ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సక తక్కెడ – పేడ తక్కెడ -డా.. కందేపి రాణీప్రసాద్.
November 1, 2020 • T. VEDANTA SURY • Story

ఒక ఊర్లో రంగడున్నాడు. వాడు ఈ పని చేయడు. పని చేసి డబ్బులు సంపాదించాలంటే బద్దకం ఒట్టి సోమరిపోతు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనుకునే రకం. రోజూ ఏదో విధంగా ఎవర్నో ఒకళ్ళను మోసం చేసి ఏ రోజూకారోజు పొట్ట గడుపుకుంటాడు. అంతే కానీ ఓ క్రమ పద్ధతిగా పని చేయడం, సంపాదించడం ఏమీ ఉండదు. అదీ వాడి దినచర్య.
 ఓ రోజు రంగడు పొద్దున్నే పోరుగూరికి బయల్దేరాడు. ఊరి పొలిమేర దాటి అడవి మార్గం గుండా నడుచుకుంటూ పోతున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తుండగా మధ్యాహ్నమైంది అడవి దారిలోనే. సూర్యుడు నదినెత్తి కొచ్చేశాడు. ఎండ మండిపోతోంది. శరీరం చెమటలు కక్కుతుంది.నెత్తి మాడుతోంది. కింద కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి. కాసేపు చెట్టుకింద విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. తలగూగ్గ విప్పి తల కింద పెట్టుకొని కాసేపు చల్లగాలికి విశ్రమించాడు. నడిచిన అలసట వల్ల ఆ చల్లగాలికి అతడికి వెంటనే నిద్రపట్టింది.ఆకలికి కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే హటత్తుగా మెలకువ వచ్చింది. కడుపు రుద్దుకుంటూ చుట్టూ చూశాడు. ఏదైనా చెట్లకు పండ్లున్నాయేమోనని.కనుచూపుమేరలో ఏమీ కనిపించలేదు. పోనీ ఎవరినైనా అడుగుదామన్నా ఒక్క మనిషీ కానపడలేదు. ఏం చేద్దామా అని చుట్టూ చూస్తున్నంతలో ఎండకు మాడిపోతున్న ఇసుక కన్పించింది.భుజం మీద కండవా తీసుకొని దానిలో ఆ మాడిపోయే వేడివేడి ఇసుకను పోసుకొని మూటగట్టుకొని భుజానికి తగిలించుకొని తిరిగి ప్రయణమయ్యాడు. ఎవరో ఒకరు దొరక్కపోతారా? ఏదో విధంగా మోసం చేయక పోతమా అని ఆలోచిస్తూ ముందుకు సాగాడు.
 సరిగ్గా ఇలాంటి ఆలోచనలతోనే పొరుగూరి నుంచి భీముడనే వాడు ఈ ఊరికి బయల్దేరాడు. వాడు సోమరిపోతే. ఎప్పుడు ఎవరో ఒకర్ని మోసం చేసి బతికేవాడే. వాడికి రోజు అన్నం దొరకలేదు. దారిలో ఏం చేద్దామని అనుకునేంతలో రోడు మీద ఒక గేదె పెద వేయటం కనిపించింది. ఏదో ఆలోచన వచ్చిన వాడిలా ఆ పెదను ఉత్తరీయంలో మూత గట్టుకొని బయల్దేరాడు. కొంతసేపటికి ఆ అడవి మార్గంలో ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. మోసం చేసి ఆహారం సంపాదించ వచ్చని ఇద్దరూ ఎవరి మనసులో వారు సంతోషపడ్డారు.
 ఇద్దరూ ఒకర్నొకరు పలకరించుకున్నారు. మాటా మాటా కలిపారు.ఇద్దరూ కాసేపు మాట్లాడుకొన్నాక రంగడు “ఇంట్లో నేను ఊరికి వెళుతున్నాను అన్నం మూట కట్టివ్వు అని చెప్పగానే మాయావిడ వేడి వేడి అన్నం వండి మూత కత్తి ఇచ్చింది. నాకేమో ఇంత వేడి అన్నం తినడం ఇష్టం లేదు. చల్లగా ఉంటే ఇష్టం” అన్నాడు భీముడితో.
 దానికి భీముడు సమాధానగా “అయ్యో అలాగా! మా ఇంట్లో మా ఆవిడను నేను ఊరికి వెళ్ళాలి వేడి వేడి అన్నం వండవే అంటే రాత్రి మిగిలిన చద్దన్నం మూటగట్టించింది. ఈ చల్లటి అన్నం తినలేక ఇందాకట్నుంచీ ఆకలేస్తున్నా అన్నం తినలేదు” అన్నాడు.
 అప్పుడు రంగడు “సరే భలే బాగుందే! నాకు చల్లటన్నం ఇష్టం నీకేమో వేడన్నం ఇష్టం. కాబట్టి మనిద్దరం మన అన్నం మూటల్ని మార్చుకుందాం. అప్పుడు ఎవరికి నచ్చిన అన్నం వారు తినవచ్చు! ఏమంటావు” అన్నాడు. దానికి భీముడు అలాగే అలాగే అంటూ సంతోషంగా తలూపాడు. ఇద్దరూ ఒకరి మూట మరొకరు మార్చుకున్నారు. ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడకుండా ఎవరు వెళ్ళాల్సిన దారిలో వాళ్ళు పయనమయ్యారు. అక్కడ కాసేపు నిలబడ్డ ఎక్కడ మూట విప్పితే తమ మోసం బయట పడుతుందేమోనని త్వరత్వరగా వెళ్ళిపోయారు.
 కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండవ వాళ్ళు కనపడనంత దూరం వెళ్ళాక ఇద్దరూ తమ మూటలు విప్పారు ఆత్రంగా అన్నం తిందామని. ఏముంది అక్కడ. వేడి ఇసుక మూటగట్టుకొచ్చిన రంగడికి పేడ మూట వచ్చింది. చల్లని పేడను మూట కట్టుకొచ్చిన భీముడికి మాడిపోయే ఇసుక మూట దొరికింది. అందుకే ఇసుక తక్కెడ పేడ తక్కెడ అని ఒకర్నొకరు మోసం చేసుకునే వాళ్ళని చూసి అందరూ అంటుంటారు. ఈ సామెత ఇలా వచ్చింది