ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వివేచన విలువ:--గోమతి
September 14, 2020 • T. VEDANTA SURY • Story

ఒకానొక అడవిలో 'దుర్విదగ్ధుడు' అనే సింహం , 'మేధ' అనే ఏనుగును మంత్రిగా చేసుకుని రాజ్యపాలన చేస్తుండేది. మేధ సలహాలతో రాజ్యం సుభిక్షంగా వుండేది. 'ఛలకుడు' అనే నక్క, 'ఖర్పరుడు' అనే తోడేలు దూరపు చుట్టాలవడంతో అవీ అక్కడే వసిస్తుండేవి. సింహం రాజు అవడంతో వాటికేలోటూ లేదు. సింహం తన వేటలో కొంత భాగం తను, తన భార్య అయిన 'మార్దవి' తిని మిగిలిన భాగమంతా వీటికే ఇచ్చేవి. అలా వాటి జీవనం సుఖంగా గడవ సాగింది.

ఇలా ఉండగా 'మేధ' జ్ఞాన బోధనలతో ప్రభావితుడైన 'దుర్విదగ్ధుడు' ఒకనాడు,తాను "అసత్యవాదులను, మోసకారులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తానని" నిర్ణయం తీసుకున్నాడు. వాటిని కనుగొని చెప్పవలసిన భారం కూడా 'మేధ' కే ఇచ్చాడు. 'మేధ' రాజాజ్ఞను పాలిస్తూ వచ్చింది. రాను-రాను ఆహారం తగ్గిపోతూ వచ్చింది. కారణం ఏమిటని రాజు ఆరా తీయగా, "అసత్యవాదులు, మోసకారులు తాము అసత్యమాడటం కానీ, మోసపుచ్చడం కానీ చేస్తే రాజుకు బలి అవుతామని గ్రహించి తమ బుద్ధిని మార్చుకుంటున్నారని" తెలియ వచ్చింది. రాజు కూడా ఈ మార్పునకు సంతోషించాడు. అయితే ఆహారం తక్కువగా లభిస్తుండడంతో ఛలకుడు, ఖర్పరుడు మేధ పై ఆగ్రహాన్ని పెంచుకున్నాయి. ఒకనాడు మేధ లేని సమయం చూచి, రాజు వద్దకు వెళ్ళి.. "రాజా! మీరు మేధ మాటలు నమ్ముతున్నారా? అది, అడవి జంతువులనన్నింటినీ మీకు ఆహారం కాకుండా రక్షించి తద్వారా వాటిని తన వైపుకు తిప్పుకుని తాను రాజు కావాలని చూస్తోందని" నమ్మబలికాయి. రాజు ఆ మాటలు నమ్మి 'మేధ'ను చంపుతానంటూ కోపంతో గుహ అదిరిపోయేలా గర్జించసాగాడు. 'మార్దవి', "నిజాన్ని విచారించకుండా, కోపించడం సరికాదని, చెప్పుడు మాటలు వినవద్దని" ఎంత చెప్పినా., భార్య మాటలు విననిదై, మేధ రాగానే దానిపై లంఘించి చంపివేసింది. ఆ రోజు నుండి ఛలకుడు, ఖర్పరుడు మంత్రులుగా చలామణి అవుతూ జంతువులన్నింటినీ హింసిస్తూ, రాజ్యాన్ని అస్తవ్యస్తం చేశాయి. రాజు వీటి మాయలో పడి, వారి మాటలే నమ్ముతూ రాసాగాడు.

ఇలా వుండగా, ఒకనాడు 'దుర్విదగ్ధునికి' విపరీతమైన అనారోగ్యం కలిగింది. ఛలకుడు, ఖర్పరుడు దీన్ని అవకాశంగా తీసుకుని వైద్యం పేరుతో ఏవేవో ఆకు రసాలను ఇచ్చి దాని ఆరోగ్యాన్ని మరింత పాడు చేసి చంపి, ఆ రాజ్యాన్ని తాము ఏలాలని కుట్ర పన్నాయి. ఈ కుట్రను పసిగట్టిన 'మార్దవి', వారి మాయలో పడ్డ తన భర్త, ఈ విషయాన్ని చెప్పినా నమ్మడని మునుపు తమ దగ్గర ఆస్థాన వైద్యునిగా వున్న, 'మేధ' స్నేహితుడైన 'సద్భావి' అనే కోతిని సహాయం కోరింది. ఒకరోజు ఛలకుడు,ఖర్పరుడు లేని సమయం చూసి 'సద్భావి' రాజు వద్దకు వెళ్ళింది. రాజును పరీక్షించి, ఇది అజీర్తి వలన వచ్చిన రోగమని, దానికి తగిన ఔషధాలను ఇచ్చి తిరిగి వెళుతూ...,రాజుతో," ఓ రాజా! మనం వినేవన్నీ నిజాలు కావు. ఒక్కోసారి కంటితో చూసేవి కూడా నిజాలు కావు....మనం ఏది విన్నా, చూసినా వివేచన చేయాలి. స్వబుద్ధితో ఆలోచించాలి. అసత్యవాదులను, మోసకారులను మాత్రమే వేటగా స్వీకరిస్తానని నియమం పెట్టుకున్న వాడివి..స్వయంగా అసత్యపరుల మాటలు చెవినొగ్గి, ఎప్పటి నుండో నీవు ఎరిగిన, సత్యవతి, ధర్మపరురాలైన 'మేధ"ను ఎటువంటి విచారణ లేకుండా చంపేశావు. సుభిక్షంగా వున్న రాజ్యం నేడు అల్లకల్లోలం అయింది. నేను చెప్పిన మాటలను వినమని కూడా నేను చెప్పను..నీ బుద్ధితో ఆలోచించు. నిద్రిస్తున్న నీ వివేచనను మేల్కొలుపు." అని అక్కడి నుండి వెళ్ళిపోయింది.

రాజు ఆలోచనలో పడ్డాడు.., రాత్రి అయింది. రాజు గుహ నుండి బయటికి వచ్చాడు. చిన్నగా వెళుతుంటే; ఛలకుడు, ఖర్పరుడు తమ గుహలో మాటలాడటం వినిపించింది. తిన్నగా అటు వెళ్ళింది. అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి., " ఈ మధ్య మన పంట బాగా పండుతోంది. లేకపోతే, ఈ మూర్ఖపు రాజు మన మాటలు నమ్మి, మేధ లాంటి వాళ్ళని దూరం చేసుకుంటాడా..?..హ..హ్హ..హ్హహ్హ..హ్హహ్హహ్హ..., లోకం తీరే అంత తేనె పూసి కత్తి దించినా నమ్ముతుంది. చక్కెర గుళికల వంటి మోసపూరిత మాటలు నమ్ముతుంది. అంతేకాని కఠినమైన, చేదు నిజాలను వినలేదు. ఏదైతేనేం, ఈ జబ్బుతో ఈ రాజు చావడం ఖాయం. రాజ్యం మనదవడం ఖాయం".. అంటూ విరగబడి నవ్వసాగాయి. అంతే దుర్విదగ్ధుడు, పట్టలేని ఆగ్రహంతో గుహ అదిరిపోయేలా మహా గర్జన చేసి ఆ టక్కులమారి, జిత్తులమారులను చీల్చి చెండాడింది.

అక్కడి నుండి తిన్నగా మేధ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ మేధ కుటుంబం అంతా రాజును చూసి భయపడిపోయింది. రాజు వారినెవ్వరినీ భయపడవద్దని.., జరిగిన విషయాన్ని వివరించి..., మేధ కూతురు 'చార్వి'ని తన మంత్రిగా వుంటూ, తనకు సలహాలు ఇవ్వ వలసిందిగా కోరింది. ఆనాటి నుండి చార్వి సలహాలతో మరియు తన వివేచనతో రాజ్యాన్ని చక్కగా పాలించ సాగింది.
"కథకు నా చిట్టితల్లి ఊహాజనిత చిత్రం."

.