ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు-రామ్మోహన్ రావు తుమ్మూరి -సరే ఇక మన సర్సిల్క్ సరాగాల్లోకి మారుదాం.మా సర్సిల్క్ మిల్లుకి యజమాని అంటే ఛైర్మన్ లకోటియా.వైస్ ఛైర్మన్ బి యల్.డాడా.ఆయన క్రింద జనరల్ మేనేజర్ మహేశ్వరి.మహేశ్వరి అంటే ఆడామె అనుకునేరు. మగాయన నే.మా డాక్టరు గారికి అంటే డా.సీతారా మయ్య గారికి నాటకం వేయించాలనే ఆలోచన రాగానే చక్కగా జీపు వేసుకున వచ్చి మహేశ్వరి రూం లో కూర్చుని మా అందరికీ కబురు పంపే వాడు.మేం వెళ్లగానే ఏమయ్యా మళ్లీ ఏదైనా నాటకం ఎత్తుకుందాం.అందరూ ఫలాని రోజు లలిత కళాసమితికి రండి అని ఓ ఆర్డరు జారీ చేసి వెళ్లిపోయ్యే వారు.మేం అప్పటికే నాటక వైరాగ్యం పూర్తిగా అనుభవించి మళ్లీ పిల్లాడిని కనడానికి సిద్ధమయిన సంతాన లక్ష్మి లాగా నాటక పక్షులందరం హాలుకు చేరుకునే వాళ్లం.అలా సీతారామయ్యగారికి మూడు నెలలకో నాటకం పడక పోతే తోచేది కాదు.కారణ జన్ముడు.ఆయనలాంటి వారుండబట్టే నాటకరంగం బతికి బట్టకట్టింది. మా గురువుగారు ఓసారి పౌరాణికం ఓసారి సాంఘిక నాటం ఓసారి హాస్య నాటిక,ఓసారి పరిషత్తు స్థాయి నాటిక ఎంపిక చేసేవారు. ఈ సందర్భంగా మా డైరక్టరు మూర్తిగారి గురించి నాలుగు మాటలు చెప్పాలి.ఆయన పూర్తి పేరు తోటకూర రాధాకృష్ణ మూర్తి.పొట్టిగా టి.ఆర్.కే.మూర్తి .కాని మేమెన్నడూ ఆయన్ను మూర్తిగారని సంబోధించి ఎరుగం.ఎప్పుడు పిలిచినా గురువుగారూ అనే.ఆయనదర్శకత్వం లో అరణితో మొదలుకొని,సతీ సక్కుబాయి,నాతిచరామి,పుణ్యస్థలి,రామదాసు,అతిథి దేవుళ్లొస్తున్నారు జాగ్రత్త,వరుడు కావాలి,మహావీర పురుషోత్తమ, రాముడు రంగడు,ఊరుమ్మడి బతుకులు,మహారథి కర్ణ,చిటపట చినుకులు,పరిశోధన, రెండు రెళ్లు ఆరు, జన్మాంత రవైరం,ఏక్ దిన్ కా సుల్తాన్,సీతాకల్యాణం వేశాం.ఆ తరువాత వారు బదిలీపై వెళ్లి పోయిన తరువాత అప్పటికి లలిత కళా సమితి లలిత కళాసమాఖ్య గా మారి పల్నాటి పాంచజన్యం గారి దర్శకత్వంలో మరి కొన్ని నాటకాలు వేశాం.పాంచజన్యం గారు వేయించిన నాటకాల గురించి తరువాత వివరంగా చెబుతాను.మూర్తి గారి గురించి చెబుతానన్నాను కదా!ఆయన మా చేత పైన చెప్పిన నాటకాలన్నీ వేయించినా ఆయన దర్శకత్వంలో నేను గమనించిన విలక్షణ తత్త్వం యాక్టర్లు పై డామినేషనుండేది కాదు.ఆయన గట్టిగా డైరెక్షన్ చేసినట్ట కూడా అనిపించేది కాదు.ముందుగా కొన్ని సిట్టింగు రిహార్సల్స్ జరిగేవి.అప్పుడే అక్కడక్కడా మాడ్యులేషన్ సవరించే వారు.డైలాగులు నోటికి వచ్చినట్లనిపిం చగానే స్టాండింగ్ కు వెళ్లి పోయేవాళ్లం.స్టాండింగ్ లో మొదటినుంచే ఇలా ఉండాలని కాకుండా మెల్లగా నాటకం ఇంప్రూవ్ చేసేవారు.దాంతో నటు లెవ్వరికీ పెద్దగా కష్టపడినట్లనిపించేది కాదు.అన్నిటికంటే ముఖ్యం ఆయన భలే కబుర్లు చెప్పే వారు. మామూలుగ అయితే రిహార్సల్ మధ్యలో కబుర్లు ఆటవిడుపు.కానీ గురువు గారి దర్శకత్వంలో కబుర్ల మధ్య ఎప్పుడో రిహార్సల్ జరిగేది.రిహార్సల్ జరుగుతుంటే ఎదురుగా కూర్చొని కుడికాల ఊపుతూ ఎడమ చేతిలో సిగరెట్టు వెనుక సిగరెట్టు కాలుస్తూ మధ్య మధ్య సలహాలు సూచనలు చేసే వారు.ఎక్కడైనా వాళ్ల డైలాగు డెలివరీసరిగా లేక పోతే నన్ను పురమాయించే వారు.రామ్మోహన్రావ్ ఆ డైలాగు చూడు అని.నా కప్పటికే స్క్రిప్టులు రాసి ప్రాంటింగ్ ఇచ్చి అందరి డైలాగులు మాడ్యులేషన్తో సహా కంఠస్థం గనక నేను వెళ్లి చేసి చూపించే వాణ్ని.చివరి రిహార్సల్స్ దగ్గరికి వచ్చేసరికి నాటకం గానీ నాటిక గానీ అద్భుతంగా తయారయ్యేది.రిహార్సల్స్ లో డైలాగు మరిచిపోయినా ఫర్వాలేదు మూడ్ కంటిన్యూ చేయించేవారు. ఆయనకు కోపం రావటం నేను చూడలేదు.ప్రేమతో విజయం సాధించ టమెలాగో ఆయన నేర్పిన పాఠాలు నాకు తరువాతి టీచర్ జీవితంలో బాగా ఉపయోగ పడ్డాయి.పిల్లలకు ప్రేమతో పాఠాలు చెబుతున్నా మనే విషయం అర్థమయితేవాళ్లు మనల్ని గౌరవించకపోవడమనేది ఉండదు.గురువు గారి ధ్యాసంతా నాటకం బాగా రావాలనే తప్ప తనకు పేరు రావాలని అనుకునేవారు కాదు. పాత్రల పరిచయం అప్పుడు కూడా దర్శకత్వం మూర్తి అని చివర్లో చెప్పీ చెప్పనట్లుగా ఉండేది.సిగరెట్ తో పాటు చిరునవ్వు ఆయనపెదవులనెప్పుడూ వదిలి ఉండేది కాదు.తన నాటకాల గురువుచాట్ల శ్రీరాములు గారిని ఎప్పుడూ తలచుకొనేవారు.ఆయన దర్శకత్వంలో ప్రత్యేకత చెప్పాలంటే నటులను తమ పాత్ర బాగా అవగాహన చేసుకునేట్లు చేసేవారు.దానితో నటులు తమకు తాముగా తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకునే వారు. అందుకే నాటకం ప్రదర్శన చెప్పి చేయించినట్లుగా కాకుండా చాలా సహజంగా వచ్చేది.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా ఊరి బెంగాలీ నాటకాల డైరక్టరు కు విపరీతమైన కోపమనీ బాగా తిట్టే వాడనీ ఎప్పుడూ ధుమ ధుమలాడుతూ ఉండే వాడనీ నటీనటులంతా డైరక్టరు గారంటే గజగజ వణికే వారనీ విన్నాను.మా మూర్తి గారు అలా కాదు.ఈయన ఫ్రెండ్లీ డైరక్టర్.ఆయనకు నా జోహార్లు.ఆయన వేయించిన నాటకాల కబుర్లన్నీ మెల్లగా ఒక్కటొక్కటీ చెబుతాను.అందులో కొన్నిటిని గురించి ఇదివరకే చెప్పాను.మిగతావి చెప్పిన తరువాత పాంచజన్యంగారి నాటకాలను ప్రస్తావిస్తాను.(సశేషం)
August 6, 2020 • T. VEDANTA SURY • Memories