ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు-రామ్మోహన్ రావు తుమ్మూరి
September 1, 2020 • T. VEDANTA SURY • Memories


ఇక రాజ్ మోహన్ గారి విషయానికి వస్తే ,ఆయన కంపెనీ పలు నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసి తర్వాత తానే ఒక కంట్రాక్టరుగా అనేక పనులు చేయించేవారు.ఆ అనుభవంతోనే ఆర్.కే.ఫాబ్రికేటర్స్ బీరువాల తయారీల వంటి పనులకు వెల్డింగ్ వర్క్ షాపింగ్ తెరిచారు.ఆతరువాత అదే కాంప్లెక్సులో పైన ఒక లాడ్జింగ్ ఓపెన్ చేశారు.దాని నిర్వహణా బాధ్యత పాంచజన్యంగారు చూసుకునేవారు.
అప్పుడప్పుడు లాడ్జింగ్ డాబా మీద కళాకారుల సమావేశాలు జరిగేవి.రాజమోహన్ చాలా బిజీగా ఉండేవారు.అటు కంపెనీ పని,ఇటు వెల్డింగ్ షాపు,మరోవైపు వ్యవసాయం,దీనికి తోడు నాటకాలు.ఎప్పుడు తోవలో కనిపించినా ఆగి పలుకరించి రెండు మాటలు మాట్లాడి వెళ్లేవారు.నూరుపాళ్ల సహృదయుడు. నిరాడంబరుడు, నిష్కల్మషుడు. స్నేహశీలి.ఎందరికో ఉపాధి కల్పించి ఆదుకున్న ఆదర్శవంతుడు.
ఆయన మంచి నటుడు కనుక ఆపద్ధర్మంగా అనేక సార్లు ఇతర సమాజాల నాటకాల్లో వేసేవారు.అలా ఫ్రెండ్స్ క్లబ్ వారి పూలరంగడులో కామెడీ పాత్రవేయటం నాకు గుర్తు.
అలాగే మేం లలితకళాసమితి ద్వారా వేసిన నాతిచరామి లో వేసారు.అలాగే జి.పి.ఆర్ట్స వారి శంకుతీర్థంలో వేసినట్టున్నారు.లలితకళా సమాఖ్య ఏర్పడిన తరువాత క్విట్ ఇండియాలో వేశారు.అలాగే శారదానాట్య కళామండలి వారి వీరబొబ్బిలిలో విజయరామరాజు పాత్ర అద్భుతంగా పోషించారు.శ్రీనివాస కళాసమితి లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఏడుకొండలు లో టైటిలు పాత్ర వేసి నాటిక రక్తి కట్టించారు.
నటనాలయ వేదిక మీద మేమందరమ కలిసి ఓ నాటిక వేశార.పేరు గుర్తుకు రావటం లేదు.అసమాన నటుడు.ఆయన హీరోగా చైతన్య రథం వీడియో ఫిల్మ్ దాదాపు పూర్తయింది.పెద్దవాగు ఒడ్డున ఉన్న ఓ చిన్న పల్లెలో షూటింగ్ చేశార.మున్సిపాలిటీ ఆఫీసులో కొంత షూటింగ్ జరిగింది.చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం.ఇంతలో నాకు స్పాట్ వాల్యుయేషన్ వస్తే ఆదిలాబాదు వెళ్లాను.వెళ్లిన తెల్లారన మర్నాడో విషాదవార్త వినాల్సి వచ్చింది.దేవుడు మంచివాళ్లను తొందరగా తీసుకెళ్తాడంటారు.
కంపెనీలో పనిచేయిస్తూ పైనుంచ కిందపడి రాజ్మోహన్ మరణించాడన్న వార్త కాగజ్ నగర్ పట్టణాన్ని శోకసముద్రంలో ముంచింది.నలభై ఏళ్లకే నూరేళ్లు నిండిన రాజ్మోహన్
స్మృతులు ఎన్నటికీ మార్చి పోనివి.ఆ తరువాత నటనాలయ సంస్థ దాదాపు ఓ పుష్కర కాలం ఆయన పేరిట అనేక పోటీలు నిర్వహించింది.అలా రాజ్ మోహన్ మరణం కాగజ్ నగర్ నాటక రంగానికి తీరని లోటు ఏర్పరచింది.పాంచజన్యం గారు కాగజ్ నగర్ లో ఉన్నంత కాలం అత్యంత శ్రద్ధతో సంస్మరణ కార్యక్రమాలు చేసి స్నేహితుని ఋణం తీర్చుకున్నారు.అప్పట్లో నాతో ఓ గీతం కూడా రాయించారు
నటనాలయ దీపమా!నటనకు ప్రతిరూపమా అని రాసాను.మరువలేని నటుడు కీ.శే.
చింతల రాజ్ మోహన్ రావు.ఆయనకు నా ళ్రద్ధాంజలి.