ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వీరేశలింగం గారు వితంతు పునర్వివాహాలు జరిపేందుకు కంకణం కట్టుకున్నారు. ఎలాగైనా వితంతువులకు తగిన వరుణ్ణి యెంచి వారికి వివాహం చేసి జీవితం చక్కబెట్టేందుకు రేయింబవళ్ళు శ్రమించారు. ఒక్కొక్క వివాహానికి ఆయన తక్కువేమీ కష్టపడలేదు. రాత్రి పూట రహస్యంగా ప్రయాణాలు చేయడం, తమ విలాసములు గుప్తంగా ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకునేవారు.వితంతువులను తెచ్చి, వారిని కాపాడడం కూడా తీవ్రమైన ఇబ్బందిగా ఉండేది. వితంతువుల తల్లిదండ్రులు గాని బంధువులు గాని ఫిర్యాదులు చేసిన కేసులు వెంబడి కోర్టులకు తిరగవలసి వచ్చేది. అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగ వలసి వచ్చేది. ఈ బాధలు అన్నింటిని అలాగే తట్టుకునే వారు. ఒక్కొక్కసారి చాందసుల కోపతాపాలు భరించక తప్పేది కాదు.కాకినాడలో ఆధునిక భావాలు గల వ్యక్తి ఉండేవాడు. ఆయన సంపన్నుడు కూడా, గృహస్థుడు అయిన ఆయన సజ్జనుడు, సంస్కారి. అతడు వీరేశలింగంగారి ఆధునిక భావాలతో ఏకీభవిస్తూ ఆ కార్యకలాపాల్లో తాను పాలుపంచుకునే వాడు. అతడే పైడా రామకృష్ణ. వీరేశలింగం గారికి దన్నుగా నిలుస్తూ ధన సహాయం కూడా అందించే వాడు. ఆయన జీవిత కాలంలో 30 వేల రూపాయలు వరకు తన సంపాదనలో వితంతు వివాహాలకు ఖర్చు చేసాడు. ఈ వితంతు వివాహాలలో పాల్గొన్నందుకు ఆయనపై విపరీతమైన వత్తిళ్లు, బెదిరింపులు వచ్చాయి. అనేక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది. అంతేకాదు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవలసి వచ్చేది. ఇవి మానసికంగా తట్టుకోలేక చివరకు తప్పుకో వలసి వచ్చింది.ఈ వితంతు వివాహాల తో సంబంధమున్న వ్యక్తులకు కూడా రాజమండ్రి ప్రాంతంలో ఉన్న వారికి కొన్ని కష్టాలు ఎదుర య్యాయి. అద్దెలకు ఇళ్ళు దొరికేవి కాదు. అలాగే అద్దె ఇంట్లో ఉన్న వారిని ఇల్లు ఖాళీ చేసి వెంటనే పొమ్మనే వారు. కొన్ని గల్లీలలో నూతుల వద్దకు నీరు తోడుకునేందుకు ఎవ్వరినీరానిచ్చేవారు కాదు. ఇంట్లో పై పనులను చేసేవారిని కూడా రానీయకుండా భయపెట్టే వారు. పూజలు, పునస్కారాలు, పురోహితులు కూడా రావడానికి వీలు లేని కష్టాలు ఎదురయ్యాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వీరేశలింగం వాళ్లందరికీ సహాయం అందించాడు. తాత్కాలికమైన కనీస వసతులు ఏర్పాటు చేశాడు. వీరేశలింగం నాయనమ్మ ఇతడు కుల భ్రష్టుడని తిట్టి పోసింది.ఇతని నుండి విడిపోయి దూరంగా వేరే ఇల్లు తీసుకొని అక్కడ ఒంటరిగా ఉండసాగింది.అతను ఇలా మారడం వలన, బంధువులు కొందరు అతని భార్య రాజ్యలక్ష్మి పై ఒత్తిడి తెచ్చేవారు. గోదావరి నది ఒడ్డున పౌరోహితులు కూడా వీరేశలింగం గారిని అనరాని మాటలు అనేవారు.ఆ పురోహితులలో కొందరికి వీరేశలింగం గారి పై అభిమానం ఉన్నప్పటికీ ఎదురు తిరగడానికి ఆసక్తుల య్యారు.ఒకసారి ఒక పురోహితుడు పూజలకు వచ్చిన వారితో యధాలాపముగా వితంతువులకు వీరేశలింగం దిక్కు! అక్కడికి పోతే సరి అని వ్యంగ్యంగా మాట్లాడాడు. పలుసార్లు అదే మాటను పునరుచ్చరిస్తుంటే, "పదే పదే ఆ మాట అనవలదు" అని వచ్చిన ఆ వ్యక్తి కోపంతో పురోహితుని పై మండి పడ్డాడు.పురోహితుడు తన మాటను సర్దుకుంటూ, "ఎందుకయ్యా అంత కోపం! ఆ వీరేశలింగం మన మంచిని, సాంప్రదాయాల్ని దగ్ధం చేస్తున్నాడు, నీకు తెలియదా! వాడి కంటే ఆ చెట్టు పుట్టా నయం" అని సముదాయించుకున్నాడు. ఆ ఆగంతకుడు "ఆ చెట్టు నీడనిస్తుంది, ఆ పుట్ట పాములకు నివాసమిస్తుంది. మీకంటే ఆ చెట్టు పూర్తిగా నయం. పదిమందికి మేలు చేసే ఆ వీరేశలింగాన్ని ఎందుకు ఆడి పోసుకుంటావు. చేతనైతే మంచిని చెప్పాలి లేదంటే కిమ్మనకుండా నోరు మూసుకోవాలి" అని గట్టిగా మందలించాడు.విశేషమేమిటంటే గోదావరి తీరాన కూడా వీరేశలింగంగారి తాలూకా కార్యక్రమాలపై చర్చలు జరిగేవి. కొందరు ఆడిపోసుకున్నా, ఒకరిద్దరైనా ఆయనను మెచ్చుకొనేవారు. (ఇంకా ఉంది)- ఇది 96వ భాగం- బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
August 18, 2020 • T. VEDANTA SURY • Serial