ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సాహిత్యసుమాలు: --- యామిజాల జగదీశ్
November 22, 2020 • T. VEDANTA SURY • Book Review

పోగొట్టుకున్నదేదో మరొక రూపంలో దొరికితీరుతుందన్నది నిజం. ఏదైనా కావచ్చు. ఎలాగైనా దొరుకుతుంది. నిజం.
నాకలాంటిదే చలంగారి సాహిత్యసుమాల ఆణిముత్యాలు. 

వజీర్ రహ్మాన్ గారు చలంగారి వచనసాహిత్యంలోని మాటలనే కవితలై "కవిగా చలం" రూపంలో పాఠకలోకానికందిస్తే చందర్ గారు చలంగారి సాహిత్యంలోంచి సూక్తులనుకున్న వాటిని సేకరించి సమర్పించిన కుసుమాలే సాహిత్య సుమాల పుస్తకం. 

చందర్ గారు 1968 ప్రాంతంలో సంకలనపరచిన మాటల మూటలు మొదటిసారి 1974లో అచ్చయి అలరించింది. ఇక రెండవసారి 1994లో ముద్రితమైంది. ఈ రెండుసార్లూ అచ్చయిన సాహిత్యసుమాలు అందుబాటులో లేకుండాపోయిన వాటిని ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు చలం ఫౌండేషన్ వారు మళ్ళీ అందంగా అచ్చుతప్పుల్లేకుండా విడుదల చేశారు. 

నిజానికి నా దగ్గర మొదటి ఎడిషన్ ప్రతి ఒకటి ఉండాలి. అది ఎలా మిస్సయుందో మిస్సయింది. ఇక రెండోసారి అరుణా పబ్లికేషన్స్ వారు వేసింది కొన్నాను. కానీ అదీ మిస్సయింది. ఇప్పుడు అనుకోకుండా ఈ పుస్తకం కొన్నాను. 

ఇందులోని సూక్తులను నేను చాలాసార్లు నేను ఎవరికైనా రాసే ఉత్తరాలలో ప్రస్తావిస్తూ ఉండేవాడిని. 

చలంగారు ఈ సాహిత్యసుమాలపై ఇలా చెప్పుకున్నారు ....

"బి.వి. నరసింహారావుగారికి, 
చలం సూక్తులు చదివి యెంత పొంగిపోతున్నారో మీరు. ఆ సూక్తుల్ని మొదట చదివినప్పుడు నేను యిట్లాంటివి రాయగలిగిన మనిషి నిజంగా పుట్టాడా రాశాడా వున్నాడా అనిపించింది. 

ఎవరికివారు తప్ప సబ్జెక్ట్ మీదనే కాని యింత రేంజ్ భూమి నుంచి ఆకాశం వరకు కవర్ చేశారా ? ఎవరో రాసి వీటిని నేను చదివితే ఎవరు! ఎవరు! అని వెతికివుండనా? వెతికి ఈ జనన మరణ హృదయ రహస్యాన్ని నాకు విశదం చేయమని ఆయన ముందు ఠూలబడి వుండనా? అనుకున్నాను. 

కాని యివి చలం రాయలేదు. అతనిలోని hidden higher self రాశాడు. అతనితో చలానికి యెప్పుడో కాని సంబంధం తక్కువ"

1031 సాహిత్యసుమాలతో కూడిన ఈ పుస్తకంలో ప్రతిదీ ఆలోచనలో పడేసేదే. 

సారస్వతం, కళ, జీవితం, ఆశయం, సంస్కరణ, స్త్రీ, ప్రేమ, సంఘం, లోకం, మనిషి, ఆధ్యాత్మికం, రాజకీయం, తన గురించి తాను, అనేకం....ఇట్లా వివిధ అంశాలపై ఉన్న మాటలం చదువుతుంటే ఎంత హాయిగా ఉందో మనసుకి.

చలంగారి కొన్ని మాటలు....

ప్రేమే ఇంక లోకానికంత ఏకైక ఆదర్శమా అంటే? ఆ ప్రేమని దాని కన్న ఉన్నతమైన దానికి సాధన చేసుకోక అధమమైన ధన కీర్తి చౌర్య అధికారాలకి అమ్ముకుంటున్నారని నా తగాదా...(ప్రేమలేఖలు, 1921 - 27).

నేను చేసిన పనులు 
నేను రాసిన రాతలు అన్నీ ప్రజా సంస్కరణ కోసం కాదు. నన్ను నేను సంస్కరించుకోడానికి అంటారు తమ ఆత్మకథా రచనలో (1972 - 73).

"మ్యూజింగ్స్"లో ఓ చోట అంటారిలా....

మనిషి స్వభావంలోకి ఉత్తమమైనది అతని అంతరాత్మ. దానిని నీచపరుచుకున్నందుకే మానవుడు ఇంత ఫహపతితుడైనాడు. శాంతి ఆనందాలకి దూరమైనాడు.

"చలం కొట్టిన దెబ్బలు గుర్తు గాని
దేశానికి, చలం పాడిన పాటలు కావు" అని చలం అంటే "ఆ పాటల్ని గుర్తు చెయ్యడమే ఈ ప్రయత్నం" అన్న వై. చందర్ గారు సేకరించి ఇచ్చిన ఈ సూక్తులు నాకెప్పుడూ ప్రియమైనవే.