ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు-12:- రామ్మోహన్ రావు తుమ్మూరి ---సర్ సిల్క్ తెలుగు వాళ్లలో ప్రముఖులుగా చెప్పుకోదగ్గవాళ్లు అప్పట్లో అధికారులుగా శాయోజి రావు, పి.ఎస్.రావు.,బి.వి. ఎస్. రాజు,బండి రామారావు, కే.వి. రావు,పుల్లయ్య శెట్టి గారిలాంటి వాళ్లయితే బయటి వాళ్లలో మస్తాన్ రావు,కే.వి.నారాయణ రావు,మీసాల నర్సయ్య, లాంటి వారు.వీరిలో శాయోజిరావు,బండి రామారావు తప్ప మిగతా వారంతా కళాభిమానులే.మస్తాన్ రావుగారిది భారీ విగ్రహం.వారు బాలనాగమ్మ మాయల ఫకీరు ఏకపాత్ర వేసేవారు.దానికోసం ప్రత్యేకంగా డ్రస్సు కుట్టించుకున్నారాయన.ఉత్సవాల్లో ఏదో ఒకరోజు ఆయన ఏకపాత్రాభినయం ఉండేది.అలాగే ప్రకాశరావు బుర్రకథ బృందం ఉండేది.మోపర్తి శంకరయ్య భాగవతార్ హరి కథలు చెప్పేవారు.ముఖ్యంగా రామనవమికి తెలుగు వాళ్ల స్పందన ఎక్కువగా ఉండేది.దసరా ఉత్సవాలకు బెంగాలీల హడావుడి ఎక్కువగా ఉండేది. వాళ్లకు ‘అగ్రగామి’ అనే సంస్థ ఉండేది.వాళ్ల నాటకాలు చాలా కట్టు దిట్టంగా ఉండేవి.వారికి స్త్రీ పాత్రల కొరత ఉండేది కాదు సరికదా ఆడవాళ్లు పోటీ పడేవారు.నకుల్ రాయ్,భట్టాచార్య కుటుంబం,భౌమిక్ కుటుంబం వాళ్లు,దత్తా కుటుంబ సభ్యులు బెంగలీల్లో ప్రముఖులుగా చెప్పవచ్చు.వాళ్ల ఏకైక దర్శకుడు ఎస్.కే.దత్తా.చండశాసనుడు. మంచి నాటకాలు ఎత్తుకుని ప్రదర్శించేవారు. అలాగే ‘తమిళ సంఘం’తమిళులకూ, కేరళ సమాజం కేరళీయులకూ ఉండేవి. పరమేశ్వరన్,నటరాజన్ అని ఇద్దరు తమిళ నటులు ఆర్టిస్టులు(చిత్రకారులు) చాలావిచిత్రమైన ప్రదర్శనలు ఇచ్చేవారు.వారిలో కాస్తా హాస్యం పాలు ఎక్కువ.అలాగే కేరళ వారిలో వర్గిస్, కే.డి. ఫ్రాన్సిస్ వంటి నటులు అప్పుడప్పడు నాటికలు వేసేవారు.మార్వాడీ సమాజ్, మహారాష్ట్ర మిత్రమండలి ఇంకా కొన్ని ఉత్తర భారత సంఘాలున్నా వారి కార్యక్రమాలు వేరుగా వాళ్లకే పరిమితంగా ఉండేవి.ఒక్క రాంలీలా మాత్రం ఎస్పీయం గ్రవుండ్ లో ప్రదర్శింప జేసేవారు.మహారాష్ట్ర మిత్ర మండలి వారు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేవారు. ఇక తెలుగు వారివి లకస కాకుండా కళాభారతి,ఫ్రెండ్స్ క్లబ్ రెండూ లకసతో పోటీ పడుతుండేవి.రైల్వే కాలనీలో శ్రీనివాసకళాసమితి అని ఒకటుండేది. మా గురువుగారు లకస కు పరిచయం కాకముందు శ్రీనివాసకళాసమితి వారిచే వేయించిన డబ్బారేకుల సుబ్బారాయు డు హాస్య నాటిక మహారాష్ట్ర మిత్ర మండలి వారి వినాయక చవితి ఉత్సవాల్లో చూసినప్పడు దర్శకుని ప్రతిభ నటుల నటనా పాటవం ఏమిటో తెలిసి వచ్చింది.రాజ్ మోహన్ డబ్బారేకుల సుబ్బారాయుడుగా కడుపుబ్బ నవ్వించిన దృశ్యం నలభై ఏళ్లు దాటినా మరపు రానిదిగా ఉంది. కళాభారతి కాంతారావుగారు లకస తో విభేదించి ఒక బృందాన్ని తయారు చేశారు. ఫ్రెండ్స్ క్లబ్ దర్శకులు బలరామకృష్ణగారు మంచి దర్శకులే గాక స్థానికయువకులను ప్రోత్సాహించి మంచి నాటికలు ప్రదర్శించడమేగాక పోటీలకు తీసుకొని వెళ్లేవారు.ఆయన తయారు చేసిన బృందంలో సత్యనారాయణ,యాదగిరి, బుచ్చి లింగం, సదా నందం,మొదలైన వాళ్లుండేవారు.నాకు తెలిసి వారు ప్రదర్శించిన నాటకాలు అల్లూరి సీతారామ రాజు, పూలరంగడు, ఛాయ,అన్నపూర్ణ ఇంటిలో ఆకలి చావులు మొదలైనవి.జి.పి.ఆర్ట్స్ పేరిట సిద్ధిరాములు,రాజ్ మోహన్, శంకర్, బసవయ్య, జయరాం ఆదినారాయణ ఇంకా కొంతమంది అటు శ్రీనివాసకళాసమితి తరఫున ఇటు జి.పి.ఆర్ట్స్ తరఫున నటించేవారు. మీసాలనర్సయ్య,సోమయ్య ఇంకా కొంతమంది పద్మశాలి సంఘం వాళ్లు లాల్బహదూర్ మార్కెట్లో జరిగే వినాయకచవితి ఉత్సవాల్లో పౌరాణిక నాటకాలు వేసేవాళ్లు. వీళ్లందరి గురించి మరో సారి వివరంగా ముచ్చటించు కుందాం.(సశేషం) (దురదృష్టవశాత్తు ఇందులో చెప్పబడిన వారు చాలామంది అకాలమరణం చెందటం శోచనీయం)
July 23, 2020 • T. VEDANTA SURY • Memories