ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్ సిల్క్ సరిగమలు-రామ్మోహన్ రావు తుమ్మూరి -సర్ సిల్క్ క్లబ్ ఎలాగో ఎస్పీయం క్లబ్ కూడా అలాగే నడిచేది.సర్ సిల్క్ స్టాఫ్ మెంబర్స్ కోసం సర్ సిల్క్ క్లబ్,పేపర్ మిల్లు స్టాఫ్ కోసం ఎస్పీయం క్లబ్ దాదాపు ఒక రీతిలో నడిచేవి.వారానికో సినిమా క్లబ్ స్వంత ప్రొజెక్టర్తో వర్షాకాలమైతే హాలులో మామూలు రోజుల్లోబయట గ్రౌండ్లో ప్రదర్శించేవారు.ఎక్కువగా హిందీ సినమాలు వేసినా మధ్య మధ్యలో తెలుగు సినిమాలు వేసేవారు.మళ్లీ అనే సినిమాలు వెల్ఫేర్ సెంటర్ లో వర్కర్స్ కోసం వేసేవారు. సర్సిల్క్ లో వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో రామనవమి,దసరా ఉత్సవాలు జరిగేవి.అలాగే పేపర్ మిల్లులో ఈ ఉత్సవాలు క్రికెట్ గ్రౌండ్ లో జరిగేవి.కాగజ్ నగర్ క్రికెట్ గ్రౌండ్ చాలా పేరు పొందిన ప్రదేశం.అక్కడ ఒకప్పుడు రంజీ ట్రోఫీ పోటీలు జరిగాయట.ఈ ఉత్సవాలు ఒకసారి సర్ సిల్క్ లో మరొక సారి ఎస్పీయం లో ఆల్టర్నేటివ్ గా జరిగేవి.ఆ తొమ్మిది రోజులు ఉత్సవాలు ఎక్కడ జరిగినా ఊరంతా చేరేది.విగ్రహాల అలంకరణ దసరా నవరాత్రుల ప్రత్యేకత.సర్ సిల్క్ నడిచినంత కాలం ఉత్సవాలు బాగా జరిగాయి. ఉత్సవా లలో తప్పని సరిగా నాటకాలు,హరికథలు, బుర్రకథలు ప్రదర్శించ బడేవి.ఏదో ఒక రోజుఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఉండేది.ఇక క్లబ్బుల్లో సంవత్సరానికోసారి ఆనందమేళా జరిగేది.ఆనందమేళా జరిగేది ఒక్కరోజయినా చాలా విశేషంగా ఉండేది.తాత్కాలిక షెడ్ల నిర్మాణం చేసి వాటికి ఆక్షన్ పెట్టేవారు.స్టాఫ్ మెంబర్స్ స్టాల్ తీసుకుని రకరకాల తినుబండారాలు ఆనందమేళా రోజు తయారు చేసి అమ్మడం భలే పోటీల మీద నడిచేది.సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్సులు,పాటలు వంటివి ఉండేవి.వీటితో పాటు విచిత్ర వేషధారణ ఒక ఆకర్షణగా ఉండేది.అలా విచిత్ర వేషధారణ లో రంగనాథ గారు పలు సార్లు బహుమతి పొందారు.ఆయన విచిత్ర వేషధారణ ఎవరు గుర్తు పట్టలేనంతగా ఉండేది.అది ఆయన ప్రత్యేకత.కాశీ పండితునిగా,వినోబాభావేగా,జ్ఞాని జైల్ సింగ్ గా ,కుష్టు రోగిగా ,సర్వేపల్లి రాధాకృష్ణన్ గా ఆయన వేషధారణ అనితర సాధ్యం అన్నట్లుగా ఉండేది.ఆనందమేళాలలో అత్యంత ఆకర్షణీయమైన అంశం తంబోలా.నాకు కాగజ్ నగర్ వెళ్లే దాకా తంబోలా అంటే తెలియదు.అదో ఉత్కంఠ భరితమైన ఆట.చిన్నా పెద్దా అందరూ మైమరచ ఆడేవారు.అప్పట్లో తంబోలా ఫుల్ హౌజ్ విలువ మామూలు ఉద్యోగి నెలజీతమంత ఉండేది. కనుక ఒక్కొక్కరు నాలుగైదు టికెట్లు కొనేవారు.ఆనందమేళా బహుశః బెంగాలీల సంస్కృతి అనుకుంటాను.ఇవి కాకుండా క్లబ్బుల్లో ప్రముఖ కళాకారులకార్యక్రమాలు జరిగేవి.నేను వెళ్లక ముందు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి వంటి ప్రసిద్ధుల సంగీత కచేరీలు జరిగాయని విన్నాను.నా ఎరుకలో నేరెళ్ల వేణుమాధవ్ మిమిక్రీ, శోభానాయుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి. హిందీ,తెలుగు కవుల కవి సమ్మేళనాలు, ఉర్దూ ముషాయిరాలు,భూలే బిస్రే గీత్ వంటిఆర్కెస్ట్రాలు బయటినుండి వచ్చేవారివి జరిగేవి.ఇవి కాక స్థానికుల నాటికలు,నృత్య ప్రదర్శనలు ,పాటల పోటీలు జరిగేవి. స్థావరంగా అప్పుడు లలిత కళా సమితి,ఫ్రెండ్స్ క్లబ్,కళా భారతి,నటరాజ కళా సమితి,శారద నాట్య కళాంజలి,శ్రీనివాస కళాసమితి,గాంధర్వ నికేతన్, అగ్రగామి (బెంగాలి),కేరళ సమాజం (మలయాళీ), తమిళ సంఘం (అరవం), మహారాష్ట్ర మిత్రమండల్ (మరాఠీ) ఇలా అనేక సమాజాలు ఎప్పుడూ ఏవో కార్యక్రమాలు తలపెడుతూనే ఉండే వాళ్లు.దీనికి తోడు గ్రూపుల వారీగా పిక్నిక్ ప్రోగ్రామ్ లు పెద్దవాగు దగ్గరికో ప్లాంటేషన్ ఏరియాకో వేసుకునే వాళ్లు.తరువాతి కాలంలో గణేశ నవరాత్రులు బాగా పుంజుకున్నాయి.ఏతావాతా చెప్పేదేమిటంటే జీవితాలు వినోద ప్రధానంగా సాగేవి,
August 2, 2020 • T. VEDANTA SURY • Memories