ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్ సిల్క్ సరిగమలు- రామ్మోహన్ రావు తుమ్మూరి -నేను సర్ సిల్క్ మిల్లులో చేరడానికి ముఖ్యకారకులు నాగరాజు రామస్వామి గారు.వారప్పుడు మిల్లులో ఎలక్ట్రికల్ డిపార్టుమెంటు ఇంఛార్జ్ గా పనిచేసే వారు. మా మిల్లు పరిభాషలో ఇంఛార్జ్ అంటే అందరి పై అధికారి అని అర్థం.1973 లో నేను డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. అప్పుడెందుకో ఉపాధ్యాయ వృత్తి చేయాలని ఉండేది కాదు.మా బాపుకేమో నేను టీచరు కావాలని కోరిక.నాకు మాత్రం ఏదైనా ఆఫీసులో గుమాస్తా గా చేయాలని.ఏదీ తెలిసిన ఆలోచన కాదు.ఇరవై ఏళ్లవాడినైనా చూడటానికి పదహారు కూడా దాటలేదన్నట్టుండేవాడిని. మనసూ కూడా అంతే.ఇప్పటికీ కూడానేమో వయసు పెరిగినంతగా మనసు పెరగలేదనే సందేహం నాకు మాత్రం ఉంది.అసలు విషయానికి వస్తే రామ స్వామి గారిది మా ఊరే.నాళ్ల నాన్నగారుప్రముఖ ఆయుర్వేద వైద్యులు. తిరుమ లయ్యగారంటే అప్పట్లో చుట్టుముట్టు చాలా గ్రామాల వారికి ఆయన పేరు కలిగిన వైద్యులు.ముఖ్యంగా నయం కాని మొండి జబ్బుల్ని నయం చేసేవారు.వారి హస్తవాసి గురించి మొన్న పదిహేనురోజుల క్రిందటి విషయం చెబితే మీరు ఆశ్చర్యపోతారు.తమ్ముడి కూతురు పెళ్లి సంబంధం విషయంలో మొన్న మెదక్ జిల్లా శివంపేటకు వెళ్లాను.మాటల సందర్భంలో మా స్వగ్రామం ఎలగందుల అని చెప్పాను.అప్పుడు ఆ పరివారంలో ఒకామె తిరుమలయ్య గారిని గుర్తు చేసుకున్నారు.మీకు తెలుసా అని అడిగారు.తెలియక పోవడమేమిటి వారు బాగా తెలుసు అన్నాను.ఆవిడ చిన్నప్పుడు ఆయన దగ్గర వైద్యం చేయించుకున్నా రట వేములవాడ నుండి వచ్చి.ఏభై ఏళ్ల క్రిందటి విషయం ఆమె గుర్తు పెట్టుకుని వారిని స్మరించు కున్నారంటే వారెంత గొప్ప వైద్యులో ఆలోచించండి.ఆయన మా బాపు మంతి స్నేహితులు కావడంతో నేను నిరుద్యోగి గా ఉన్న సంగతి రామస్వామి గారికి తండ్రిగారి ద్వారా తెలిసింది.నేను B.Sc.M.P.C. కనుక నాకు అప్లై చేసు కుంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉందనితెలిసింది.అలా అప్లికేషను పంపించ టం, ఇంటర్వ్యూకి పిలుపు రావటం, ఆ తర్వాత కొన్ని రేజులకు ఉద్యోగంలో చేరటం జరిగింది.ఓ ఏడాది తరువాత ఆయన నైజీరియా వెళ్లిపోయారు. నేనక్కడే స్థిరపడి పోయాను.అట్లా ఇట్లా కాదు నలభై సంవత్సరాలు కాగజ్ నగర్తో మమేకమై పోయాను.నా జీవితంలో అతి పెద్ద మలుపు కాగజ్ నగర్ వెళ్లటం.ఆ ఊరు నా సర్వ శక్తులను ఉత్తేజపరచినన్ను తీర్చి దిద్దిన ఊరు.నేను 1974 జూలై 7 న సర్సిల్క్ లో జాయినయ్యాను.అప్పటి నుండి 2014 దాకా అక్కడే ఉన్నట్టు లెక్క.ఖచ్చితంగా నాలుగు దశాబ్దాల పాటు అక్కడ ఉండటంజరిగింది.ఇరవై ఒకటి లో వెళ్లాను.అరవై ఒకటిలో వచ్చాను అక్కడినుండి.నా జీవితం లో అతి ముఖ్యమైన విషయాలన్నీ ఆ నగరంతో ముడి వేసుకుని ఉన్నాయి.ఇక్కడ నా వ్యక్తిగతమైనవి చెప్పాలని కాకపోయినాకొన్ని విషయాలు ముడిపడి ఉంటాయి.అవసరమైనంత మేరకువైయక్తికమైన వాటిని చెబుతూ ఒక విలక్షణ నగర చరిత్రను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.(సశేషం)
July 31, 2020 • T. VEDANTA SURY • Memories