ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు-15-- రామ్మోహన్ రావు తుమ్మూరి --లలిత కళా సమితి ఘన విజయాల్లో ‘రాముడు-రంగడు’నాటకం ఒకటి.లకస కార్య వర్గం ఒక టికెట్ డ్రామా వెయ్యాలని సంకల్పించింది.అయితే సాధారణంగా పౌరాణికాలకో చారిత్రకాలకో మొగ్గు చూపే లకస ఈ సారి అనూహ్యంగా ఒక సాంఘిక నాటకాన్ని వేయడం వెనుక కొంత నేపథ్యమున్నది.ఇది 1978 నాటి మాట.మన సినిమా రంగం కుటుంబ గాథా చిత్రాలనుండి స్టంట్ సినిమాలవైపుమరలుతున్న తరుణం.మాఫియా గ్యాంగ్ క్లబ్ డాన్సులు ఫైటింగులు మొదలైన మసాలాలలు నూరి సినిమాను మాస్ అట్రాక్షన్ గా మార్చి ప్రదర్శించడం తోటి అలాంటి నాటకం కూడా జనాకర్షణ పొందుతుందని బాషా గారు రాముడు రంగడు నాటకం రాశారు.అది ఆంధ్రా ఏరియాలో చాలా చోట్ల బాగా పేరు తెచ్చుకుంది.అది ప్రదర్శిస్తే బాగుంటుందని సూచించిన వారు లకస లో కొత్తగా చేరిన రాజేంద్రప్రసాద్ అనే నటుడు.ఆయన అప్పుడప్పుడే కాగజ్నగర్ ఉద్యోగాన్వేషణలో వచ్చారు.మంచి నటుడే కాక అరుదైన కంఠం.కంచు కంఠం.డైలాగు చెప్పితే ఖంగు ఖంగు మని మోగుతుంది.నాకు తెలుసు మీకు ఈ మాట చెప్పగానే జగ్గయ్యగారు గుర్తుకు వస్తారని.జగ్గయ్యగారి కన్నా రిచ్ వాయిస్ రాజేంద్ర ప్రసాద్ ది.తడుముకోకుండా ఆయన డాలాగు చెప్పుతుంటే జనాలు ఆగకుండా చప్పట్లు కొట్టాల్సిందే.సరే ఆయన సలహాను మా మూర్తిగారు కూడా బలపరచటంతోనాటకం ఎత్తుకోవడానికి నిర్ణయమైంది.రాజ్ంద్ర ప్రసాద్ గారు ‘రాముడు’ ఆయనకు సరిజోడీ మరో మధుర కంఠం బాలకృష్ణ ‘రంగడు’.విలన్ నరేంద్రగాయం రాధాకృష్ణ,హీరోయిన్ గా హరిజన్ రాజ్యలక్ష్మి (సినిమా ఫేం),హీరోయిన్ తండ్రి మాధవరావుగా ఇ.ఎస్.ఐ.రాంబాబు,కామెడీ పాత్రలు సింహాచలంగా రావినూతల వేంకటేశ్వర్ రావు(అల్ు రామలింగయ్య స్టైల్,భద్రాచలంగా నేను (రాజబాబు) స్టైల్,సెలెక్టయ్యాం.రాజ్యలక్ష్మి అప్పుడప్పుడే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ నాటకాల హీరోయిన్ గా బాగా పేరు తెచ్చుకున్నది.అప్పటికి హరిజన్ సినిమా ఇంకా తీయలేదు.అచ్చం వాణిశ్రీలా ఉంటుంది.మంచి డాన్స్ చేస్తుంది.టికెట్ డ్రామా కనుక హీరోయిన్ బాగుండాలని ఆమెను ఎంపిక చేశారు.అటు హీరోయిన్ గా ఇటు వాంప్ గా రెండు పాత్రలు వేసింది.సినిమాలో లాగానే డ్యూయెట్లు,క్లబ్ డాన్సులు,కామెడీ పాత్రలతో కూడా ఓ సాంగ్,రాముడి రంగడి ఫైటింగులు,విలన్ వికటాట్టహాసాలు,బరువైన డైలాగులు మేడమెట్లతో సెట్టింగులు స్క్రీన్ పై టైటిల్స్ లైటింగ్ ఎఫెక్టులతోప్రదర్శించబడ్డ ఏకైక నాటకం రాముడు రంగడు.ఇక్కడే మరో విలక్షణ నటుడి గురించి ప్రస్తావించాలి. ఈ నాటకం వేసే సమయంలోనే కాగజ్ నగర్ పోస్టాఫీసులో ఉద్యోగరీత్యా భానుసుధాకర్ అనే నాటకాలపక్షి వాలాడు.నాటకరంగంలో కాకలు తీరిన వాడు.ఏ పాత్రయినా రక్తి కట్టించగలిగిన నటుడే కాకదర్శకుడు కూడా.నాటకంలో ఆయనకుకోసం చూడుపిన్నమ్మా పాటను చేర్చి ఆయనకు అవకాశం కల్పించారు.అప్పట్లో మాడా గారి ఆ పాట ఎక్కడ చూసినా మారుమ్రోగేది.ఆయనది నాటకంలో స్పెషల్ అట్రాక్షన్. కాగజ్ నగర్లో నభూతో నభవిష్యతి నాటకం అని చెప్ప వచ్చు. నటీనటులందరూ పోటీ పడి నటించారు.ఈ ప్రదర్శన ఎస్.పి.ఎం.క్లబ్ లో ప్రదర్శించారు.కొసమెరుపేమిటంటే ఆ నాటక ప్రదర్శన తరువాత వారం రోజులకే నా పెళ్లి ముహూర్తం.అందుకే నాటకం కాగానే నేను బ్యాగు సర్దుకుని కరీంనగర్ బయల్దేరాను.నా పెళ్లికి వచ్చిన మిత్రులు నాటకం ఫోటోలు పట్టుకుని వచ్చారు.అలా మనం నాటకాలరాయుళ్ల మనే సంగతి పెళ్లి పందిరిలోనే బట్టబయలైంది.(సశేషం)(ఈ కింది ఫోటో లో ఉన్న రాజ్యలక్ష్మి ఇల్లాలు సినిమాలో అల్లు రామ లింగయ్య కు జోడీగా చేసింది
July 26, 2020 • T. VEDANTA SURY • Memories