ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు-13-- రామ్మోహన్ రావు తుమ్మూరి --పనులఒత్తిడి వల్ల చిన్న జాప్యం.మొన్న రంగనాథ్ గారి గురించి తెలుపుకుంటూ, ఆయన సాహిత్యకృషి గురించి చెప్పటం మరిచి పోయాను.1982 లో తెలుగు సాహితీ సదస్సు ఏర్పడ్డప్పుడు వ్యవస్థాపక సభ్యులలో ఒకర రంగనాథ్ గారు.కవి సమ్మేళనాల్లో కవితలు వినిపించటంతో మొదలైన ఆయనా రచనా వ్యాసంగం తరువాత పాశురాలను తెలుగులో గీతికలుగా అనువదించే దాకా సాగింది.వాటిని వారి శ్రీమతి రమాదేవిగారితో కలిసి పాడగా విని తరించాం.అలాగే వానమామలై వరదాచార్యుల గీతరామాయణానికి బాణీలు కట్టి పాడి నృత్య రూపకాలుగా ప్రదర్శింపజేసారు.వారికి తగ్గ ఇల్లాలు వారి శ్రీమతి రమాదేవి గారు సంగీత సాహిత్యాల్లో మంచి ప్రవేశమున్నవారు. ఆ తరువాత రంగనాథ్ గారు కొన్ని ఆధ్యాత్మిక అనువాదాలు,రచనలూ చేస్తూ కొనసాగుతున్నది.కొత్త విద్యలు నేర్చుకోవటం పట్ల ఆసక్తి మిక్కిలిగా ఉండేది. ఎప్పటికప్పుడు తనను తాను పునర్నవీకరించుకోవటంలో జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న ఆయన జీవితంలో అశనిపాతం ఇటీవల ఆయన కుమారుని మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. ఆయన కూడా ఇటీవల దివంగతులైనారు. ఆ సందర్భంగా ఒక పత్రికకు నేను రాసిన వ్యాసం వారి గురించిలలితకళా చక్రవర్తి కీ.శే.నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్.--అవిభక్త ఆదిలాబాదు జిల్లాలో కాగజ్ నగర్ ఒక పారిశ్రామిక పట్టణమే కాకుండా కళలకు కాణాచి పేరువడసింది. అలా కళలకు నిలయం కావడానికి కాగజ్ నగర్ కు ఉపాధి కోసం చేరుకున్న ఎందరో కళాకారులు దోహద పడ్డారు.ఐదు దశాబ్దాల క్రింద కాగజ్ నగర్లో రెండు మిల్లులుండేవి.ఒకటి సిర్పూరు పేపరు మిల్లు మరొకటి సిర్సిల్కు మిల్లు.ఈ కంపెనీలలో పనిచేయడానికి దేశం నలుమూలల నుండి అనేక మంది వచ్చి చేరడంతో ఈ పట్టణం ‘మినీ ఇండియా’అన్నట్లుండేది.తొలుత కొందరు పాశ్చాత్య సాంకేతిక నిపుణులతో ప్రారంభించబడినా తరువాత తరువాత అటు ఉత్తరాదినుంచీ,ఇటు దక్షిణాదినుంచీ వచ్చి చేరిన వారున్నారు.వృత్తికోసం వలస వచ్చిన వారు వారితో పాటు వారి సంస్కృతినీ,కళలనూ వెంట పెట్టుకొని రావడంతో అన్ని ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనంగా కాగజ్ నగర్ సంస్కృతి రూపుదిద్దుకుంది.అలాంటి చారిత్రక పట్టణానికి పట్టభద్రుడిని కాగానే నేనూ 1974 లోవెళ్లటం జరిగింది.నేనప్పుడు సర్సిల్కు మిల్లులో కెమిస్టుగా చేరాను.బ్యాచిలర్ హాస్టల్ లో ఉండేవాణ్ణి.హాస్టల్ కెదురుగా శిశుమందిర్ హైస్కూల్ఉం డేది.ఔత్తరాహికుల కోసం నెలకొల్పబడిన హిందీ మీడియం స్కూలది.పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి మాలినీ చాందోర్కర్ గారు.ఆ పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేసేనల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథాచార్యులు ఎన్.సిహెచ్.వి. రంగనాథ్ గా ప్రసిద్ధులు.అప్పట్లో కూనిరాగాలు తీసే నాకు ఎవరో రంగనాథ్ గారు సంగీతం నేర్పిస్తారనటంతో,ఆ మిషతో వారిని కలవటం జరిగింది.రెండు మూడు నెలలు ప్రయత్నించి అది మనకు సరిపడేది కాదని తెలుసుకొని వదిలేసినా వారితో స్నేహం మాత్రం కొనసాగింది.దానికి తోడు నా శ్రీమతి కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయిని గా చేరటంతో అది కుటుంబ మైత్రిగా మారింది.ఆయనను అతి దగ్గరగా చూసే అవకాశాలు చాలా వచ్చాయి .రంగనాథ్ గారు మూడు నెలల కొకసారి ఆలిండియా రేడియోలో లలిత సంగీతం పాడటానికి వెళ్లేవారు.అప్పట్లో దాశరథి, నారాయణ రెడ్డి వంటి ప్రసిద్ధ గేయకవుల గీతాలకు బాణీలు కట్టి పాడేవారు.రికార్డింగుకు ముందు మాకు వినిపించటం జరిగేది అలా ఎన్ని లలితగీతాలు ఆయన నోట విన్నామో..వారిదంతా సంగీత కుటుంబం కావడంతో వారింటికి వెళితే సరస్వతీ మందిరానికి వెళ్లినట్లుండేది.రంగనాథ్ గారు సంగీతజ్ఞులే గాక మంచి నాట్యాచార్యులు.శాస్త్రీయ నృత్యంలో ఆరితేరిన వారు.ఆయన పనిచేసే శిశుమందిర్ హైస్కూల్లో పిల్లలకు నృత్యం నేర్పించేవారు.ఇంటివద్ద వేరే వారికి నేర్పించే వారు. వారి సకల నృత్యకళానైపుణ్యమంతా వారి అమ్మాయి జ్యోతి ద్వారా వెలువరించారు.ఆమె చేత పలు ప్రదర్శనలు ఇప్పించి సన్మాన సత్కారాలు పొందారు.ముందు చెప్పినట్లుగా రంగనాథ్ గారికి లలిత కళలన్నింటిపైనా మంచి పట్టు ఉంది.ఆయన మంచి కవి.అనువాద కులు, చిత్రలేఖకులు,దారుశిల్పి, రూప శిల్పి,హార్మోనియం, వీణ,తబలా మొదలైన వాద్యాలు వారించటం,దారాలతో బొమ్మలుగీయటం ఇలా చెప్పకుంటూ పోతే చాలా విద్యలు ఆయనలో ఉండేవి. వారు స్వంతంగా భారతభారతి అనే సంస్థను స్థాపించి అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు.స్థానిక లలితకళాసమితి నాటికలకు సంగీతం అందించేవారు.తెలుగు సాహితీ సదస్సువ్యవస్థాపక సభ్యులలో ఒకరవటమే కాక చాలా కాలం,కార్యదర్శిగా,అధ్యక్షులుగా పని చేశారు.ప్రపంచ సంగీత దినోత్సవాలకు స్థానిక గాయకులందరినీ ఒకే వేదిక పై పాడించటం,పలు సందర్భాలలో వారి శాస్త్రీయ సంగీత కచేరి చేయడం,ఇలా నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కాగజ్ నగర్ లో ఉన్నంతకాలం తమ కళాసేవనందిచి మన్ననలు పొందిన అపురూప కళాకారుడు.స్థానిక మిల్లుల ఆధ్వర్యంలో జరిగే ఆనందమేళాలలో అనేక సార్లు చివరి దాకాఎవరూ గుర్తు పట్టలేని విధంగా వినోబా భావేగా,జ్ఞానీ జైల్ సింగ్ గా,సర్వేపల్లి రాధాకృష్ణన్,కాశీపండితుడు,ఆఖరుకు కుష్టురోగి వంటి విచిత్ర వేషధారణ వేసి మెప్పించారు.ఆయనలోని నిత్యచైతన్య శీలత అబ్బుర పరచేదిగా ఉండేది.ఆయన పని చేసే పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి మాలినీ చాందోర్కర్ గారు మంచి విదుషీమణి.ఆమె ప్రోత్సాహంతో కొన్ని మరాఠీ ఆధ్యాత్మిక గ్రంథాలు అనువదించారు.వారు స్కౌటు మాస్టరు కూడా.ఒక సారి జిల్లా స్థాయి స్కౌటు ఉత్సవాలు జరుగుతే ఆదిలాబాదుజిల్లా పై స్కౌటు సాంగ్ రాసి పిల్ల చేత పాడించారు.అలాగే రోటరీ క్లబ్ వారి ఉత్సవాలు విశాఖ పట్టణంలో జరిగితే అక్కడికి తన శిష్యులను నృత్య ప్రదర్శనకు తీసుకుని వెళ్లి రాష్ట్రస్థాయి బహుమతి సాధించారు.తిరుప్పావై ని శ్రీగీతికలుగా అనువదించి పుస్తకం వేశారు.వాటికి బాణీలు కట్టి పాడారు. వీరి మేనల్లుడు శ్రీరామాచార్యులు,వారి ముగ్గురు కుమార్తెలు రంగనాథ్ గారి శిష్యులే.వారిలో ఒక అమ్మాయి ఇప్పుడు సినీరంగంలో ఉంది.వారంతా ఆయనను ఎప్పుడూ తలచుకుంటూ ఉంటారు.మరాఠీలో మాడ్గూల్కర్ రాసిన గీత్ రామాయణ్ ని శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు తెలుగులో అనువదిస్తే ఆ గీతాలకు బాణీలు కట్టి పాడి వానమామలై వారికి వినిపించి వారి ప్రశంసలు పొందారు.అవి వినడానికి వరదాచార్యులుగారు రంగనాథ్ గారింటిలో రెండురోజులున్నారు.ఇంకో ముఖ్యమైన విషయం వారి సతీమణి రమాదేవి గారు సంగీత సాహిత్యాల్లో పరిణతురాలు కావడం ఆయన అదృష్టం.అనేక కచేరీల్లో వారితో పాటు ఆవిడ కూడా పాడటం జరిగేది.అలాగే వారి తమ్ముడు లక్ష్మణాచార్యులు వారి ప్రతి కార్యక్రమానికీ తబలా వాయించే వారు.వారి కుమారుడు చేతన్ కూడా తండ్రి నుంచి అన్ని విద్యలూ నేర్చుకున్నాడు కాని దురదృష్టవశాత్తు అకాల మరణం చెందడం ఈ కళాకారుని గుండెలలో అశనిపాతమయింది.ఆ మనో వేదనతో ఏడాది తిరుగుతూనే మొన్న నవంబరు ఇరవైన తన డెబ్బయారవ ఏట హైదరాబాదు లోని స్వంతగృహంలో పరమపదించారు. 1942 జనవరి 19 న ఏలూరు లో శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల చక్రాచార్యులు,శ్రీమతి లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించిన రంగనాథ్ గారు ఏలూరు సి.ఆర్.కాలేజీలో చదివి,ఉద్యోగాన్వేషణలో తమ ఇరవైలలోనే కాగజ్ నగర్ వచ్చారు.ఉద్యోగ విరమణానంతరం హైదరాబాదు,సరూర్ నగర్ లో స్థిర పడ్డారు.రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించబడినా,పలు సన్మాన సత్కారాలు జరిగినా ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లా మారుమూల పట్టణంలో ఆయన జీవితమంతా గడపడం వల్ల ఒక గొప్ప కళాకారునికి రావలసినంత ఖ్యాతి రాకపోవటం బాధాకరమే. అయినా అక్కడ ఉన్నన్నాళ్లూ జిల్లాగర్వించదగ్గ కళాకారునిగా పేరు ప్రతిష్టలు పొందిన వారు కీర్తిశేషులు ఎన్.సిహెచ్.వి.రంగనాథ్.ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉండి ఆయన కళాగరిమను దర్శించినవాడిగా ఆయన అభిమానిగా జిల్లా కళాకారులందరి తరఫున ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
July 24, 2020 • T. VEDANTA SURY • Memories