ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు-రామ్మోహన్ రావు తుమ్మూరి -మిత్రుడు పెద్దింటి వరదాచార్యులు--నిన్న వీర బొబ్బిలి గురించి ఎప్పుడు రాస్తారో ఎదురు చూస్తున్నానని కామెంట్లు పెట్టారు.చాలా సంతోషం అనిపించింది.చదివే వాళ్లుంటేనే రాసేవాళ్లకు ఉత్సాహం కలుగుతుంది. నేను బళ్లో పాఠం చెప్పినప్పుడు కూడా పిల్లలు పాఠం వినటం లేదనిపించి నప్పుడు పాఠం ఆపేసే వాణ్ని.ఒరేయ్ ఇవాళ మీకు పాఠం వినే మూడ్ లేనట్టుంది.సరదాగా సినిమా కబుర్లు చెప్పుకుందాం అనే వాణ్ని.అలా మళ్లీ నా దారికి తెచ్చుకుని పాఠం చెప్పేవాణ్ని.ఐతే ఇక్కడ నాలుగు మాటలు మిత్రుడి గురించి చెప్పాలి.వరదాచార్యులు నేను చేరిన తరువాత కొన్ని రేజులకు నేను పని చేసిన సర్ సిల్క్ మిల్లు లేబొరేటరీ లో చేరారు.బహుశః అతను మా షిఫ్ట్ బ్యాచ్ లో పనిచేసినట్టున్నారు.త్వరలోనే మంచి మిత్రులైనారు.పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చారు.నరసింహరాజు ఊరు వాళ్ల ఊరు ఒకటే అని చెప్పిన గుర్తు.బ్రహ్మచారే గనక త్వరలోనే మా నాటకం గ్యాంగులో కలిసిపొయ్యారు. అప్పుడే రామదాసు ఎత్తుకోగానే అందులో లక్ష్మణుడు వేయటం,ఆ తరువాత మహారథి కర్ణలో అర్జునుడు కూడా వేశారు.అక్కడే ఉంటే ఇంకా కొన్ని నాటకాల్లో వేసేవారేమో కాని ఆయనకుబ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ రావడంతో సర్సిల్క్ జాబ్ వదిలి వెళ్లారు.ఎపరైనా జాబ్ రిజైన్ చేసి వెళ్లిపోతే వారికి చిన్న వీడ్కోలు పార్టీ ఇవ్వటం మా ల్యాబ్ ఆనవాయితీ.అయితే అదే సమయం లో మరో సీనియర్ కెమిస్టు కాకరాల తులసీదాస్ గారు కూడా రిజైన్ చేయడంతో ఇద్దరికీ కలిపి పార్టీ ఇవ్వడమే గాక అందరం కలిసి ఫోటో కూడా దిగాలనుకున్నాం.ఆ సందర్భంగా దిగిన ఫోటో నే మాకు చిరస్థాయిగా సర్సిల్క్ లేబొరేటరీ జ్ఞాపక చిహ్నంగా ఉండి పోయింది.ఇక్కడ తులసీ దాసు గారి గురించి కూడా చెప్పాలి. మొదటిసారి నాకు ఆదినారాయణ గారు పరిచయం చేశారాయన్ని. అంతవరకు ఆ పేరుగల వ్యక్తి నాకు తటస్థపడలేదు గానిరామచరితమానస్ రాసిన తులసీదాస్ గురించి తెలుసు.చిన్న తనంలో హనుమాన్ చాలీసా నోటికి వచ్చేది.అది రాసిందీ తులసీ దాసేనని తెలుసు.ఈ ప్రస్తావన ఎందుకంటే నా ఊహల్లో మరియు కొన్ని పుస్తకాలమీది తులసీదాసు బొమ్మకు ఆయన ముఖానికి చాలా పోలికలుండేవి విచిత్రంగా.నా మనసులో అనుకునే వాణ్ణి ఈయనకు తులసీ దాసు వేషం వేస్తే భలే బాగుంటుందని. ఇక తులసీ దాసుగార పరిచయమైన కొన్ని రోజులకే తెలిసింది వారి బావమరిది సినిమాల్లో చేస్తున్నాడని.ఆయన మరెవరో కాదు ఇప్పుడు ప్రసిద్ధనటులు మురళీమోహన్ గారే.అప్పట్లో జగమే మాయ గిరిబాబుతో కలిసి రిలీజవటం,ఆ తరువాత మన ఊరిపాండవులు ఇవన్నీ ఆయన అక్కడ ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు. సినిమా హీరోగార బావగారు మా కొలీగ్ అని భావించడంఅప్పుడో క్రేజ్.ఆ తరువాత తెలిసింది.మురళీమోహన్ కొంతకాలం అక్కడ ఉండి వెళ్లారనీ,వాళ్ల నాన్న గారు కలప వ్యాపారం చేసేవారనీ.అదీ కాకుండా తులసీ దాసుగారు సినిమా కబుర్లు బాగా చెప్పేవారు.అప్పట్లో సినిమా కబుర్ల కున్నంత క్రేజీ మరి దేనికీ ఉండేది కాదు గనుక మేము ఒకరకంగా ఆయనంటే బాగా ఇష్టపడేవాళ్లం. అప్పటికి టీవీలు రాలేదు.కాలక్షేపానికి పత్రికలు నవలలు చదవడం,సినిమాలు చూడ్డం మరికొంతమందికి పేకాటాడ టం. దాసుగారు కూడా మంచి పుస్తక ప్రియులు.ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదవటం మా ల్యాబ్ లో దాదాపు అందరికీ అలవాటు.ఒకరి పుస్తకాలు ఒకరు మార్చుతున్న కూడా చదివే వాళ్లం.అందరి కప్ బోర్డ్స్ లో ఏదో ఒక పుస్తకమో మేగజైనో ఉండటం పరిపాటి.ఎనిమిది గంటల షిఫ్ట్ డ్యూటీలో సాంపిల్ వస్తే ఎనాలిసిస్ చేయటం ,లేని సమయంలో పుస్తకాలు చదవటం అందరికీ అలవా టు. అలా ఎన్ని పుస్తకాలు చదివామో లెక్కలేదు.దాసు గారు కమ్యూనిస్ట్ మైండ్ సెట్ కలిగిన వారు.మంచి మేధావి. రంగనాయకమ్మ విషవృక్షం వారు తెస్తేనే చదివాను.వారు ఎల్.ఐ.సి.ఏజంటుగా కూడా చేసేవారు.వారు నాటకాల్లో వేయక పోయినా నాటకాలంట అభిమానం.మన వూరిపాండవులు సినిమాలో ఒక పాట సినిమా రిలీజుకంటేముందుగానే ఒక నాటకంలో నేపథ్యంగా వాడిన గుర్తు.వారు క్యాసెట్ తెచ్చి ఇచ్చార ప్పట్లో.మరో విషయం వాళ్ల అబ్బాయి మా తమ్ముడు ఇంటర్మీడి యేట్ లో క్లాసుమే ట్లు. కరీం నగర్ లో స్వంతంగా ఏదో చిన్న పరిశ్రమ పెట్టుకోవడానికి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు.అలా వాళ్లిద్దరికీ కలిపి ఒకేసారి వీడ్కోలు చెప్పటం జరిగింది.అయితే దాసుగారినిఆయన కరీంనగర్ లో ఉన్నన్ని రోజులు నేను కరీంనగర్ వెళ్లినప్పుడల్లా కలిసే వాడిని.కొంతకాలానికి ఆయన అమెరికా వెళ్లిపోయారని తెలిసింది.నేను 2010 లో మొదటిసారి అమెరికా వెళ్లినపుడు ఇంటర్నెట్ లో నా తెలివి తేటలన్నీ ఉపయోగించి దాసుగార్ నంబరు సంపాదించాను.వారితో మాట్లాడితే చాలా సంతోషించారు. అప్పట్లో ఆయన ఉండే చోటికి రమ్మన్నారు కాని,కొత్త చోటు అని భయపడి వెళ్లలేదు.మొన్న మొన్ననే నరిశెట్టి ఇన్నయ్య గారి పోస్టింగ్ తో తెలిసింది.వారు భౌతిక కాయాన్ని వీడారని.ఈ ఫేస్బుక్ ద్వారానే వలవేసి వరదాచార్యులను పట్టుకున్నాను. మొత్తానికి తీగ లాగితే డొంకంతా కదిలిందన్నట్టు ఈ రోజటిది ఇద్దరు మిత్రుల కథ అయ్యింది.ఇంకా వరదాచార్యులకు చెప్పాల్సిన వీరబొబ్బిలి ముచట అలాగే ఉంది.(సశేషం)
August 15, 2020 • T. VEDANTA SURY • Memories