ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శబ్బాష్ శృతి : - పద్మ త్రిపురారి.
November 8, 2020 • T. VEDANTA SURY • Talent


ఈ చిట్టి తల్లి పేరు శృతి.మా పాఠశాలలో ఈ సంవత్సరమే ఆరవతరగతిలో చేరింది.దీంట్లో ప్రత్యేకతేముంది?ఏదైనా బంగారు పథకం సాధించిందా లేక ప్రథమ బహుమతి స్వీకరించిందా అనే ఆలోచన ఎవరిలోనైనా కలుగవచ్చు.గొప్ప పనులు చేసేవారు ఎప్పుడూ ఎందరెందరివో అభినందనలు అందుకుంటూనే ఉంటారు.కానీ చిన్ని బాల్యంలో చిన్న మంచి చేసినా బయట ప్రపంచానికి తెలిపితే,సాధారణ విజయాలను కూడా ప్రోత్సహిస్తూ,బంగరు బాలల భవిష్యత్తు కు బాటలు వేసినట్టవుతుందని నా భావన.
ఇంతకీ ఈ వివరణకి,ఈ అమ్మాయికి సంబంధమేమిటి?అనుకుంటున్నారా?అదే చెప్పబోతున్నాను.
    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బడి పిల్లలకు టీ.వీ.పాఠాలు(దూరదర్శిని పాఠాలు)మొదలు పెట్టింది. కానీ చాలా మంది పిల్లలు మొదట్లో ఇవి చూడడానికి అలవాటు పడలేదు.కొద్ది మంది మాత్రమే టి.వి.పాఠాలను వినడం మొదలు పెట్టారు.క్రమంగా వారి సంఖ్య పెరుగుతూ,తగ్గుతూ వస్తుంది. దీనికి అనేక కారణాలు. ముఖ్యంగా కొందరు పిల్లల్లో స్వతసిద్ధమైన శ్రద్ధ లోపించి,ఉపాధ్యాయులు పదే పదే గుర్తు చేసినా పాఠాలు వినకుండా అశ్రద్ధ వహిస్తున్నారు. కానీ ఈ అమ్మాయి శృతి మాత్రం టీ.వీ.లో పాఠాలు మొదలైన నాటినుండి ఇప్పటివరకు క్రమం తప్పకుండా(మధ్యలో ఉప్పలమ్మ పండుగ వాళ్ళ ఇంట్లో చేసుకున్నప్పుడు రెండు,మూడు రోజులు మినహా).చూడడమే కాకుండా ,తప్పైనా ఒప్పైనా ఇచ్చిన ప్రతి కృత్యాన్ని రాసి పంపిస్తున్నది.ఈ మధ్యన కొంచెం దస్తూరి బాగా కుదరాలంటే చూచిరాత రాయాలిరా అన్నాను.అంతే.అంతకుముందే మా పాఠశాల విద్యార్థులైన తన ఇద్దరు అక్కల సహాయంతో ప్రతి రోజు చూచిరాత ఇలా రాసి పంపిస్తున్నది. ప్రతి రోజు తాను పాఠం వింటున్న ఫోటో పంపిస్తున్నది. రోజుకు రెండు మూడు సార్లైనా నాతో ఫోన్ లో మాట్లాడుతున్నది.ఇదేమంత గొప్ప విషయమని అందరికీ అనిపించకపోవచ్చు.కానీ మూడు నెలలుగా పదే పదే ఫోన్ చేసి పాఠం వినండి,ఇంటిపని రాయండి అని చెప్పినా వినకుండా సమయం వృధా చేస్తున్న కొందరు విద్యార్థులు,వారిపై అంతగా శ్రద్ధ కనబరచని తల్లిదండ్రులు, పాఠం వినకున్నా విన్నారని చెప్పే పెద్దలు, మా మాట పిల్లలు అసలు వినడం లేదు బయట ఆడుతున్నారని వాపోయే మరికొంతమంది తల్లిదండ్రుల మాటలు విన్న నాకు మాత్రం ,ఈ అమ్మాయి కనబరుస్తున్న శ్రద్ధ ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది.
    మరొక అమ్మాయి ఉష కూడా క్రమం తప్పకుండా పాఠాలు వినడమే కాదు.మరొక విద్యార్థి కూడా పాఠం వినేలా చూడమ్మా అని చెప్పగానే,తన తమ్ముడితో కలిసి ఆ విద్యార్థిని వెతికి వెతికి తీసుకువచ్చి మరీ రెండు రోజులు టీ.వీ.ముందు కూర్చోబెట్టింది.
     అందరు విద్యార్థులు ఇంతటి శ్రద్ధావంతులైతే ఎంత బాగుండునో అనే భావనలోనుండి జనించిన కథనం ఇది.
(ఒక ఉపాధ్యాయినిగా నేను పొందుతున్న అనుభూతుల సారం ఇది.)