ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు-రామ్మోహన్ రావు తుమ్మూరి
September 4, 2020 • T. VEDANTA SURY • Memories

భాస్కరరావు గారు అటు సాయిభక్తులుగా అనేక కార్యక్రమాల నిర్వహణలో మారిగదర్శిగా ఉంటూ పిల్లల చేత కార్యక్రమాలు నిర్వహింప జేయటం,ఎస్పీయం (సిర్పూర్ పేపర్ మిల్లు) న్యూకాలనీ లో పాలరాతి సాయి విగ్రహంతో సాయిబాబా మందిర నిర్మాణం పనులలో నిమగ్నులవుతూనే స్థానిక మిల్లు ఉద్యోగుల కార్మిక సంఘాలతీరును దృష్టిలో ఉంచుకుని ‘సత్యం వధ ‘ నాటిక రాశారు.ఆ పాటికే వారి పూర్వాపరాలు అన్నీ తెలియడంతో వారికే దర్శకత్వ బాధ్యత వహించ మన్నాం.అలా ఆయన దర్శకత్వంలో నేను ‘సత్యంవధ’ లో నటించాను.ఆ తరువాత వారు గీతోపదేశం రాశారు.
అందులో నేను లేను కానీ,వారితో ఉన్నాను.అది కాగజ్నగర్లో రెండు మూడు వేదికలపైన ప్రదర్శించబడింది.
ఇది ఇలా ఉండగా వారు సాయిలీలలు నాటకం రాయడం జరిగింది.కాలంలో కూడా అనేక మార్పులు జరిగి కాగజ్ నగర్ కళాకారులందరూ సమాజానికొకళ్లుగా మిగిలిపోయిన సందర్భం ఏర్పడింది.
ఆ సరికే లలిత కళా సమాఖ్య ఏర్పడటం
కళాకారులంతా ఒక గొడుగు కిందికి రావడం,అన్యోన్యత పెరగడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి.అప్పటికి
పాంచజన్యం,భాస్కర్ రావుగారల మధ్య
సాన్నిహిత్యం పెరగటంతో భాస్కర్ రావు గారు నాటికను వారి చేతిలో ఉంచారు.
నాటకం బాగా రావాలనే ఉద్దేశంతో వారు కొంతమంది షిరిడీ వెళ్లి ఆ సన్నివేశాలకు సంబంధించిన స్థలాలు పరిసరాలు
పరిశీలించడ వచ్చారు.ఎప్పుడూ లేని విధంగా దానికి సంబంధించిన చాలా
తర్కించుకొని మార్పులు చేర్పులు చేసి
భారీ ఎత్తున నాటకం ప్రదర్శించాలని అన్ని విధాల అందరి సహకారంతో ప్రారంభించాం.దాదాపు పదహారు మంది నటీనటులతో ఎత్తుకున్న ఆ నాటకంలో కాగజ్ నగర్ లోని అన్ని సమాజాల సభ్యులు ఉన్నారు. సాయిబాబాగా భాస్కర్రావు గారే వేశారు.
బయాజీ బాయిగా,లక్ష్మిగా, రాధాకృష్ణ మాయిగా శిశుమందిర్ హైస్కూల్ ఉపాధ్యాయిని కుమారి సుభద్రాచారి
గారు వేయటం దైవసంకల్పం.
సుభద్రగారి తండ్రి గొప్ప సంగీతపరులు.పూర్వాశ్రమంలో సినీ పరిశ్రమలో కొంత కాలం పని చేసి సావిత్రి
వంటి మహానటికి స్వరాభ్యాసం చేయించిన వారిగా పేరుపొందారు. అక్కడ కాలం కలిసిరాక ఉదరపోష ణార్థం కాగజ్ నగర్ లో స్థిరపడ్డారు. సుభద్రగారు చిన్నతనం నుండి కాగజ్ నగర్ లోనే ఉండి చదువు అయిన తరువాత స్థానిక శిశుమందిర్ లో ఉపాధ్యాయిని గా చేరి మగపిల్లలు లేని
తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచారు.కారణాంతరాలవల్ల అవి వాహితగా ఉన్న సుభద్రగారు ఆంగ్ల ఉపాధ్యాయినిగా మంచి పేరు సంపా దించిన వారు.వారి నడి వయస్సులో వారు ఈ నాటికలో నటించటం ఒక
గొప్ప విషయం.వారు ఆ మూడు పాత్రలకూ న్యాయం చేయడానికి వెనుక ఒక రహస్యం ఉన్నది.సుభద్రగారి విద్యాభ్యాసమంతా వాళ్ల పెద్దమ్మ దగ్గర నాగపూర్ లో జరిగింది.మహారాష్ట్ర సంస్కృతి తో మమేకమైన సుభద్ర గారు
ఆ పాత్రలలో జీవించారు.ఇక సాయిబాబాగా వేసిన భాస్కరరావు అటు నాటక రచయిత,ఇటు నటుడు,
సాయిభక్తుడు అంతే గాక రూపంలో కూడా సాయిబాబాతో చాలా సామ్యం ఉన్న వ్యక్తి గనుక ఆయన పాత్రకు ప్రాణం పోశారు.నేను మహల్సాపతి పాత్ర వేయడం ఒక విచిత్రం.అంతవరకూ నాకు ఈ ఆధ్యాత్మిక విషయాలమీద అంతగా ఆసక్తి ఉండేది కాదు.డిగ్రీ చదువుకునే రోజుల్లో కరీంనగర్ లో జీవగడ్డ విప్లవ పత్రిక సంపాదకులక విజయ్ కుమార్ గారితో రహస్యంగా రిహార్సల్స్ వేసి వరంగల్ బి.ఇడి కాలేజీలో
బ్యానర్ చేసిన నాటికలో పాత్ర వేసిన నేపథ్యం ఉన్నవాణ్ని.అటు హేతువాదినీ కాక,ఇటు భక్తి పరుణ్నీ కాక మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నవాణ్ని.నా కంతవరకూ సత్యసాయి అన్నా ,షిరిడీ సాయి అన్నా ఎక్కువగా తెలియదు. తెలుసుకోవాలనే ప్రయత్నం చేయలేదు.
కనుక నాకు ఆ కథంతా కొత్తనే.నేనొక పాత్రగా నటించినా అదో కొత్త దారికి
మళ్లించిందని చెప్పాలి.నాటక ప్రదర్శన తరువాత కుటుంబ సమేతంగా షిరిడీ వెళ్లటం జరిగింది చాలా సార్లు.నువ్వు కాలానికి లోబడి ఉంటే అది నీకు ఎన్నో నేర్పిస్తుంది.అదంతా వేరే సంగతి.కానీ
సాయిలీలలు నాటకం కాగజునగరు చరత్రలో ఒక చరిత్ర సృష్టించిన నాటకం.
స్థానిక సంగీత,నృత్య కళాకారులందరితో సహా రూపొందిన విజయవంతమైన నాటకం.అది స్థానికంగా రెండు మూడు సార్లు వివిధ వేదికలపై ప్రదర్శించాము.
అందులో హేమాడ్ పంత్ గా డివివి సత్యనారాయణ,శ్యామాగా బలరామ కృష్ణ, గోవిందస్వామి హరి కనోబాగా జి.యాదగిరి,భాగోజీ గా గుత్తుల భాస్కర్ రావు,శాంతారాంగా జ్ఞానేశ్వర్, గుడ్డివాని గా జాఫర్ఖాన్,బూటీగా ఎన్నెస్ ప్రకాశరా వు,అబ్దుల్లాగా వెంకటస్వామి,పఠాన్ గా వివేకానంద స్వామి,పాప గా బేబీ దీప్తి,గాసగణు బి.సత్యనారాయణ, డా.పిళ్లై గా డి.శ్రీనివాస్ నటించారు. ఆర్ట్ డైరక్షన్ స్థానిక బాలవిద్యామందిర్ ఆర్ట్ టీచర్ దాసరిరామకృష్ణారావు గారు స్టేజికి కావలసిన పరదాలు,సెట్టింగ్ లు అన్నీ చూసుకున్నారు .సంగీత పర్యవేక్షణ ఎన్ సిహెచ్ వి రంగనాథ్ మరియు పియల్ యన్ శ్రీరామాచార్యులు వారితో పాటు వాయిద్యకళాకారులు,కోలాట నృత్యం చేసిన వారు స్థానిక మేకప్ ఆర్టిస్టు సత్తిరాజు ఇంకా అనేక మంది కార్యకర్తలు కలిసి చేసిన నాటకం సాయిలీలలు.ఆ ఘనత అంతా రచయిత ముఖ్య పాత్రధారి శ్రీ మోపర్తి భాస్కర్రావు గారు,దర్శకులు భాస్కర్ రావుగారికి దక్కుతుంది.సాయి లీలలు ఒక రకంగా మా అందరికీ కాగజ్ నగర్ లో చివరి నాటకమే.ఆ రోజులు మళ్లీ రావు.