ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
విశ్వ దీప్తి (ఆటవెలది)- రాచమళ్ళ మల్లికార్జున్
October 3, 2020 • T. VEDANTA SURY • Poem

1 కఱుకు రాతి గుండె కరిగి నీరగురీతి
బాధలన్ని దెలిపి ప్రభుత ముందు 
నిష్ట తోడ శాంతి నియమంబు పాటించి
సత్య మహిమ దెలిపె శాంతిదూత!

2. పంటసాగులోన ప్రభుతయాంక్షలుఁజూసి
రైతులంత గదిలి రణముజేయ
పథక రచన జేసి ప్రజల నాయకుడుగ
నెదిగినాడు బాపు మదిని గెలిచి!

3. వర్తకమునకొచ్చి పాలకులుగ మారి
వనరులన్ని దోచి వరుగు జేసి
ప్రజల స్వేచ్ఛ పైన పాదంబు మోపిన
తెల్ల వానిదరుమ తెగువ జూపె!

4. దండి యాత్రజేయ దండిగా జనులెల్ల
గాంధి వెంట నడిచి కరములెత్తి
భరతమాత దాస్య బంధంబు చేధించ
జై యనుచుగదిలిరి జయము నొంద!

5. రుధిర రహిత పోరు రుషితీరు నడుపుచు
శాంతి మంత్ర మహిమ జగతి దెలిపి
మానవతను మించు మతములేదని దెల్పి
విశ్వశాంతి గోరె విశ్వ దీప్తి!