ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
విలక్షణ రీతిలో తెలుగు పదాలను మన ముందుకు తెచ్చిన నుడిగుడి. -- విజ్జిక.
October 15, 2020 • T. VEDANTA SURY • Book Review

ఆధునిక సమాజంలో తెలుగు భాష మీద గౌరవం తగ్గడమే కాక, తెలుగు నేర్చుకోవటం,  మాట్లాడటం, వ్రాయటం, అన్నీ అంతంత మాత్రమే అని మనందరకూ తెలుసు. అంతరించిపోతున్న తెలుగు భాషను అందరి ముందుకి ...అభివృద్ధిలోకి తేవాలని కృషి చేస్తున్న,.. కంకణం  కట్టుకున్న భాషాభిమానులు, 
సాహిత్యాభిమానులూ, కవులూ ఎంతోమంది ఉన్నా.. ....ఇటీవల కాలాన భాషమీద ఎనలేని ప్రేమతో  అవిరళ కృషితో   అపూర్వం  అమోఘం అనితర సాధ్యం అనే విధంగా రచించిన నుడి గుడి  గ్రంథ రచయిత్రి శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు ప్రథమ శ్రేణిలో ఉన్నవారనిచెప్పాలి.అంతే
కాదు ఈనాటి సాహితీ లోకాన పలు సాహితీ ప్రక్రియా రచన గావిస్తూ. ఉండటమే కాక  వక్తగా,
సమీక్షకురాలిగా , గాయనిగా బహుధా ప్రశంలందుకుంటున్న
విశిష్ట  కవయిత్రి రచయిత్రి సాహితీవేత్త రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు.
        వీరు రచించిన 
నుడి గుడి  గ్రంథంలో పొందుపరిచిన 108 వ్యాసాలలో దాదాపు రెండువేల ఆరు వందలకు పైగా పదాలను వివరించడం జరిగింది. అందులో ఒక్కొక్క పదం దాని చందం
అందించిన మంచి గంధం. ప్రతి పదానికీ పరిచయమూ, పర్యాయపదములు, నానార్థాలు , అర్థమూ, అర్థ ప్రయోగమూ,  చక్కని ఉదాహరణలతో  వివరించారు. ప్రతి వ్యాసంలోనూ, భాషా సాహిత్యాల పట్ల ఆమెకున్న లోతయిన పరిశీలన, అవగాహన, వ్యక్తీకరణ ప్రతిభ ప్రస్థుటమవుతాయి.

 భాష ఒక అనంతమయిన సముద్రం. అందుండి వెదికి తీసిని పదాల పగడాల హారాలు తెలుగు తల్లి కంఠాన్ని అలంకరించి, అలరించిన రచయిత్రి నిరంతర కృషి స్పష్టమవుతుంది. అంతేకాక తన రచనలో పద పరిచయానికే  పరిమితం కాగ, సమాజ ప్రయోజనానికి ఉపయోగపడాలనే తపన, కనిపిస్తుంది.. అందువలన ఈ గ్రంధం పిన్నలకూ, పెద్దలకూ తెలుగు భాషా ప్రేమికులందరికి సమానంగా ఉపయోగపడుతుందని నాతో పాటు పలువురి అభిప్రాయం.  
                  ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నట్లు - ఎందరో ప్రఖ్యాతులైన  - ప్రాచీన కవుల నుండి ఆధునిక కవుల పద్య 
సుమాలు, మరువలేని రచనల మల్లెల సౌరభాలు, వెలలేని తెలుగు కవితల మధురిమలు, ఇందు పొందుపరిచారు శ్రీమతి మల్లీశ్వరిగారు. అంతేకాక విశ్లేషించి వక్కాణించవలసిన విషయమేమంటే, పదాలను వివరిస్తూ
..వివరణలో ...ఒక పదాన్ని తీసుకుని  ఆ పదం పదాంతంగా పదాంశంగా  పదాంత ధ్వనిగా  ఉన్న  పదాలను వివరించటానికి
 సరళమయిన భాషను వాడి, సందర్భోచితంగా గొప్ప గొప్ప సామెతలను కుప్పలు కుప్పలుగా గుప్పించి మెప్పించారు.అంతే కాదు. సందర్భాను సారంగా. అందించిన పద్య చయం అమోఘం.
కేవలం విద్యార్థులే కాక పెద్దలమూ మరిచి పోతున్న కవ్రిత్రయ భారత పద్యాలు మొదలు సుమతీ వేమన శతకాది వివిధ శతక పద్యాలు అన్నమయ్య కీర్తనలూ, త్యాగరాజ కృతులూ, పల్లె పదాలూ - ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? పుంఖాను పుంఖాలు గా
ఉదాహరణలుగా ఇచ్చారు. ఈ గ్రంథంలో. ఇన్నింటిని అంత  విస్తృతంగా ప్రస్తావించిన రచయిత్రి
విస్తృత పఠనం,  శ్రమ, పట్టుదల, దీక్ష అసామాన్యమనటం అతిశయోక్తి కాదు.

 శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ‍్వరిగారు మూడు దశాబ్దాలపైన తెలుగుఉపాధ్యాయిని గా పనిచేసిన బోధనానుభవంతో - చిన్నారుల మధ్య చిట్టి చేమంతియై చెంత ఉండి వారి చేష్టలనూ, చిరునవ్వులనూ, మనోభావాలనూ గమనిస్తూ, పరిశీలిస్తూ, మమేకమయి రచించిన తేనివాకలు, రెల్లుపూలు, తేనె చినుకులు,  అమ్మపాట, బొమ్మల కొలువు వంటి గేయ సంపుటాలు బాల సాహిత్యంలో ఆణిముత్యాలని చెప్పుకోవాలి.

నుడిగుడి  కంటే ముందు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు భాషా సాహిత్యాలను పరిచయం చేస్తూ రచించిన. " పందాల పరిమళాలు,. ఒక్క పదం_అర్థాలన్నో " పంటి గ్రంథాలు రచించారు.

ఈ నుడి గుడి అనే భాషా సాహిత్య పరిశోధనాత్మక గ్రంథంలో నా మనసుని ఎంతగానో హత్తుకున్న కొన్ని పంక్తులను ప్రస్తావించుకుండా ఉండలేను. ఆలయం వ్యాసంలో రచయిత్రి వివిధాలయాలను 
వివరిస్తూ, ఆఖరిలో - మన మనసులను ప్రేమాలయంగా మార్చుకోనంత కాలమూ ఎంత విజ్ఞానాన్ని, ఎంత ధనాన్ని సంపాదించినా వ్యర్థమని చెప్పడంలో - ఎంతటి హృదయ సౌందర్యం సమాజానికి ఎంత చక్కటి, చల్లని సందేశం ! 
 ఉపాధ్యాయురాలిగా భాషకు చేసిన సేవయే కాక, పదాల పరిమళాలు, ఒక పదం అర్థాలెన్నో లాంటి ఎన్నో భాషా ప్రయోజన గ్రంథాలు సమాజానికి 
అందించారు రచయిత్రి. కానీ ఇవన్నీ ఒకవైపైతే నుడి-గుడి గ్రంథం గురించి చెప్పవలసి వస్తే - ఈ గ్రంథం ఒక చేయి కాదు ఎన్నో చేతులు కలిసి  చేయవలసిన రచన అని మనకు తెలుస్తుంది. పదాల వివరణలు, ప్రయోగాలూ, ప్రాచీన హోదా పొందిన మన తెలుగు శోభను,  వైభవాన్ని వెలికి తీసమనకందించిన వైనం ఎంత గొప్పది. ఇలాంటి పరిశోధనాత్మక గ్రంథ రచన వెనుక   ఒంటరిగా శాయశక్తులా ఆమె చేసినకృషి చేసిన తీరూ, సాహిత్య ప్రియులనూ, భాషాభిమానులనూ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇలాంటి గ్రంథాలు ఎన్నో, ఎన్నెన్నో మరెన్నో రచించి తెలుగు భాషను ప్రపంచాన నించి, ‘‘దేశభాషలందు తెలుగు లెస్స’’అన్నది నిరూపించాలని హృదయాంతర్భాగం నుండి ఆశిస్తూ ---
                     నీ  హితురాలు
                      విజ్జిక