ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్ సిల్క్ సరిగమలు- రామ్మోహన్ రావు తుమ్మూరి --మహావీర పురుషోత్తమ తరువాతనో ముందో లకస హాల్లో సందర్భం గుర్తు రావటం లేదు గానీ యం.యల్.యన్. రావు గారితో మాయల ఫకీరు ఏకపాత్ర వేయించారు.అప్పుడు తెలిసింది వారి దర్శకత్వ ప్రతిభ.ముందుగా ఆ పాత్రోచిత భాషణ.మాయలఫకీరు మాట్లాడే మాటలు ఇటు సంస్కృతం అటు ఉరుదూ మరియు తెలుగు కలిసి గమ్మత్తుగా ఉంటాయి. ఒక మాంత్రికుడికిఎలాంటి మాటలుంటే ప్రేక్షకులకు గగుర్పాటు కలుగుతుందో బాలనాగమ్మ నాటకం రాసిన విద్వాన్ కణ్వశ్రీ గారికి బాగా తెలుసు.నాటకంలో తొలి అంకమే ఫకీరు రాతి గుహ.ఆ గుహకు అడ్డంగా ఓ రాతి దర్వాజా ఉంటుంది.అది తొలగాలంటే“ఆల్ రసూలల్లా కమీ కసూలల్లా పత్థర్ కీ దర్వాజా ఖోలో “ అని అనగానే అది కిర్రుమనే శబ్దంతో తెరుచుకుంటుంది.అపుడు ఉరుము ఉరిమినట్లుగా ‘ఏయ్ కాపాలీ ‘అనే అరుపు పిల్లలు కాదు పెద్దలే దడుచుకునేటట్లు చెప్పించటం తోనే ఇక ప్రేక్షకులు తమను తాము మరచిపోయి ఏం జరుగబోతుం దోననే ఉత్కంఠలో పడిపోతారు.అప్పుడొక వికటాట్టహాసం.నా జీవితంలో మొదటి సారి అలాంటి తెరలు తెరలుగా శరీరంలోని శక్తి అంతా నోటినావహించి నట్లు అలా నవ్వటం చూపించి మా ఎమ్మెలెన్ తో ప్రాక్టీసు చేయించినప్పుడు తెలిసింది నాటకం అంటే ఏమిటో.ఏదో నాలుగు డైలాగులు బట్టీ పట్టి అప్పజెప్పడం కాదని.అలా నవ్వుతున్నప్పుడు ఎలా భృకుటి ముడవాలో,కళ్లల్లో భీభత్సం కనిపించాలో ఒక్కో అడుగు మన గుండె మీద వేసినట్టు అనిపించే విధంగా వెనుక వస్తున్న నేపథ్య సంగీత శబ్దాలకు అనుగుణంగా పడాలో ఆయన నేర్పిస్తుం టే మేం అవాక్కయిపోయే వాళ్లంకాపాలిగా బాలకృష్ణ ను ఓ మూలకు ఓ బొమ్మ వెనుక కూర్చో పెట్టారు.ఫకీరు ప్రశ్నలకు బేస్ వాయిస్లో దీర్ఘాలు తీస్తూ అవునూ అంటూ గంభీరంగా చెప్పిస్తూవాతావరణం మార్చడానికి ఆయన ఎన్ని శ్రద్ధలు తీసుకున్నారో అలోచిస్తుంటే నాటకం కూడా ఓ తపస్సుగా భావించే వాళ్లుంటారనిపిస్తుంది.ఒకవైపు ఆయన డైలాగుల తర్ఫీదు ఏయ్ మహాకాళీ!అఖండ జ్వాలా ప్రజ్వల కరాళ దంష్ట్రినీ!మర్త్య మస్తిష్క భక్షిణీ!ధ్వాంతోదాంత ప్రళయాంతక ధూమధూమకర ఝంఝామారుత ప్రయాణీ!శిలోచ్చయ భిన్న దంభోళీ!సదృశ్య నఖశ్రేణీ!విరూపాకారిణీ!రోదసీ కుహర వక్త్రినీ!మాంత్రిక సామ్రాజ్యార్చా నంద స్వరూపిణీ రక్షమాం రక్ష !హహ్హహ్హహ్హ అని పిడుగులు పడ్డట్టు నవ్వు.మామూలుగా చదవాలంటేనే కష్టమనిపించే పై మాటలు ఉచ్చరించటానికి ఎంత కష్టమో ఊహించండి.ఇక రంగ స్థలం అలంకరణ.కాళీమాత బొమ్మ ఉగ్రంగా కనిపించే విధంగా ఎర్ర రంగు ఫ్లడ్ లైన్లుమరో వైపు సాంబ్రాణి వేసినప్పుడల్లా గుప్పుగుప్పుమని పొగ వచ్చే విధంగా నిప్పుల కుంపటి.మరో వైపు వేలాడే కపాలాలు,తీగపై నర్తించే ఎముకలు దానికి తోడు స్టేజి ముందువైపు నేను లక్షమణాచార్యులు సైడు కర్టెన్ లవెనుక ఉండి కిరోసిన్ సీసాలు అగ్గి పెట్టెలు ప్రక్కన పెట్టుకునిబుగ్గలు నిండా కిరోసిన్ నింపుకుని అగ్గిపుల్ల గీచి ఆ అగ్గిపుల్ల మీద నోట్లోని కిరోసిన్ ఊస్తూ స్టేజి మీద మంటలు వచ్చేట్లు చేయటం ఇక మీకు చెప్పక్కర్లేదు ఆ ఏకపాత్ర ఎంత గొప్పగా ప్రదర్శించ బడిందో హాట్సాఫ్ గురువుగారూ.ఆయన మనసెరిగి ఫకీరు పాత్రలో జీవించిన ఎమ్మెలెన్ కు అభినందనలు.ప్రస్తుతం ఆయన మియాపూర్ లో ఉంటున్నారు. మిగతా ముచ్చట్లు తరువాత.(సశేషం)
August 8, 2020 • T. VEDANTA SURY • Memories