ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు-రామ్మోహన్ రావు తుమ్మూరి
August 24, 2020 • T. VEDANTA SURY • Memories

మొన్న బలరామకృష్ణగారి గురించి నాకు తెలిసిన నాలుగు ముచ్చట్లు చెప్పాను. ఆయన లాగానే నాటకైక జీవి శారదా నాట్యకళామండలి సత్యనారాయణ గారు. వారి నాటకాభిలాష కాగజ్ నగర్లో అనిదంపూర్వ దేవాలయ నిర్మాణానికి దారి తీసిందంటే అతిశయోక్తి కాదు. ముందు వారి నాటక ప్రస్థానం,తరువాత దేవాలయ నిర్మాణ ప్రస్థానం చెప్పుకుం దాం.మొన్న చెప్పాను శెట్టిబలిజ సంఘం గురించి వారి ముక్కోటి ఏకాదశి ఉత్సవాల గురించి.ఎఫ్.టైపులో చిన్నగా జరుపుకునేవారని.ఐతే నాకిక్కడో చిన్న సందేహం కలుగుతుంది.అవి దసరా ఉత్సవాలైనా,రామనవమి ఉత్సవాలైనా, పాతికేళ్ల క్రితం మొదలై ఇప్పుడు బాగా ఊపందుకున్న గణేశ్ నవరాత్రులైనా,ముక్కోట నవరాత్రులైనా ఉత్సవాలకోసం సాంస్కృతిక కార్యక్రమాలా లేక నాటకా లు, ఆర్కెస్ట్రాలు,డ్యాన్సులు మొదలైన వాటికోసం ఉత్సవాలు నిర్వహించడ మా? అని.సరే ఏదైతేనేం భక్తి కోసం రక్తైనా ,రక్తి కోసం భక్తైనా ఒకటే.సదరు ఉత్సవాల పేరిట సంవత్సరం పొడు గూతా పట్టణంలో ఏవో కార్యక్రమాలు జరగటం పరిపాటి.సరే శా.నా.క.మండలి వారు ప్రతి ఏడు ముక్కోటి ఉత్సవాలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు.వేరే సమాజాల వారిని కూడా ఆహ్వానించి నాటికలు వేయించేవారు.చివరి రోజు వారి ప్రదర్శననో లేదా ఆర్కెస్ట్రానో ఉండేది. వారి సమాజం తరఫున మొదట్లో పిల్లలతో చెంచులక్ష్మి వేయించటంతో మొదలై ఆ తరువాత భక్త ప్రహ్లాద, వీరశివాజీ,వీరబొబ్బిలి,రావణ విజయం,గీతోపదేశం,ఫోనొచ్చింది,నాటకాలతో పాటు ప్రత్యేకంగా సత్యనారాయణ గారు బ్రహ్మనాయుడు, మాయలఫకీరు,చాకలి తిప్పడు వంటి ఏక పాత్రలు వేసారు.కాగజ్ నగర్ రాకముందు వారి స్వగ్రామం నర్సాపూర్ ప్రాంతంలో వారి బంధువులు(ప్రొఫెషనల్ నటులు) వేసే నాటక సమాజాల వారితో మెదలటం,వాచింది మొదలైన పనులు చేపట్టిన అనుభవం ఉండటంతో నాటక ప్రదర్శన మీద మంచి అవగాహన కలిగి ఉండేవారు.ఈ నేపథ్యంలో ముక్కోటి నవరాత్రులు మారుమూలకు చేస్తే ఏంబాగుంటుందనిసర్ సిల్క్ కాలనీ వెల్ఫేర్ సెంటర్ లో ఓ రేకుల షెడ్డులో ఓ కోవెల నిర్మించి ఉత్సవాలు నిర్వహించటం మొదలు పెట్టడం జరిగింది.అలా రేకులషెడ్డులో మొదలైన లక్ష్మీ నారాయణ స్వామి కోవెలఇప్పుడు శిల్పవైభవంతో కాగజ్ నగరానికే వన్నె తెచ్చే దేవాలయం రూపొందింది. దాదాపు కోటి రూపాయలకు పైగా విడతల వారీగా విరాళాలు సేకరించి అత్యంత ప్రతిష్ఠాత్మక దేవాలయం రూపొందడానికి ముఖ్య కారకులు సత్యనారాయణగారు మరియు వీరి వియ్యంకులు ఆయన పేరు కూడా సత్యనారాయణనే.మా అందరిని ఊరిలో ప్రముఖులను అందులో భాగస్వామ్యం చేసిన ఘనత వారిదే.గత దశాబ్దకాలంగా అక్కడ ఏటేటా అనేక ఉత్సవాలు నిర్వహిస్తూవస్తున్నారు. ఇటీవల రథోత్సవం,విశేష నృత్య కార్యక్రమాలు ఊరి జనాలకు ఉత్సాహం కలిగించే విధంగా చేస్తున్నారు.స్థానిక ఎం.ఎల్.ఏ .కోనేరు కోనప్ప గారు వివిధరంగాలకు చెందిన ప్రసిద్ధులు అందరినీభాగస్వాములుగా చేస్తున్నారు.కొంత కాలం ఆలయ నిర్వాహక మండలి ఉపాధ్యక్షులలో ఒకరి గా నేనుండటమే గాక ఒక దేవాలయం శంకుస్థాపన నుండి విగ్రహ ప్రతిష్ఠ దాకా కళ్లారా చూసే భాగ్యం కలిగించారు నాకు కూడా సత్యనారాయణ గారు.దేవాలయం చుట్టూ మంచి తోట పెంచుతూ దేవాలయ పరిసరాలను ఆకర్షణీయంగాఉంచేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న మిత్రుల సత్యనారాయణ గారి గురించి స్థాలీ పులాక న్యాయంగనే చెబుతున్నానిపిస్తుంది.వారికి నా అభినందనలు.వారితో కలిసి క్విట్ ఇండియా,వీర బొబ్బిలిలో,సాయిలీలలునాటకాల్లో వేసాను.సాయిలీలలు నాటకం లో మా ఇద్దరి కాంబినేషన్లో ఒకటి రెండు సీన్లున్నాయి.ఆయన హేమాడ్ పంత్ గా నేను మహల్సాపతిగా
వేసాము.సహృదయతకు మారు పేరు సత్యనారాయణ గారు.సాయిలీలలు నాటకంలో ఎడమ నుండి కుడికి:హేమాడ్ పంత్ గా డి.వి.వి. సత్య నారాయణ,శ్యామా గా బలరామకృష్ణ,తాత్యా గా మురళీకృష్ణ,మహల్సాపతి గా నేను,సాయిబాబాగా సాయిలీలలు నాటక రచయిత మోపర్తిభాస్కర రావు.