ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు-రామ్మోహన్ రావు తుమ్మూరి
September 6, 2020 • T. VEDANTA SURY • Memories

(నా అర్ధాంగి ఉత్తమ ఉపాధ్యాయిని ఉషారాణి గిరిరాజన్ కు అంకితం గా )
అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు.మా ఇంట్లో బాపు తుమ్మూరి పద్మనాభ శర్మ ఉపాధ్యాయుడు.ప్రథమ శ్రేణి తెలుగు పండితులు గా ఉద్యోగ విరమణ చేశారు.ఆ తరువాత నేను కూడా మొదట్లో కొంతకాలం మిల్లులో పనిచేసినా అది మూతబడటంతో 34వ ఏట బి.ఎడ్ చేసి 35 వ ఏట ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేరి రాజస్వ ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ గావించాను.నా శ్రీమతి బి.ఎస్సీ.టి.టి.సి.తో కాగజ్నగర్ శిశుమందిర్ హైస్కూల్ లో ఎయిడెడ్ టీచర్ గా చేరి ఆ తరువాత బి.ఎడ్.చేసి స్కూల్ అసిస్టెంట్ అయింది.నాగార్జున యూనివర్సిటీ నుండి ఎం.ఎస్సీ బాటనీ,
కాకతీయ యూనివర్సిటీ నుండి ఎం.ఎస్సీ
సైకాలజీ చేసింది.1979 నుండి 2014 దాకా ఒకే స్కూల్లో 35 సంవత్సరాలు పనిచేసి అదే స్కూల్ ప్రధానోపాధ్యాయిని గా ఉద్యోగ విరమణ చేసింది.తన సర్వీసు కాలంలో అనేక మంది విద్యార్థుల్ని తీర్చి దిద్దటమే గాక కుటుంబంలో చాలా మందిని చేరదీసి తన దగ్గర ఉంచుకొని
విద్యాబుద్ధులు నేర్పింది. స్కూలు పిల్లలను అనేక వైజ్ఞానిక ప్రదర్శనలకు తీసుకొని వెళ్లి బహుమతులు తెచ్చుకోవడానికి తోడ్పడింది.విలక్షణ గాయనిగా పలు కార్యక్రమాలలో పాటలు పాడి రసజ్ఞులను మెప్పించింది.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా అప్పటి
జిల్లా కలెక్టరు, జిల్లా విద్యాశాఖాధికారుల
ద్వారా ప్రశంసాపత్రము పొంది సత్కరింపబడింది.ఎందరికో మార్గదర్శనం చేయడం,తనకోసం కాకుండా ఇతరుల కోసం జీవితాంతం పాటుపడింది.ఆమెకు తోడుపడిన భర్తగా ఆమెద్వారా నాకూ మంచి పేరు లభించిందని గర్వంగా చెప్పుకుం టున్నాను. “పల్లెటూరి అబ్బాయికి పదునుపెట్టి వెన్నుతట్టి ,మట్టిని మణిగాచేసిన దేవత కథ చెప్పాలని ఉంది”అని పాడుతుండే వాణ్ని ఆమెను ఉద్దేశించి సరదాగా.అది నిజం కూడా.
ఇవాళ మా పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారన్నా మా కుటుంబం ఓ పద్ధతిగా ఉందన్నా గృహిణిగా అత్తామామలు, ఇంటిల్లి పాదీ మెచ్చిన పెద్దకోడలుగా ఆమె ఆదర్శంగా నిలిచిందనటంలో సందేహం లేదు.నిస్వార్థంగా ఆలోచించటమే అందుకు ముఖ్య కారణం.అందరూ నావారు అనుకోవడం మరో కారణం.ఆమె అమెరికాలో అర్థాంతరంగా అసువులు బాసినప్పుడు
ఎందరెందరో ఆమె గురించి తన్లాడినప్పుడు తెలిసింది ఆమె ఎందరి ప్రేమ చూరగొన్నదో.ఈ సందర్భంగా ఆమెను నామమాత్రంగా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగమిచ్చి ఆమె ప్రగతికి తోడుగా నిల్చి, జీవన గమనానికి ఆదర్శంగా నిల్చిన శ్రీమతి మాలినీ చాందోర్కర్ గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వారికి నాహృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను.వారు ప్రస్తుతము
తమ వానప్రస్థాన్ని నాగపూర్ లో గడుపుతున్నారు.వారు మంచి విదుషీమణి.ఆధ్యాత్మిక శిరోమణి.సంగీత రసాస్వాదిని.ఎందరికో మార్గదర్శనం చేసిన మహిళామణి.డా.సామల సదాశివ గారి వంటి ప్రముఖుల మన్ననలు పొందిన తేజస్విని.ఆమెను ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా తలచుకొని నా వినమ్ర పూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను.
ఇక మా ఇంట్లో నా తరువాతి తమ్ముడు డా.లక్ష్మన్ రావు డిగ్రీ కళాశాలాధ్యాపకుడిగా ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతము పదవీవిరమణానంతర సేవలో భాగంగా కరీంనగర్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాలుగా పని చేస్తున్నాడు.మంచి గాయకుడు. పద్యపఠనం విలక్షణంగా ఉంటుందని పలువురు ప్రశంసించటం నాకు చాలా ఆనందకరమైన విషయం.వరంగల్ సహృదయ కీలక సభ్యుడుగా అనేక కార్యక్రమాలు నిర్వహించాడు.
ఇక నాలుగో తమ్ముడు డా.శరత్ బాబు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఆంగ్లోపాధ్యా యుడు. మంచిగాయకుడు. అన్నమా చార్య కీర్తనలంటే ఇష్టం.మంచి అనువాదకుడు.
పలు సంకలనాలలో తను ఆంగ్లంలోకి అనువాదం చేసిన కవితలు చోటు చేసుకున్నాయి. స్వయంగా ఆంగ్ల కవి.ఇక మా అమ్మాయి మామగారు కూడా ఉపాధ్యాయులుగా పని చేసి అధ్యాపకులుగా పదవీ విరమణ పొందారు.వారు రెండు రాష్ట్రాల నాటకరంగంలో పేరు ప్రతిష్ఠలు కలిగినవారు.శ్రీవనం లక్ష్మీకాంతారావు గారు నాకు వియ్యంకులు కావడం మా అదృష్టం.వారు సహృదయ సంస్థ మూలస్థంభాలలో అగ్రగణ్యులు.ఇంకా మరదళ్లు ఇద్దరు టీచర్లే.గిరిరాజన్ విజయలక్ష్మి జూనియర్ కళాశాల ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసింది.
మూడో మరదలు మంజులా రామకృష్ణ
భారతీయ విద్యాభవన్ లో పని చేసి అకాలమృత్యువు వాత పడింది.ఇంకా మా బంధువులలో చాలా మంది ఉపాధ్యాయులే కావడంతో ఉపాధ్యాయ దినోత్సవం మాకు ఇంటి పండుగ వంటిది.నాకు చదువు చెప్పిన గురువుల స్మరణకోసం మిత్రుడు ఎలనాగ వ్యాసం పోస్టు చేశాను.వారందరికీ నమస్సులు.
నా శిష్యులలో కొందరు ఉపాధ్యాయవృత్తిని ఎన్నుకున్న వారున్నారు.వారికి నా అభ్యుదయ కాంక్షలు.అందరి కంటే పెద్ద గురువు మా అమ్మకు ప్రణమిల్లుతూ ఈ వ్యాసం నా అర్ధాంగి గిరిరాజన్ ఉషారాణికి అంకితం చేస్తున్నాను