ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శతవత్సర చాణక్యుడు-పాములపర్తి వెంకట నరసింహారావు--- రామ్మోహన్ రావు తుమ్మూరి --ఈరోజునుంచి శతవత్సర ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి పాములపర్తి వెంకట నరసింహారావు గారికి.పి.వీ.సాబ్ అనేమాట తరచుగా వినబడేది నాచిన్నతనం లో.కరీంనగర్ గంజి మార్కెట్లో మురళీధర్ రావు అండ్ బ్రదర్స్ అనే బట్టల దుకాణంఉండేది. అది మా దగ్గరి బంధువులది. రాజకీయపు తొలి దశలో కరీం నగర్ వస్తే ఆయన ఆ బట్టల షాపు వెనుకవైపు గదిలో తలకింద దిండు పెట్టుకుని సేదదీరేవారు.కలువ వలసిన వారిని కలువటం పని కాగానే తిరిగి వెళ్లపోవ టం. ఇదంతా ఆయనకు ముప్పయి ముప్పై అయిదేళ్ల వయసప్పటి మాట. అలా ఆయన పేరు వినటం చాలా చిన్న తనాననే జరిగింది.ఆయన్ని మొదటి సారిచూడటం కరీంనగర్ జిల్లాపరిషత్ ఆఫీసు ప్రాంగణంలో ఆయన చేతుల మీదుగా నేను నా జీవితం లో మొదటి సారి బహుమతిస్వీకరించినప్పుడు.నెహ్రూగారి మరణానంతరం ఆయన పేరుమీద పిల్లలకు అన్ని రకాల పోటీలు నిర్వహిం చారు. నాకు పద్యపఠన పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది జిల్లా స్థాయిలో. అప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను పీవీ గారప్పుడు రాష్ట్ర విద్యాశాఖమంత్రి . అలా ఆయన చేతుల మీదుగా బహుమతి తీసుకున్నప్పుడు చూశాను. తరువాతనేను బియస్సీ ఫస్టియర్లో ఉండగా ఇందిరాగాంధీ తో పాటు కరీం నగర్ వచ్చినపుడు, కరీంనగర్ పోలీసు గ్రౌండులో ఇందిరా గాంధీ ప్రసంగాన్ని తెలుగులో అనువ దించి చెప్పినపుడువిన్నాను.చూశాను.పలు సందర్భాల్లో పలువురు పెద్దలు మాట్లాడుకుంటుండగా చెవిలో పడిన మాటలు ఆయనకు అనేక భాషలు వచ్చు అనీ,విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలుహిందీ భాషలోనికి అను వదించారనీ మహా మేధావి అనీ మన కరీం నగరం వారే ననీ,వారిది వంగర గ్రామమనీ,వారి బంధువుల అమ్మాయిని మా బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి చేసినపుడు వారి గురించిన అనేక విషయాలు వినడం ఇలా వయసుతోపాటు ఆయన అన్ని దశల అన్ని వార్తలు చెవిలో పడుతున్నప్పుడు ఈయన మనవాడు అని ఏదో తెలియని అభిమానం మనసులో మెదలడం.ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే చాలాస్పష్టంగా గోచరిస్తుంది.రచన మాసపత్రికలో ఆయన గొల్ల రామవ్వ కథ వేశారొకసారి. అది చదివి ఆశ్చర్యపోయానప్పట్లో. ఎందరి చేయనే చదివించాను. ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో కాళోజీ అశీతి సందర్భంగా జరిగిన సభలో అధ్యక్షులు సదాశివ ముఖ్య అతిథి పీవీ గారు. సహజమైన తెలంగాణా కరణాల భాషలో ఆయన తానొక ప్రధాన మంత్రిగా కాక కాళన్న మిత్రునిగా మాట్లాడటం చూసినపుడు ఎంత సంబరమయ్యిందో. మళ్లీ కొంత కాలానికే కాళోజీ మరణానం తరంసుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మళ్లీ సదాశివ గారే సభాధ్యక్షులు,ప్రధాని పీవీ గారు ముఖ్య అతిథి.అనుకోకుండా అప్పుడూ ఆ సభలో ఉండే అవకాశం కలిగింది.అలాగే ప్రముఖ జర్నలిస్టు పెండ్యాల వామన్ రావు (నాన్నకు దగ్గరి బంధువు) గారు వారితో ఫోన్లో మాట్లాడుకేవటం విన్నాను.చిర కాల మైత్రి వారిది.ఏ అరమరికలు లేకుండా ఏకవచనంలో మాట్లాడు కుంటుంటే ముచ్చట పడ్డాను.ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎగుడు దిగుళ్లు,రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రిగా,ముఖ్యమంత్రిగా ,దేశానికి వివిధ శాఖల మంత్రిగా,విదేశ రాయబారిగా,ప్రధానమంత్రిగా అందరూ విన్న విషయాలు నేనూ విన్నాను.దేశానికి అత్యంత కీలకమైన ఆర్థిక సంస్కరణలకు మూలం పీవీ అని ఈ రోజు ప్రతిపక్షాలు సైతం పొగడకుండా ఉండలేని స్థితి.అబ్దుల్ కలాం లాంటి శాస్త్రజ్ఞుడు ఆ తరువాత రాష్ట్రపతి కూడా అయిన ఆయన నోట పీవీ ఒక గొప్ప వ్యక్తి పొగడబడటం ఆయన ప్రతిభా సామర్థ్యాలకు గీటురాయి. ఆయన మాటల్లో”రావు ఒక గొప్ప దేశభక్తి కలిగిన వ్యక్తి.ఆయనకు రాజకీయవిధానం కంటే దేశమే గొప్పది”ఒక తెలుగువైపు దక్షిణాదివాడు ఐదేళ్లపాటు సజావుగా దేశనాయకుడుగా పరిపాలన సాగించాడంటే ఎంతటి తెలివి తేటలు కావాలి. ఆయన గురించి రాయాలంటే వేయిపుటల పుస్తకమే అవుతుంది.నా చేతనయినంత తలచుకోవడమే నేను చేయగలిగింది.ఆయన లోపలి మనిషి ఆయనంటే ఏమిటో తెలుపుతుంది.ఆయన వందేళ్ల పండుగ సందర్భంగా నాలుగు మాటలతో ఆయనకు అక్షర నివాళి సమర్పిస్తూ.
June 28, 2020 • T. VEDANTA SURY • Memories