ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్కు సరిగమలు- రామ్మోహన్ రావు తుమ్మూరి -
August 22, 2020 • T. VEDANTA SURY • Memories

నాలుగైదు రోజులనుండితీర్పాటం కుదరక పాయె ముచ్చట్లు చెప్పడానికి. చాలా మందే నాటకాలు వేస్తారు కానీ కొందరికే నాటకాల పక్షి అనే బిరుదు లభిస్తుంది.అలాంటి వారిలో ముందుగా చెప్పాల్సింది బలరామకృష్ణ గారైతే తరువాత చెప్పాల్సిన పేరు డి.వి.వి. సత్యనారాయణ గారు.బలరామకృష్ణ గారు ఫ్రభుత్వ ఉపాధ్యాయులు. సత్యనారాయణగారు పేపరు మిల్లు ఉద్యోగి.ఈ రోజు బలరామకృష్ణ గారి గురించి నాకు గుర్తున్న,తెలిసిన విషయాలు కొన్ని చెబుతాను.పి.బలరామకృష్ణ గారు నేను కాగజ్ నగర్ వెళ్లే సరికే ఉపాధ్యాయునిగా పెట్రోలు పంపు స్కూల్లో పని చేస్తున్నారు. పెట్రోలు పంప్ ఏరియా కాగజ్ నగర్  పట్టణంలో బస్సు మార్గం ద్వారా ప్రవేశించేటప్పుడు ముందుగా స్వాగతం పలుకుతుంది. ఆ ఏరియాలో రెండు పెట్రోలు పంపులు బస్టాండు,ఇటీవల ఏర్పడ్డ వెంకటరమణ టాకీసు, మున్సిపాలిటీ ఆఫీసులు ఉన్నాయి.ఒక రకంగా ఊళ్లో కాస్తా అభివృద్ధికి నోచుకున్న ప్రాంతం.నేను వెళ్లిన కొత్తలో అక్కడ ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉండేది.దానికి ప్రధానోపాధ్యాయుడు మన బలరామకృష్ణగారు.ఆయన ఆ ప్రాంతంలోని యువకులను బడి పిల్లలను,ఆయన బంధువులలో కొందరిని కూడగట్టి ఫ్రెండ్స్ క్లబ్ అనే సమాజం ఏర్పాటు చేశారు.పిల్లలతో నాటకాలు వేయిస్తూనే యువకులతో పరిషత్తు నాటకాలు తయారు చేసేవారు.మంచి నటుడు,మంచి దర్శకుడు కళా పిపాసి గనక ఆయన తయారు చేసిన ఛాయ నాటకం చాలా చోట్ల బహుమ తులు సాధించిందని విన్నాను.ఇక్కడో విషయం చెప్పాలి.అప్పట్లో కళా సమాజాల మధ్య పోటీ చాలా ఉండేది. స్పర్థ మంచిదే కాని,ఒక సమాజం నటులు మరొక సమాజం నటులతో శత్రువుల్లా ఉండటం కాస్తా ఇబ్బందిగా ఉండేది నాకు.అవేవో రాజకీయ పార్టీల్లాగా ఒకరంటే ఒకరికి పడేది కాదు.అలాగని అందరూ అలా ఉండేవారు కాదు.అందులో కూడా కలుపుగోలుగా ఉండేవాళ్లు ఒకరిద్దరుం
డేవారు.బలరామకృష్ణ గారు మంచి స్నేహపాత్రులు.కళాహృదయులు.ఇతర సమాజాల్లో ఎవరైనా బాగా నటిస్తే అభినందించే సహృదయులు.వాళ్ల సమాజంలో సత్యనారాయణ,యాదగిరి, బుచ్చిలింగం,సదానందం,మొదలైన వాళ్లుండేవారు.తరువాతి కాలంలో యాదగిరి శిశుమందిర్ హైస్కూల్లో పి.ఇ.టి.గా చేరిపోయారు.బుచ్చిలింగం రాజకీయాల్లో చేరి ఎన్.టి.ఆర్. అనుయాయుడుగా తెలుగుదేశం లీడర్ గా ఎదిగి,ఒక టర్మ్ కాగజ్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ గా కూడా చేశారు. పాపం ఇటీవలే అకాలమరణం చెందారు.సదానందం పత్రికా విలేఖరిగా ఎదిగి దురదృష్టవశాత్తు అతను కూడా అకాలమరణం చెందారు.వీళ్లను తీర్చి దిద్దిన గురువుగా బలరామకృష్ణ గారికి మంచి పేరున్నది.అయితే వారితో నా పరిచయం వాళ్ల పూలరంగడు నాటకం ఎత్తుకున్నప్పుడు జరిగింది.అప్పటికి నా పెళ్లయ్యింది.మా ఆవిడ ఉషారాణి శిశుమందిర్ హైస్కూల్లో టీచరుగా చేరింది.ఈమె స్కూల్ ఫంక్షన్స్లో పాటలు పాడటం చూచి యాదగిరి గారు పూలరంగడు నాటకానికి మా ఆవిడతో నేపథ్యంలో పాటలు పాడటానికి అడిగారు.అలా ఆ నాటకం ,కాగజ్ నగర్లో రెండుమూడు చోట్ల,సిర్పూర్ లో ఒకసారి వేయటంతో ఆమెతో పాటు నేను వెళ్లటం అలా మంచి మైత్రి ఏర్పడింది. ఆ తరువాత ఫ్రెండ్స్ క్లబ్ వారు అల్లూరి సీతారామరాజు వేశారు.ప్రదర్శనలు చూడటమే తప్ప సమాజం లోపలి ముచ్చట్లు నాకు అంతగా తెలియవు. కాని ఆ తరువాత లలిత కళా సమాఖ్య ఏర్పడ్డ తరువాత అన్ని సమాజాల సభ్యులు మంచి స్నేహితులుగా మారిపోవడం ఒక శుభపరిణామం. బలరామ కృష్ణ గారితో కలిసి నేను సాయిలీలలు లో నటించాను. సాయిలీలలు గురించి మళ్లీ వివరంగా చెప్పేదుంది.గమ్మత్తేమిటంటే కాలక్రమంలో సర్సిల్క్ బందయిపోయి నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరి కాగజ్ నగర్ మండలంలో ఆయనతో పాటు అనేక సందర్భాల్లో కలుసుకున్నాం.
అన్నిటికంటే ముఖ్యం ఆయన వేంపల్లి పాఠశాలలో పనిచేస్తూ రిటైరైనప్పుడు నన్ను ఆ పాఠశాల ఉపాధ్యాయిని మాలతిగారు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించటం మరుపురాన విషయం.ఆ తరువాత కొంతకాలానికి గుండెపోటుతో మరణించినపుడు డాడానగర్ లో వారి ఇంటి వద్ద కాగజ్ నగర్ కళాకారులందరూ కలిసి సంతాప సభ ఏర్పాటు చేశారు.నేను వారి గురించిఓ స్మృతి గీతం రాసి వినిపించాను. ఆయన చేపట్టిన పనులు నాటకాల వివరాలు అన్నీ రాస్తే అదే ఒక పుస్తకమవుతుంది.చాలా విషయాలు నాకు తెలియనివి ఉన్నాయి.ఆయనకు నా శ్రద్ధాంజలి.