ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్ సిల్క్ సరిగమలు- రామ్మోహన్ రావు తుమ్మూరి -కొందరి మాటలు జీవితంలో చెరగని ముద్ర వేస్తాయి.తులసి సత్యనారాయణ సారు ఏదైనా ఖర్చు గురించిన సమస్య వస్తే తక్కువ ఖర్చుతోనే చాలా ఘనం అనిపించేలా చేయవచ్చు అనే దృష్టితోదమ్డీ మే లాల్ లాల్ అనే వారు.పూర్వ కాలంలో దమ్మిడీ అనేది చిన్న నాణెం.దమ్మిడీ పెట్టి గులాల్ (కుంకుమ)కొంటే వాతావరణమంతా ఎఱ్ఱగాఉత్సాహ భరితంగా ఉంటుందని దీని ఉద్దేశం.ఇంతకీ ఇప్పుడీ మాట ఎందుకు గుర్తు వచ్చిందనే సందేహం మీకు రావడం సహజం.సారు మాట ఎందుకు గుర్తుకు వచ్చిందంటే లకస లో మాయల ఫకీరు వేసామని చెప్పాను గదా!ఒక ప్రదర్శన చేయాలంటే ఎంతో కొంత ఖర్చవుతుంది.ఆ ఖర్చు ఎవరు భరించాలి.మా అందరివి అత్తెసరు జీతాలు.వాటికి తోడు మా వెనుక అనేక బాధ్యతలు.మేము సమయదానం మాత్రమే చేయగలిగే పరిస్థితి.మాయల ఫకీరు వెయ్యాలంటే హంగు ఆర్భాటముకావాలి.అన్నిటి కంటే ముఖ్యం మాయల ఫకీరు డ్రస్సు.డ్రస్సు లేకుండా ఏకపాత్ర రక్తి కట్టడమెలా!డ్రస్సు కుట్టించాలంటే బోలెడంత ఖర్చవుతుంది.అప్పుడు కాగజ్ నగర్ ఫేమస్ మాయల ఫకీరు మస్తాన్ రావు గారి గురించి.వారి వద్ద మాయల ఫకీరు డ్రస్సు ఉంది.ఉంది కాదు ఆయన స్వంతంగా కుట్టించుకున్నారు.తరచూ రామ నవమి ఉత్సవాల్లో ఓ రోజు మస్తాన్ రావుగారి మాయల ఫకీరు ప్రదర్శన ఉండ వలసిందే.ఆయన హోటల్ ఎంత ఫేమసో ఆయన మాయల ఫకీర్ నేనో యాక్షన్ అంత ఫేమస్.మా సర్సిల్క్ కాలనీలో నాటకాలకు ఆదరణ కలిగించిన ముఖ్యులలో వారొకరు. వారికి సర్ సిల్క్ రాం మందిర్ ఎదురుగాఒక హోటలుండేది.అలాగే రాజీవ్ చౌక్ దగ్గర కూడా ఉండేది.ఆ కాలంలో మస్తాన్ రావు హోటల్ అంటే చాలా ఫేమస్ హోటల్.సర్సిల్క్ కాలనీలో ఉండే హోటలు విశాలమైన ప్రాంగణంలో ఉండేది.ఓ పెంకుటిల్లు దాని ముందు పెద్ద పందిరి.అది హోటల్ అనే కంటే ఓ పెద్ద మాటల కచేరి.ఎప్పుడూ డ్యూటీ ఎక్కీ దిగే కంపెనీఉద్యోగులతో కళకళ లాడుతూ రసవత్తర మైన లోకాభిరామాయణలతో పెద్ద ఆకర్షణ కేంద్రంగా ఉండేది.అన్ని విషయాలు అక్కడ చర్చలకు వచ్చేవి.కంపెనీ రాజకీయపు మొదలు దేశ రాజకీయాలదాకా,వీథి నాటకాల నుండి సినిమాల దాకా .మస్తాన్ రావు గారి హోటల్ సర్సిల్క్ ఉద్యోగుల మనస్సుల్లో మరువ లేని ప్రదేశం.సరే డ్రస్సు కోసం వారి వద్దకు వెళ్లటం.ఎంతో సంతోషంగా ఇచ్చారు.అలా ఖర్చు లేకుండానే మాయల ఫకీరు డ్రస్సు సంపాదించామని చెప్పడానికి దమ్డీ మే లాల్ లాల్ గుర్తుకు వచ్చింది.అలాగే నేను మట్టితో కపాలం తయారు చేసానుమా హాస్టల్ రూములో.అలాగే వెదురు బొంగులతో ఎముకలు తయారు చేసి వాటన్నిటకీ సున్నం వేసి అచ్చం ఎముకలు పుర్రె అనిపించేలా చేశాను..ఇదంతా మా గురువు గారి శిక్షణలో మా టీం వర్క్.ఆయన వేషం వేస్తే నేనివన్నీ ఎందుకు చెయ్యాలి అని ఎవ్వరూ ఏనాడు అనుకోలేదన సరికదా ఎంతో ఇష్టంగా చేసాం.అది ఈనాడు చాలా కొరవడిందనే చెప్పాలి.కలిసి మెలిసి పని చేసి పొందే ఆనందం మీరు ఎన్ని డబ్బులు పోయినా దొరకదు.ఇది నా స్వానుభవం.(సశేషం)
August 10, 2020 • T. VEDANTA SURY • Memories