ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్ సిల్క్ సరిగమలు- రామ్మోహన్ రావు తుమ్మూరి -ఏదైనా దూరమైనప్పుడే దాని విలువ తెలిసేది,మమకారం పెరిగేది అనేది జీవన సత్యం. కాగజ్ నగర్ లో ఉన్నప్పుడు ఈ ఆలోచన రాలేదు కానీ ఇప్పుడు తలచుకుంటేమాత్రం అక్షరాలా నిజమనిపిస్తుంది.విశ్లేషణ అవసరం కళలకు కాదు జీవితాలకు కూడా అనిపిస్తుంది.1974 లో కాగజ్ నగర్ వెళ్లాను.2014 లో హైదరాబాదు వచ్చాను.అంటే నలభయ్యేళ్ళ జీవితం ఆ పట్టణంతో ముడిపడి ఉంది.అదీ అత్యంత ప్రధానమైన ఉద్యోగ పర్వం.దానితో పాటు వైవాహిక గార్హ్యస్థ జీవితం.ఒకవైపు ఉద్యోగ బాధ్యత,మరో వైపు ఇల్లూ,ఇల్లాలు,పిల్లలూ,అమ్మా ,బాపూ ,కుటుంబం సమస్యలు, పరిష్కారాలు.ఇవి రెండూ కాక మరో దిక్కు కళాత్మక ప్రవృత్తి.ముప్పేటలా సాగిన ఆ కాలాన్ని విశ్లేషిస్తే లేదా పరామర్శిస్తే నా ఒక్కడిదే కాదు కాగజ్ నగర్ మొత్తానిదే ఆ సంస్కృతి అనిపిస్తుంది.గతంలో చెప్పాను కాగజ్ నగర్ అంటేనే మినీ ఇండియా అనీ.అది సబబే కావచ్చు.ఎందుకంటే దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఆ పట్టణంలో ఉన్నారు గనక.ఇప్పుడు ఓ అయిదారు సార్లు అమెరికా వెళ్లి వచ్చిన తరువాత అనిపిస్తుంది కాగజ్ నగర్ ను మినీ అమెరికా అని కూడా ఆనవచ్చు అని.అంటే నేను చెప్పే విషయంముప్పయ్యేళ్లనాటి కాగజ్ నగర్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే.అదెట్లా అంటారా? అమెరికాలో నేను గమనించిందేమిటో ముందు తెలియ చెప్పి ఆ పై కాగజ్ నగర్ దగ్గరికి వస్తాను.కేవలం అయిదారువందల ఏళ్ల చరిత్ర మాత్రమే కలిగిన ఉపఖండం.ఇండియాను వెదకడానిక బయలు దేరి అమెరికా ఖండానికి చేరి అదే ఇండియా అనుకొని అక్కడి స్థానికులైన అమెరికన్ ఆటవికులనురెడ్ ఇండియన్స్ అని పిలిచారంటారు.అది నిజమో అబద్ధమో తరువాత సంగతి కానిఆ తరువాత అక్కరకు వలసలు వెళ్లిన బ్రిటిష్ వాళ్లు,ఫ్రెంచి వాళ్లు కాలొనీలు ఏర్పాటు చేసుకుని తమ సాంస్కృతిక జీవనాన్ని అభివృద్ధి చేసుకోవటం జరిగింది.ఆ తరువాత ఇతర దేశాల వారు కూడా మెల్లమెల్లగా అక్కడికి వలసదారుల పట్టారు.గత శతాబ్ది పూర్వార్థంలో కంటే ఉత్తరార్థంలో ఇండియా నుండి అమెరికా వలసలు పెరిగాయి.ఇక గడచిన ఇరవై ఏళ్లనుండి ఇంటికొక్కరన్నట్లుగా ఆమెరికా వెళ్లడం చరిత్ర కిందికి వస్తుంది.నేను చెప్పదలచుకొన్నది సంస్కృతి పరమైన అంశం.ప్రారంభంలో చెప్పినట్లుగా ఇక్కడినుంచి అక్కడి వెళ్లిన వారికి కొద్ది కాలం కాగానే సాంస్కృతిగ బెంగ మొదలయ్యి గుళ్లూ గోపురాలూ,వంటలూ తిండ్లూ,ఆచారాలు వ్యవహారాలు,విందులో వినోదాలు ఇలా ఒకటొకటి అక్కడ పునఃప్రతిష్ఠించుకునే ప్రయత్నాలను నేను గమనించాను.అదే కాగజ్ నగర్ లోనూ జరిగింది.అమెరికాలో దేశీయ సంస్కృతులైతే కాగజ్ నగర్ లో రాష్ట్రీయ సంస్కృతులు.అంతే తేడా.బెంగాలీలు వచ్చారు వాళ్ల కాళీపూజా పద్ధతులను దసరా ఉత్సవాల్లో ప్రవేశ పెట్టారు.మహారాష్ట్రీయులు గణేశఉత్సవాలను దిగుమతి చేశారు.ఔత్తరాహులు రాంలీలాను ప్రవేశపెట్టారు.ముస్లిములు ముషాయిరాలను ప్రోత్సహించారు. ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వారు రామ నవమి ఉత్సవాలు నాటకాలకు ప్రాధాన్యత కల్పించారు.ఇంకా సిక్కుల గురుద్వారాలు కన్నడిగుల రాఘవేంద్ర దేవాలయాలు.తమిళుల శక్తి కోవెలలూక్రైస్తవుల చర్చి కార్యకలాపాలు గమనిస్తే సకల భారత సర్వమత సాంద్ర సాంస్కృతిక ప్రదేశం గా కాగజ్ నగర్ కనిపిస్తుంది.ప్రస్తుతం అమెరికాను చూస్తే కూడా నాకలానే అనిపించింది(సశేషం)
August 3, 2020 • T. VEDANTA SURY • Memories