ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శాంథోం---మద్రాసులో మైలాపూర్ పరిధిలోని ఓ భాగమే శాంథోం--శాం థోం అనే మాటలు సెయింట్ థామస్ అనే ఓ క్రైస్తవ పెద్ద పేరు నుంచి పుట్టినవే.స్థానికంగా ఉండే క్రైస్తవుల నమ్మకం ప్రకారం ఏసుప్రభువు శిష్యులైన పన్నెండు మందిలో ఒకరైన థోమయార్ క్రీ.శ. 52లో భారత దేశం వచ్చారట. ఆయన కేరళ తీరం నుంచీ ఈ పవిత్ర ప్రాంతాన్ని సందర్శించారట. (ఈ మాట నేనొక తమిళ వ్యాసం ఆధారంగా రాసినదే. ఇది తప్పవచ్చు. కాకపోవచ్చు. ఎవరైనా చెప్తే సరి చేసుకుంటాను). క్రీ.శ. 72 వరకూ ఆయన ఇక్కడ నివసించారు. అనంతరం మద్రాసు చుట్టుపక్కల ప్రాంతాలలో ఒకటైన సెయింట్ థామస్ మౌంట్ లో ఆయన అస్తమించారు. ఆయన భౌతికకాయాన్ని ఇక్కడ పాతిపెట్టారట.ఆయన సమాధిపై శాంథోం ప్రార్థనాలయం నిర్మించారట.ఈ ప్రార్థనా మందిరానికి ఇటలీకి చెందిన మార్కోపోలో 1292లో ఇక్కడకు వచ్చి తన యాత్రా విశేషాలలో దీని గురించి రాసుకున్నట్లు చరిత్ర పుటలు తిరగేయగా తెలిసింది. భారత దేశం పై దాడి చేసిన పోర్చుగీసు వారు 16వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. చిన్న బసిలికాగా పోర్చుగీసువారు ఈ ప్రార్థనా మందిరాన్ని ని నిర్మిస్తే, బ్రిటీష్ వారు దీనిని 1893లో పునర్నిర్మించి కేథడ్రాల్ హోదా కల్పించారు. ప్రస్తుతం కనిపించే ప్రార్థనాలయం నియోగోతిక్ రూపానికి అద్దం పడుతుంది. అలాగే 19 వ శతాబ్దపు బ్రిటీష్ నిర్మాణ శైలి నీ చూడొచ్చు.ఈ ప్రాంతంలో ప్రసిద్దమైన శాన్ థోం బసిలికా మద్రాస్ - మైలాపూరు మార్గంలో ఉంది. రోమన్ కాథలిక్ చర్చి కావడంతో ఇది భారత దేశంలోనే అతి ముఖ్యమైన క్రైస్తవుల ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లు ది.పోర్చుగీసువారు ఆదిలో ఈ ప్రార్థనా మందిరానికి ఏసుప్రభువు మాతృమూర్తి మరియా పేరు పెట్టారు. దేవుడి తల్లి అనే అర్థం స్ఫురించే Madre De Deus అనే పేరు ఈ ఆలయానికే కాక ఇందులో నుంచే ఈ పట్టణానికి అప్పట్లో మదరాస్ అనే పేరు వచ్చినట్లు చెప్పేవారున్నారు. ఇదేకాకుండా మదరాస్ అనే పేరు వెనుక మరి కొన్ని వివరణలు ఉన్నాయి.ఈ ప్రాంతంలో పలు విద్యాలయాలు ఉండేవి. వాటిలో కొన్ని...రోజరీ మెట్రిక్యులేషన్ స్కూలు. సెయింట్ బీడ్స్ స్కూలు. శాంథోం స్కూలు. సెయింట్ రాఫెల్స్ స్కూలు. డొమినిక్ జేవియో స్కూలు. సెయింట్ థోం భారతదేశం వచ్చారనడాన్ని నిరాకరిస్తూ అందుకు జవాబుగా శాంథోం చర్చి చరిత్ర కథనాన్ని చెప్పేవారూ లేకపోలేదు.పూర్వం క్రైస్తవ బోధకుల మాట ప్రకారం, థోమా మరణించిన తర్వాత ఆయన భౌతికకాయాన్ని ఆయనే నిర్మించిన చిన్న ప్రార్థనా మందిరంలో పాతిపెట్టినట్లు చెప్తారు. . క్రీ. శ. పదవ శతాబ్దంలో క్రైస్తవులు థోమాను సమాధి చేసిన చోట ఓ ప్రార్థనా మందిరాన్ని కట్టారు. 1349వ సంవత్సరంలో జాన్ థే అనే ఆయన సెయింట్ థోమా ప్రార్థనా మందిరాన్ని‌ సందర్శించినట్లు రాసుకున్నారు.అయితే 1517, 1521లలో పోర్చుగీసువారు రాసిన ప్రకారం థోమా ప్రార్థనా మందిరం శిథిలమైనట్లు తెలుస్తోంది. అక్కడ ఓ చిన్న ప్రార్థనా మందిరం మాత్రమే ఇందుకు సాక్ష్యంగా ఉంటోందని వారి మాట.బెత్ థూమా (థోమా నివాసం అని అర్థం) అని పిలువబడే ఓ చిన్న ఆలయం. అప్పట్లో అది ఇస్లామ్ పర్యవేక్షణలో ఉండేదట.1523 లో పోర్చుగీస్ వారు థోమా సమాధిపై ఓ భారీ ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. తర్వాతి కాలంలో దీనిని డచ్ వారు కూల్చేసారంటారు. అదే చోట 1893 లో కొత్తగా ఓ ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు.మైలాపూరులో నివసించిన కెప్టెన్ జె.ఎ. పవర్ అనే ఆయన ఈ ఆలయానికి ఓ కొత్త రూపం ఇచ్చారట. ఆయన అప్పట్లో ఓ ప్రముఖ ఇంజినీర్. శాంథోం చర్చిలో పెద్ద గోపురం ఎత్తు 155 అడుగులు. కొత్తగా నిర్మించిన కట్టడాన్ని 1896 ఏప్రిల్ ఒకటో తేదీన పవిత్రం చేశారు.చర్చి చరిత్ర మాట అటుంచితే మైలాపూరులోని కచ్చేరీ రోడ్ చివర్లో ఉన్న ఓ స్కూలు ముందరున్న బస్టాపులో దిగి ఓ అయిదు పది అడుగులు ముందుకెళ్ళి ఎడం చేతివైపు తిరిగి ఓ పది నిముషాలు నడిచి ఆకాశవాణి (ఆలిండియా రేడియో స్టేషన్) కి వెళ్ళి రావడం ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతోంది. అలాగే ఇదే కచ్చేరి రోడ్డులో రచయితలైన చందూర్ దంపతులుండేవారు. అన్నిసార్లు కచ్చేరి రోడ్డులో దిగినా ఒకటి రెండుసార్లు మాత్రమే వారింటికి వెళ్ళాను. ఆంధ్రప్రభ వారపత్రికలో మాలతీచందూర్ గారు రాసిన ‘ప్రమదా వనం’ శీర్షిక దేశవిదేశాల్లోని తెలుగు గృహిణులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె దాదాపు 47 ఏళ్లపాటు ఈ శీర్షిక కొనసాగించడం గిన్నిస్ రికార్డులకెక్కింది. అలాగే "పాత కెరటాలు" శీర్షికతో అనేక ఆంగ్ల రచనలను తెలుగువారికి పరిచయం చేశారు. ఆమె మొదటి కథ "రవ్వ లడ్డూలు". ఆమెకు 1987లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1993లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. ఆమె భర్త ఎన్. ఆర్. చందూర్ గారూ రచయితే. ఆయన సంపాదకత్వంలో జగతి అనే మాసపత్రిక వెలువడేది. ఆఖరి సంచిక 2014లో వెలువడింది. ఈ పత్రిక నేను చదువుకున్న వివేకానందా కాలేజీ లైబ్రరీకి ప్రతి నెలా వచ్చేది. నిమ్మతొనలు, డైరీ శీర్షిక కింద ఇచ్చిన విశేషాలు చదివేవాడిని. - యామిజాల జగదీశ్
July 30, 2020 • T. VEDANTA SURY • Memories