ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వీరేశలింగం కోరంగిలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు ఆయన "సంగ్రహ వ్యాకరణం" రచించి, విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేటట్లు బోధించాడు ఈయన అక్కడ పని చేసేటపుడే, "వివేక వర్థని" అనే మాస పత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక మొదట, నాలుగు పెద్ద పుటల్లో గల చిన్న మాసపత్రికగా ఉండేది. ఆ కాలంలో ప్రభుత్వ ముద్రణాయంత్రం తప్ప వేరొకటి లేదు. గోదావరి మండలం మొత్తం మీద ముద్రణ యంత్రం లేకపోవడంతో ఆ పత్రికను చెన్నపురి లోనే సంజీవని ముద్రాక్షరశాల యందు ముద్రించి, అందించారు. అక్కడ సకాలంలో పత్రిక రాకపోవడం వల్ల మూడు మాసాల అనంతరం శ్రీధర ముద్రాక్షరశాలకు మార్చి, 18 పేజీలకు పెంచి ఈ పత్రికను ప్రచురించసాగారు. ఈ పత్రికతో పాటు నీతి చంద్రికను కూడా ప్రచురించారు పత్రిక ప్రచురించడంలో వీరేశలింగంగారి ఆశయాలు రెండు ఉన్నాయి. మొదటిది తెలుగు భాషలో సులభశైలిలో, సలక్షణమైన వచన రచన చేయడం. రెండవది ప్రజలలో గల దురాచారాలను, మూఢనమ్మకాలను తొలగించి దేశాభివృద్ధికి తోడ్పడటం. వీరేశలింగం తే. 22-8-1884దీన ధవళేశ్వరంలో సభను ఏర్పాటు చేసి, ఆ సభలో ప్రసంగించారు. బాలికల పాఠశాల ఆవశ్యకతను గుర్తించి, దానిని స్థాపించడానికి నిర్ణయం తీసుకున్నారు. 1874లోనే వీరేశలింగం గారు తన పాఠశాల ఆవరణలో అష్టావధానం చేశారు. ఆ రాత్రి విపరీతమైన తలనొప్పి రావడం, అష్టావధానం వలన ప్రజలకు ఒనగూరే మేలు కనబడక పోవడంతో ఆ ప్రక్రియను అంతటితో విడిచిపెట్టారు. తెలుగు భాషలో అంతవరకు పరవస్తు చిన్నయ సూరి గారి మిత్రలాభం, మిత్రభేదం మాత్రమే తరగతులలో పాఠ్యాంశాలుగా ఉండేవి. చిన్నయ సూరి గారు సంధి, విగ్రహం రాయకుండానే స్వర్గస్తులయ్యారు.అది గమనించిన వీరేశలింగం గారు, చిన్నయ శైలికి తగ్గకుండా పంచతంత్రములోని తదుపరి "విగ్రహ తంత్రం" రాసి పత్రికలకు పంపించాడు. పండితుల మెప్పు, ఎందరివో అభినందనలు లభించాయి. తెలుగులో వచన కావ్యాలు లేని కొరతను ఆయన పూరించడానికి చేసిన ప్రయత్నాన్ని అందరూ హర్షించారు. మెట్రిక్యులేషన్ కి పాఠ్య గ్రంథముగా ఎంపికయై, వెయ్యి రూపాయలు పారితోషికంగా పొందారు. అదే ఉత్సాహంతో "సంధి" తంత్రము కూడా రాసి, రాజమండ్రి కాలేజీ ప్రిన్సిపాల్ అయిన మెట్కాఫ్ దొరకు అంకితమిచ్చాడు. 1876లో ధవలేశ్వరం వదలి, రాజమహేంద్రవరం లోని రాజకీయ శాస్త్ర పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాడు. ఆ పదవిలో నెలకు అరవై ఐదు రూపాయలు జీతం వస్తుండేది.ఆ పాఠశాలలో ఉండడం చేత, బసవరాజు, బుర్ర రామలింగ శాస్త్రి, ఏలూరు లక్ష్మీ నరసింహ గారు స్నేహంగా ఉండేవారు. వీరు మంచి మిత్రులు గాన పత్రికా నిర్వహణకు సాయం చేస్తూ ఉండేవారు. వివేక వర్ధని:- వీరేశలింగం ఈ పత్రికలో స్త్రీ విద్య ప్రాధాన్యతను గూర్చి పద్యాలు, గద్యాలు విరివిగా రాస్తుండేవారు. కొక్కొండ వెంకటరత్నం గారు వీరి విగ్రహ తంత్రాన్ని విమర్శించగా, "గుణా గుణ ప్రదర్శనీ సమాజం" అనే శీర్షికతో వెంకటరత్నం గారి రాతలు అన్నింటిని ఖండించారు వీరేశలింగం. ఆ రోజుల్లో వ్యభిచారం చేయడం నేరం కాదు, వేశ్య లేనివాడు పురుషుడు కాదు అనే నినాదం ఉండేది. పురుషుల నీతి బాహ్యమైన పనులను వీరేశలింగం గారు ఖండించారు.ఆ రోజుల్లో గల దొంగ స్వాముల ఆగడాలను పత్రికలో ప్రచురించి ప్రజలను చైతన్యవంతులను చేశారు.పోలీసుల దొంగతనాలు, అధికారుల దౌష్ట్యం, న్యాయవాదుల అన్యాయాలు, వీటన్నిటిని వ్యంగ్యము, హాస్యము మిళితము చేసి వేళాకోళం తో ఆట కట్టించేవారు. పిల్లలచే వేషాలు వేయించి, వ్యవహార ధర్మ బోధినీ అనే ప్లీడరు నాటకాన్ని ఆడించాడు.ఆ నాటకాన్ని చూసిన ప్లీడర్లు సిగ్గు పడ్డారు. అధికారులు మనసులో చాలా బాధ పడ్డారు. జడ్జిమెంట్ పార్సుల గురించి ప్రభుత్వం విచారణచేయక తప్పలేదు. మునసబుగారి తీర్పుల వేలం మీద కూడా చాలా హడావుడి జరిగింది. చివరికి అంతా బయటపడింది. చిత్తు కాపీ రాసిన చిత్రపు కామరాజు అనే పెద్దమనిషి చిత్రం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం అంతా కోర్టుకెక్కింది. కోర్టు చేతుల్లో వీరేశలింగానికి జైలు శిక్ష తప్పదనీ శత్రువులు భావించారు. కానీ వీరేశలింగానికి గెలుపు వరించింది. శత్రువర్గానికి తల బాధగా తయారయింది. వీరేశలింగం రాజమండ్రి అంతటా భయ కంపనలు పుట్టించాడు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్లీడర్లు, స్వాములు అంతా గడగడలాడారు. ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా వివేకవర్ధిని పత్రిక గురించే, అది అవినీతి పాలిట సింహస్వప్నంగా అయింది. చాలామంది శాపనార్థాలు పెట్టారు, తిట్టారు. ఒక పత్రిక సమాజాన్ని ఎలా సక్రమ మార్గాన నిల్వగలదో ఉదాహరణగా నిలిచింది.1876 జూలై నెల నుండి వివేకవర్ధని నెల పత్రికగా గాక పక్షపత్రికగా వెలువడ సాగింది. అది తెలుగులోనే కాక ఇంగ్లీషులో కూడా చోటు చేసుకుంది. దేశాభివృద్ధికి, భాషాభివృద్ధికి సహాయపడే అంశాలు ఎన్నో ఈ పత్రికలో వెలువడ్డాయి.పూర్వకవుల గ్రంధాలు, పుస్తక సమీక్షలతో పాటు శాకుంతలం, కామెడీ ఆఫ్ ఎర్రర్స్, మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకాల తెలుగు అనువాదాలు వెలువడినాయి. ఇవన్నీ పాఠకుల మనసులను ఆకట్టుకున్నాయి. పత్రిక చాలా ఆదరణ పొందింది. (ఇంకా ఉంది) - ఇది 91వ భాగం- బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
August 13, 2020 • T. VEDANTA SURY • Serial