ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సిరికోన శతక సంకలనములో నా వంతు పద్యాలు (వృక్ష శతకము):- రామ్మోహన్ రావు తుమ్మూరి
October 12, 2020 • T. VEDANTA SURY • Poem

1

దక్షతతో బహుళములగు

వృక్షములను బెంచి మిగుల వృద్ధి యొనర్పన్

రక్షణయగు పరిసరముల

కక్షయయారోగ్యమొదవు గద సిరికోనా!

2

తిండికి చెట్టులె కావలె

నుండుటకును వలయు కలప యురుతరవిధముల్

పండెడు మంచము కఱ్ఱదె

బండెడు కట్టెలును చితికి భళి సిరికోనా

3

అడవులు విరివిగ నుండిన

పడునెక్కువ వర్షమనెడు ప్రహతము వినరే

ఎడనెడ ఎక్కడి కక్కడ 

కడు తరువులు నాట కలిమి గద సిరికోనా!

4

సహజమగు ఎరువు వేయుచు

సహనముతో సస్యవృద్ధి చక్కగ జేయన్

కుహనా రోగములుండవు

మహిలో ఆరోగ్య భాగ్య మదె సిరికోనా!

 

5

సిరికోన శతక రచనను

వరకవులందరును గూడి వాసిని నిలుపన్

మెరుపులను బోలు కందపు

సిరులను సృష్టించగలరు శ్రీసిరికోనా!

6

తరతమ భేదములెరుగక

విరిసరముల వంటి విమల విజ్ఞానములన్

పరిపరి విధముల గూర్చుచు

పరిసరముల మార్చగలరు భళి సిరికోనా

7

కరమున కలములు లేవిపు

డిరవుగ ఐ పాడు పైన ఇంపగు స్పర్శన్

మురిపాలు ముద్దులొలుకగ

కురిపింతురు జడుల కవితగొని సిరి కోనా!

8

మును పుట్టెను చెట్టెపుడో

మనకంటెను ముందు గానె మనకొరకు గదా

మనమేమొ దాని నరుకుచు

మనుగడకే హానిజేయమా సిరికోనా

9

తరువొక గురువుగ నిలిచెను

అరయంగా ఆదినుండి ఆదిమ తతికిన్

మరచిరి మనుజుులు పెరిగిన

దురహంకారమ్ము తోడ థూ! సిరికోనా

10

ఫలమిచ్చె పత్రమిచ్చెను

నిలుచుటకై నీడనిచ్చె నీ బ్రతుకునకై

జలమిచ్చు కొరకు తోడ్పడె

నిలిపెను నీబ్రతుకు శ్వాస నిడి సిరికోనా

11

విపినమునందున గనుగొన

జపములు యొనరించు మునుల సంతతి వోలెన్

తపనలు గలిగిన తరువులు

కపటమ్ములు లేక మనును గద సిరికోనా

12

గరికయు గంధపువృక్షము 

అరమరికలు లేక బెరుగు నటవిన గనినన్

తరువుల సంస్కృతి దొడ్డది

ఇరవుగ సహజీవనమున ఇల సిరికోనా

13

నేలయు నీరము నదియే

చేలకు చెట్లకును చూడ చెల్వగురీతిన్

వేలాది వృక్షజాతులు

చాలవె భిన్నత్వకూర్మి సరి సిరికోనా