ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు-14-- రామ్మోహన్ రావు తుమ్మూరి --కాగజ్ నగర్ లో సంగీత పరంగా ఇద్దరు మేరునగశిఖరాలో ఒకరు రంగనాథ్ గారైతే మరొకరు శ్రీకృష్ణకట్టి గారు.కట్టి కుటుంబం వాళ్లు కన్నడిగులు.పేపరుమిల్లు స్థాపించిన తొలి రోజుల్లో కృష్ణకట్టి గారి తండ్రి రావడంతో కట్టిగారికి కాగజ్నగర్ తో చిన్న నాటినుండే అనుబంధం ఉండేది.ఆయన ఆయన తమ్ముడు సుధీంద్ర కట్టి కూడా అదే కంపెనీలో మిల్లులో ఉద్యోగాలు చేయటం,కట్టి గారి సతీమణి స్థానిక బాలభారతిలో ఉద్యోగం చేయటం వల్ల ఆ కుటుంబానికీ కాగజ్ నగర్ కీ దాదాపు అయిదారు దశాబ్దాల అనుబంధం ఉన్నది.తైలాలు లేకుండ వెలిగేటి దీపమ్మువిద్యుత్తు లేకుండ వెలిగేటి దీపమ్ము అనే దాశరథి గారి గజల్ కొన్ని వందల సార్లు ఆయన మధురగళం నుండి వినియున్నాను.అంత మెలోడియస్ గా ఆ గజల్ని గానం చేయటం అనితర సాధ్యం.ఆయన కూడా ఆలిండియా రేడియో సింగరే. దాశరథి, సినారె, బాపురెడ్డి వంటి లబధ ప్రతిష్ఠుల గేయాలకు ఆయన కట్టిన బాణీలు ఆణి ముత్యాలు.ఆయన ఎక్కువగా లలిత గేయాలు పాడేవారు.మృదు మధురంగా,మంజుల మనోజ్ఞంగా,లలితలలితంగా ఆయన పాడుతూ ఉంటే శ్రోతలు మైమరచేవారు.కన్నడిగులు గనుక కన్నడం,ఉర్దూ మీడియంలో చదువుకోవటంతో ఉర్దూ ఔత్తరాహికుల ఆధిపత్యంలో నడిచే కంపనీలో పనిచేయటంతో హిందీ,తెలుగు ప్రాంతంలో నివసించినందుకు తెలుగు భాషలు పట్టుపడటంతో ఆయా భాషల్లోని గీతాలాలపించటంతో ఆయనకు అనేక మంది అభిమానులున్నారు.కృష్ణకట్టి గారికి ఓ అలవాటుండేది.ఆయన రేడియోలో పాడతారని చెప్పానుగదా.రెండు మూడు నెలలకోసారిఆయనకు AIR నుండి పిలుపు వచ్చేది.పాడినప్పుడల్లా మూడు పాటలు పాడాలి.పాడిన పాటలు మళ్లీ పాడ కూడదు.కనుక యాడాదికి పది పన్నెండు లలితగీతాల చొప్పున ఆయన పాడటం మొదలు పెట్టినప్పటినుంచీ కొన్నివందల గీతాలను అనేక మంది కవులవి ఎంపిక చేసుకుని తానే బాణీలు కట్టుకుని ఆడిషన్ కు వెళ్లే ముందు మాకు వినిపించడం.అదే ఆయన అలవాటు.ఆయన కన్నడిగుడైనా తెలుగు సాహితీ సదస్సులో చేరి స్వయంగా పాటలు రాసేవారు.అవి కూడా పాడి వినిపించేవారు..మేము ఒకరిద్దరం మిత్రులం కలిసి వెళ్లేవాళ్లం. ఆయన హార్మోనియం వాయిస్తుంటే వాళ్ల తమ్ముడు సుధీంద్ర కట్టి తబలా వాయించే వారు.మాకు మధ్యలో టీ అందించేవారు శ్రీమతి సుమిత్రా కట్టిగారు ముసిముసినవ్వులతో.ఆమె బాలభారతి అనే స్కూల్లో టీచరుగా పనిచేసేవారు. కాలక్రమంలో మా సర్సిల్కు బందయి నేను బి.ఇడి. చేసి వచ్చి రాజారెడ్డిగారి (కరస్పాండెంట్) పుణ్యమా అని ఆ స్కూల్లో ఓ యేడాది పాటు ఆవిడతో కలిసి పని చేశాను.మొన్ననే వారిద్దరు దంపతులను వారి సోదరుడు ఆయన శ్రీమతిని కలసుకోవడం జరిగింది.కృష్ణకట్టి గారికి సంతానం లేకపోవడంతో తమ్ముళ్లు వారి పిల్లలే ఆయన కుటుంబం.ప్రస్తుతం వారు హైదరాబాదు బోరబండలో ఉంటున్నారు.కష్ణ కట్టిగారి వల్లనే అనేక మంది గేయకవుల పేర్లు తెలిసాయి.సినారె దాశరథి తెలిసిన వారే అయినా మిగతా గేయకవులు బాపురెడ్డి,వడ్డెపెల్లి కృష్ణ, ఎం.కె.రాము లాంటి వారి పేర్లు చెప్పి వారి పాటలు ఇలా సెట్ చేశాను అని వినిపించేవారు .అలా వారి అనేక పాటలకు ప్రసార పూర్వ శ్రోతలం.విచిత్రమైన విషయం ఏమిటంటే నేను హైదరాబాదు వచ్చిన తరువాత పై గేయకవులందరితో మంచి స్నేహబంధం ఏర్డటం.వడ్డెపల్లి కృష్ణగారయితే వారు దర్శకత్వం వహించిన లావణ్య విత్ లవ్ బాయ్స్ సినిమాలో చిన్న పాత్ర కల్పించి ఇచ్చేంత మైత్రి ఏర్పడింది.ఆయన గురించి మరో సారి చెప్పుకుందాం.కాగజ్ నగర్ కళలకు కాణాచి.అక్కడి సంగీత సాహిత్య వాద్య నృత్య నాటక కళాకారుల గురించి రాయాల్సింది చాలా ఉంది. వీలు కొద్దీ రాస్తుంటాను
July 25, 2020 • T. VEDANTA SURY • Memories