ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు- రామ్మోహన్ రావు తుమ్మూరి
October 5, 2020 • T. VEDANTA SURY • Memories

గత రెండు పోస్టింగులలో రామాచారి గారి గురించీ,గాంధర్వ నికేతన్ గురించి చెప్పుకొస్తున్నాను కదా!మరి కొన్ని విశేషాలు ఈరోజు పంచుకుందాం. రామాచార గారిని నేనొక విజేత అంటాను.అది ఆయన మీద ఉన్న అభిమానం వల్లనో,లేదా నాకు ఆయన వల్ల మేలు చేకూరిందనో అనేదానికంటే ఆయన ఒక సంస్థను స్థాపించి పొందిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని,సంస్థ నిర్వహణలో తన ఆశయాలను నెరవేర్చుకోవడానికి,ఆయనకు గల ఓర్పు,నేర్పు గమనించి అంటున్నాను.
72 వయస్సులో కూడా ఉత్సాహం తగ్గకుండా కాలనుగుణంగా ఫేస్బుక్ ,వాట్సప్ లద్వారా పాటలు పాడి వీడియో రికార్డ్ చేసి పదిమందితో పంచుకోవడమే గాక ప్రతి ఆదివారం సాయంత్రం వెబ్ మీట్ ద్వారా సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారంటే వారికి సంగీతం పట్ల ఎంత నిబద్ధత ఉన్నదో 
తెలుస్తుంది.నాకు పరిచయ మైనప్పటి నుండి అంటే గత నలభై ఐదేళ్లుగా ఆయన తన కార్యకలాపాలను నిర్విరామంగా కొనసాగిస్తుండటం మామూలు విషయం కాదు.కాగజ్ నగర్ లో ఉన్నంత కాలం అటు సంగీత శిక్షణ,ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు 
 సమాంతరంగా నిర్వహించారు.గాంధర్వ నికేతన్ కేవలం సంగీతానికే పరిమితం కాకుండా ఉగాది,సంక్రాంతి కవి సమ్మేళనాలు వంటి సాహిత్య కార్యక్రమాలు,ఔత్సాహికులచే నాటికలు ప్రదర్శింపజేయటం,బాలబాలికలచే నృత్యప్రదర్శనలిప్పించటం,పలూస్కర్ భాత్ఖండే వంటి ప్రసిద్ధ హిందూస్తానీ గాయకుల జయంతులు నిర్వహించి హిందూస్తానీ సంగీత కచేరీలు నిర్వహించడం,ఘంటసాల జయంతి జరిపి స్థానిక గాయనీ గాయకులచే ఘంటసాల పాటుల కార్యక్రమం ఏర్పాటు చేయటం,లలితసంగీత పోటీలు, కార్యక్రమాలు జరపటం ,స్థానిక కళాకారులచే ఆలిండియా రేడియో కార్యక్రమాలు ఏర్పరచడం,వీటన్నితో పాటు సభ్యుల కుటుంబాలతో వనభోజనాలు ఏర్పాటు చేయటం ఆయనకే చెల్లింది.దానికి ముఖ్య కారణం 
ఆయనలో ఏదో చేయాలన్న తపన నిరంతరం ప్రదీప్తమవుతుండటమే.ఇవి చాలు ఆయనను విజేత అని చెప్పడానికి .కాని ఇవే కాక కాగజ్ నగర్ గర్వపడే విధంగా ఆయన తీర్చి దిద్దిన గాయనీ గాయకులు ఈ రోజు సినీ పరిశ్రమ దాకా చేరుకొని వారి ప్రతిభను నిరూపించుకోవడం.అలా ఆయన గర్వపడే విధంగా తయారయిన హరికాంత్ ఇప్పుడు ఇండస్ట్రీని నమ్ముకుని జీవిస్తున్నాడు. రామాచార్యులు గారి ముగ్గురు అమ్మాయిలు సంగీతం నేర్చుకుని మంచి గాయనీమణులుగా తయారైనా పెద్దవాళ్లు ఇద్దరూ పరిమిత కార్యక్రమాల్లో పాడుతుండగా చిన్మమ్మాయి దీప్తి చార్య మాత్రం ప్రొఫెషనల్ సింగర్ గా పలు కార్యక్రమాల్లో పాల్గొనటమే గాక కొన్ని చిత్రాలకు పాటలు పాడటం విశేషం.ఆయన వద్ద గిటార్ వంటి ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు.సంగీతానికి సంబంధించిన విషయాలను వ్యాసాలుగా రాసి అప్పట్లో పత్రికలకు పంపించే వారు.అలా రాసిన వ్యాసాలు మొన్న బాలు గారి స్మరణగా పోస్ట్ చేయటం గమనించ వచ్చు.ఫేస్బుక్ లో వారు పాడి పాటల వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వెలువరించారు.నా గజల్ పుస్తకావిష్కరణ సభలో నేను రాసిన గజల్స్ తండ్రీ కూతుర్లిద్దరూ పాడటం నేను మరువలేని విషయం. వీరికి తోడుగా సహధర్మచారిణి శ్రీమతి ఎన్.సి.రాజ్యలక్ష్మి గారు సంతానం వీణాప్రియ, నిరుపమ, దీప్తి మరియు అశుతోష్ అందరూ ఉండటం అందరూ కళాకారులు కావటం విశేషం.తన వద్ద గిటారు,వీణ,క్యాషియో వంటి ఇన్ట్రుమెంట్లు నేర్చుకున్న శిష్యులు కూడా చాలా మందే ఉన్నారు.తనతో పాటు నలుగురిన పైకి తీసుకురావాలనే వీరి ఆశయమే వీరిని విజేత చేసిందంటాను నేను.ఒకప్పుడు లిఖిత పత్రిక వెలువరించే ప్రయత్నంలో నన్ను సంపాదకునిగా,సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన నాటికలకు దర్శకునిగా,దాదాపు అన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా నాకు ప్రోత్సాహమిచ్చిన వ్యక్తి శ్రీ శ్రీరామాచార్యులు.ఓ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ లో నా చే గద్దర్ పాట పైలంకొడుకో పాట పాడించటం అది పలువురినీ ఆకర్షించటం నేను మరచి పోలేని విషయం.మరో చరిత్రాత్మక సందర్భం రామాచారిగారి అధ్వర్యంలో జరిగింది. 
అది కాగజ్ నగర్లో జరిగిన ఒక అపురూప 
కార్యక్రమం.వందేమాతర గీతం శతజయంత్యుత్సవాల సందర్భంగా శతగళ వందేమాతరగీతాలాపన స్థానిక  ప్రముఖుల సమక్షంలో నిర్వహించటం ఈయన కీర్తి కిరీటంలో కలికి తురాయి వంటిది.ఓ ఘంటసాల జయంతికి అప్పుడు అక్కడ వున్న డా.పత్తిపాకమోహన్ గారు వ్యాఖ్యానం చేయటం నాకు గుర్తున్నది.ఓ వార్షికోత్సవ సభకు ప్రస్తుతం బుల్లితెర లబ్ధప్రతిష్ఠులైన నాగబాల సురేశ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనేకమంది సంగీతవిద్వాంసులను సంస్థ ద్వారా సత్కరించారు.
అలాగే ఆదిలాబాదు కవిశ్రేష్ఠులు డా.సామల సదాశివ గారు వారి యాదిలో శ్రీరామాచారిగారిని ప్రస్తావించారంటే ఇక నేను చెప్పిన విషయాలన్నీలచాలా తక్కువ కిందే లెక్క.
అందుకే ఆయన ఒక విజేత.ఆ స్థానానికి రావడానికి ఆయన కృషి,పట్టుదల, సమయోచిత ప్రజ్ఞ,అందరినీ కలుపుకోయే మనస్తత్వం కారణాలు. ఈనాటికీ మొక్కవోని ఆయన ఉత్సాహానికి నా అభినందనలు.