ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్ సిల్క్ సరిగమలు- రామ్మోహన్ రావు తుమ్మూరి
October 1, 2020 • T. VEDANTA SURY • Memories

ఇక్కడో విషయం చెప్పాలి.చిన్నప్పటినుంచి మా ఇంట్లో హార్మోనియం తబలా ఉండేవి.గుళ్లో భజనలు జరిగినప్పుడు వాటిని బయటకు తీసేవారు.భజనలకు తగ్గట్టుగా వాయించేవారు ఒకళ్లిద్దరు ఉండేవారు.కాని వారు సంగీతం తెలిసిన వారు కాదు.ఏదో అభ్యాసం కూసు విద్య అన్నట్లు కొన్ని పల్లవులు వాయించటం తెలుసు వాళ్లకు.నిజం చెప్పాలంటే ఆ వయసులో సంగీతం ఒక విద్య అనీ సరిగమపదని అనే సప్తస్వరాలుంటాయనీ,రాగాలుంటాయనీ,వాటికి పేర్లుంటాయనీ అదో మహా సముద్రమనీ ఏమీ తెలియదు.కానీ ఏదో తెలియని ఆసక్తి మాత్రం ఉండేది.మా బాపు ఫ్లూట్ మీద ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న వంటివి ఎప్పుడైన సరదాగా వాయించే వారు.ఆయనకు కొంత వరకు అవగాహన ఉంది కాని ఎంతవరకనేది నాకు తెలియదు.ఎందుకంటే నాకు సంగీతం అంటే ఇలా ఉంటుందని తెలుసుకునే సమయానికి ఆయనకు దూరంగా (ఉద్యోగరీత్యా)ఉండవలసి రావడం కారణం.కాకపోతే స్కూల్లో జానపద గేయాల మీద నృత్యాలు చేయించేవారు,దశావతారాల వంటి నృత్యరూపకాలు,బుర్రకథలు వంటివి పిల్లలతో చేయించటం గుర్తు.ఒకే ఒక్కసారి గుళ్లో భక్త కుచేల హరికథ చెప్పటం మాత్రం మరచి పోలేని విషయం.’వినుడి భక్తులారా నా మనవి వీనులారా’, 
‘బులుసు వారి చిన్నబ్బాయి పిలవ వచ్చినాడు చూడె
పలకా పొత్తములనిమ్ము బడికి పోయి చదువుకుంత
అమ్మా బువ్వ పెట్టవే ‘
అని చిన్ని కృష్ణుడి బాల్యపు చేష్టల కీర్తన ఆయన ఇంటి వద్ద చిరుతల మీద అభ్యాసం చేయటం నాకు బాగా గుర్తు.
ఆ వాక్యాలు ఇప్పటికీ అలాగే స్మృతి పథంలో ఉన్నాయి.భోగం వాళ్లింట్లో ఎవరికో కొంత సంగీతం తెలుసనీ, చిన్నప్పుడు అక్కయ్యకు నేర్పించాలనీ 
ఏదో ప్రయత్నం చేశారు కానీ,అదేదీ జరుగలేదు,మా కాక బాగా పాడేవారు.అప్పట్లో సినిమా పాటలు ఆయన అప్పుడప్పుడూ పాడటం తెలుసు.తరచుగా చల్లని రాజా ఓ చందమామా ఆయన పెదవులపై ఆడేది.
రామాయణంలో పిడకల వేటలాగా రామాచార్యుల గురించి చెబుతూ ఇదంతా ఎందుకని మీకు అనుమానం కలగకపోదు.నేను కాగజ్ నగర్ వెళ్లిన కొద్ది రోజులకే రంగనాథ్ గారు సంగీతం నేర్పిస్తారనీ,వోకల్ మరియు హార్మోనియం నేర్చుకోవాలనీ అనుకోవడానికి నేపథ్యం
అంత ఉంది అని చెప్పడానికి.
   వాళ్లింటికి వెళ్లినప్పుడు నన్ను పరీక్షించడానికి ఓ పాటపాడమన్నారు. అప్పుడు నేను ఘంటసాల పాటలు కూనిరాగాలు తీసేవాణ్ని.సరే,ఏదో నాకు వచ్చిన రీతిలో సిగ్గు పడుకుంటూ ఘనాఘన సుందరా కరుణా రసమందిరా పాడాను.ఒకటిన్నర శ్రుతి అన్నది మాత్రం గుర్తుంది.ఇంతకీ చెప్పొచ్చే దేమంటే నాకు సా పా సా లు
రంగనాథ్ గారు చెప్పినా అభ్యాసం మాత్రం వారి అక్కగారు రామసీతమ్మ గారు (రామాచారి గారి తల్లి) చేయించే వారు.ఓ రెండు మూడు నెలలు వెళ్లాను.అది నాకు సరిపడేది కాదని తెలిసిపోయింది.దానికి తోడు అంతకంటే ఎక్కువ మక్కువ గలిగిన నాటకరంగం వైపు దృష్టి మళ్లడంతో సంగీతానికి స్వస్తి చెప్పాను.కాని తరువాతి కాలంలో వారి సాన్నిహిత్యంలో
సంగీతానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోగలిగాను.రంగనాథ్ గారు స్వరపరచిన పాటలకు శ్రోతగా ఉన్నాను.
అదిగో అప్పుడే రామాచారి గారితో పరిచయం ఏర్పడింది.రామాచారి గారికి  సినీసంగీతం మీద ఆసక్తి ఉండటంతో ఆయన కొందరు యువగాయకులను వాయిద్యకారులను కూడదీసుకుని ట్వింకిల్ స్టార్ అసోసియేషన్ పేరు మీద పెండాల్స్ లో ఆర్కెస్ట్రా ప్రోగ్రాములిస్తుండే వారు.అందులో బాలప్రభాకర్, దామోదర్ మొదలైన వాళ్లుండేవారు.
అప్పటికి ఆయన నివాసం శిశుమందిర్ హై స్కూల్ కాంపౌండ్ లోని మేనమామ గారింట్లోనే.పెళ్లయిన తరువాత బాలవిద్యామందిర్ ఆవరణలోని క్వార్టర్ కు మారారు.అక్కడికి వెళ్లిన తరువాత 
వారి తండ్రిగారు నడిపిన గాంధర్వని కేతన్ ను కాగజ్ నగర్ లోస్థాపించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ డం ప్రారంభించారు.
   ట్వింకిల్ స్టార్ అసోసియేషన్ ఉన్నప్పుడు నన్ను ఆహ్వానించటం నేను చేరటం ఓ నాటిక వేయటం కూడా జరిగింది.కానీ ఈ లోపు నేను లలిత కళా సమితి లో చేరటంతో కొంత కాలం పాటు 
అటు వైపు వెళ్ల లేదు.ఓ పదేళ్ల తరువాత లలిత కళా సమితి కొన్ని కారణాలవల్ల వెనుకబడటంతో మళ్లీ రామాచార్యులు గారితో సహవాసం పెరిగింది.అటు లకస నామ మాత్ర సభ్యత్వంతో ఇటు గాంధర్వ నికేతన్ లో చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.అప్పట్లో కాగజ్ నగర్ లో ఉగాది ,సంక్రాంతి కవి సమ్మేళనాలు ఉండేవి కాదు.అది ప్రారంభించిన వారు రామాచార్యులు గారు.తెలుగు సాహితీ సదస్సు ఏర్పడటానిక ఒక రకంగా ప్రేరణ ఆయనదే.
గాంధర్వ నికేతన్ ఒకవైపు సంగీత శిక్షణ మరో వైపు సంగీత,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేది.పిల్లలతో నృత్య కార్యక్రమాలు, యువకులతో నాటికలు,వనభోజనాలు,గాయనీ గాయకులతో పాటల కచేరీలు జరుగుతూ ఉండేవి.దీనికి తోడు కల్లోల్ భట్టాచారిగారిన ఒప్పించి హిందూస్తానీ సంగీత శిక్షణ ఇప్పించి పలూస్కర్ భాత్కండే జయంతుల సందర్భంగా ఉత్లవాలు జరిపి హిందుస్తానీ గాయన కచేరీలు ఏర్పాటు చేసేవారు.వారి ప్రతి కార్యక్రమానికి నన్ను వ్యాఖ్యాతగా ఉంచేవారు.అలా నాకు మంచి వ్యాఖ్యాత అని పేరు రావడానికి ప్రేరణ కలిగించిన వారు రామాచారి గారు.పాటలు పాడకపోయినా పాటపాడే వారిని సభకు పరిచయం చేయటానిక నాకున్న చిరు పాటల పరిచయం ఉపయోగపడటం నాకంతే చాలునని నేను తృప్తి పడటం జరిగింది.
ఇద్దరు శేషగిరి రావులు,కంకటి శంకరరావు,కొమ్మెర రాజేశ్వరరావు, విశ్వేశ్వరరావు,జ్ఞానేశ్వర్, దేశ్పాండే మొదలైన వారు సభ్యులుగ ఉండేవారు.