారా తెలిసింది.

"విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే?!"

సంగీతం పాడేవారినే  కాదు, వినే వారిని కూడా అలౌకికమైన స్థితికి తీసుకెళుతుంది అని ఆ దేశం లో మన భాష కాని వారిని కూడా అలరించగలదు అని నాకు ప్రభుత్వం తరఫున జరిగిన సన్మానాలు నిరూపించాయి.

ఎవరైనా డబ్బిస్తే ఏదో ఒకరోజు అది అయిపోతుంది. అదే మనకి విద్య ఉంటే అది మనకి ఎప్పుడైనా బ్రతికేటందుకు ఉపాధి  చూపిస్తుంది.

ఎక్కడ ఆగిపోయిన జీవితమైనా మళ్ళీ చిగిర్చి వృక్షమై మనకి  నీడనిస్తుంది.

విద్య ఏది అనేది కాదు, మనం ఎంత చిత్తశుద్ధితో నేర్చుకుంటున్నాము అనేది ముఖ్యం!
ఏ విద్య అయినా అది 'వినయం'తో కూడుకుని ఉంటే మనని పదిమందిలోను ఉన్నత స్థాయిలో నిలబెట్టి ఆత్మస్థైర్యంతో బతికేట్లు చేస్తుంది!

అందువల్లే విద్యలేని వాడు మనిషి కాదు, పశువుతో సమానం అన్నారు పెద్దలు.

మీరందరు ఇలాగే చక్కగా మీకున్న అవకాశాలని ఉపయోగించుకుని మంచి మంచి చదువులు చదివి ఊరికి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ' అని కూర్చున్నది, మణి.

పూర్తిగా అర్ధం కాకపోయినా తల్లిని అందరూ గౌరవించి, సన్మానం చెయ్యటం చూసిన అర్జున్-ఆలేఖ్యలకి తల్లి మీద గౌరవం మరింత పెరిగింది.