ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సీతానగరం హైస్కూల్ రీ-ఓపెనింగ్ అయినప్పటి నుండి అంటే జూన్ నెలనుండే పది, ఏడు తరగతులకు స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరిగేవి.ఉపాధ్యాయులంతా విసుగులేకుండా నిర్విరామంగా వారికి కేటాయించిన వేళల్లో పనిచేసేవారు. జిల్లాలో ఏ హైస్కూలులోనూ జూన్ నెల నుండి స్పెషల్ క్లాసులునిర్వహించనిది ఈ హెడ్మాప్టర్ ఇంత త్వరగా ఎందుకు నిర్వహిస్తు న్నారు అనే ఆలోచన చాలామందికి వచ్చి ఉండొచ్చు . నేను ఉద్యోగంలో చేరిన మొదటినుండీ నాకున్న అలవాటు రీ ఓపెనింగ్ రోజు అయిన మొదటి రోజు నుండీ క్లాసులకు వెళ్లడం అలవాటే!ఈవిధంగా నేను వెళ్లడమనేది టెక్కలిలో నా ఫస్ట్ అపాయింట్మెంట్ పాఠశాల నుండి అలవాటు. అక్కడ హెడ్మిష్ట్రెస్ పద్ధతులు అలా ఉండేవి. ఆమె పద్ధతులు పరిపాలనా పరంగా ఏ మొహమాటాలకు పోయేవారుకాదు. ఏ విషయా న్నయినా అలా నిక్కచ్చిగా చెప్పేవారు. ఆ పద్ధతులు అలవాటు పడిన నాకు బలిజిపేట వచ్చేసరికి కొంతమంది ఉపాధ్యాయులలో పూర్తి విరుద్ధమైన ప్రవర్తనలు కనిపించేవి. స్కూలు రీ- ఓపెనింగ్ అయిన రోజు నుంచీ బెల్ కొట్టిన వెంటనే నా తరగతి గదిలో నేనుకూర్చుండే వాడిని. క్లాసులు ఎగవేసిన కొంత మంది మనందరినీ కాదని అతను క్లాసులకు ఎలా వెళ్లిపోతున్నాడో చూడండి చూడండి అంటూ వెనుకన కామెంట్ పాస్ చేసేవారు. నాకు మొదటి నుండీ ఒక అల వాటు ఉంది. నేను ఒకపనిచేయా లనుకున్న ప్పుడు ఒకటికి పలుమార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. కొన్ని సమయాల్లో నా సమస్యకు పరిష్కారం లభించనపుడు ఒకరిద్దరి సలహా తీసుకుంటాను. అలా తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి మంచి ఫలితాలనివ్వొచ్చు లేక చెడుఫలితాల నివ్వొచ్చు. మధ్యలో ఆ పనిని నిలుపుదల చేయడముండదు. ఆ కారణంగా నేను పాఠశాల రీ-ఓపెనింగ్ అయిన ఆరోజునుండే అదే ముహూర్తం అనుకొని నా తరగతి గదికి వెళ్ళడం మంచిదనుకొనేవాడిని. నా వృత్తికి న్యాయం చేస్తున్నానననే భావన కలిగేది. రీఓపెనింగ్ అయిన తరువాత పదిపదిహేను రోజులు క్లాసులకు వెళ్ళీవెళ్ళనట్టుగ నటించడం వారికి సిగ్గు చేటనిపించదేమో ! వారి ప్రవర్తన చూస్తుంటే కొత్త జనరేషన్ ఉపాధ్యాయులు ఎవరొచ్చినా చెడిపోతారనిపిస్తుంది. మనకున్న పీరియడ్స్ ఎగ్గొట్టేసి బయట కూర్చొని వారితో వీరితో బాతాఖానీ కొట్టేబదులు పిల్లలతో కాలం గడపడం మంచిదనిపిస్తుంది. పిల్లలతో సాన్నిహిత్యం మరింత పెంపొందుతుంది. కష్టసుఖాలలో పాలుపంచుకున్నట్టవుతుంది. అదే పిల్లలతో ఒక విధమైన ఇంటిమెసీ ఏర్పడుతుంది. టీచర్ తరగతి గదికి వస్తున్నారంటే ఆ విషయం ఇంట్లో కూర్చుని ఉన్న ‌మిగిలిన పిల్లలకు సమాచారం వెళుతుంది. రెండు, మూడు రోజుల్లో తరగతిగదిలో పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది. అప్పటి నుండి మన పాఠాలు చెప్పడం ప్రారంభించవచ్చు. కానీ కొంతమంది ఉపాధ్యాయులను పరిశీలిస్తే జూన్ రెండవ వారంలో పాఠశాలలను తెరచినట్టయితే జూలై మొదటివారంలో పాఠాలు చెప్పడం ప్రారంభిస్తుంటారు. రమారమి నెలరోజుల కాలం వృధా చేస్తున్నారన్నమాట. డిసెంబర్ నాటికి పదో తరగతి సిలబస్ పూర్తి చేయవలసి ఉంటుందని ఈ విషయాన్ని మన ఉపాధ్యాయ మిత్రులు తెలుసుకోవలసిన అవసరం ఉంది. పాఠశాల జూన్ రెండో వారంలో తెరచినట్టయితే జూలై మొదటి వారం వరకూ కుచ్చటప్పండాలు కొట్టుకొని, కాలాన్ని వృథా చేసి నవంబర్ డిసెంబర్ నెలల్లో సిలబస్ ను ఏదో " మమ" అనిపించేసే బదులు ప్రశాంతంగా, నెమ్మదిగా మొదటి నుండీ బోధపరచుకోవడం, చిన్న చిన్న పరీక్షలు పెట్టడం,ఫలితాలను వెంట వెంటనే తెలియజెప్పడంలో ఉన్న మజా,ఆ సరదా, ఆ ఆనందం, ఆ అనుభూతి, ఇంకా దేంట్లోనురాదు.కొన్నిక్లాసులలో విద్యార్థులు పరిమితికి మించిఉంటారు. అంటే 30, 40కి పైబడి. ఆ సందర్భంలో ఉపాధ్యాయుడు తన తరగతిలోగల చాలా తెలివైన పిల్లలను A గ్రేడ్ విద్యార్థులను పదివరకు ఎంచుకొని వారి పేపర్లను ఎటువంటి తప్పులు లేకుండా దిద్ది, ఈ తెలివైన విద్యార్థులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి B Grade పిల్లలపరీక్షపేపర్లలో గల సమాధానాలను దిద్దించాలి. A, B గ్రేడ్ విద్యార్థులు మిగిలిన గ్రేడ్ విద్యార్థుల సమాధాన పత్రాలను దిద్దించాలి. అలా దిద్దించాలీ అంటే ఉపాధ్యాయుడు పేపర్లు దిద్దబోయే విద్యార్థులకు నిర్ధిష్టమైన సమాచారం అందివ్వాలి. అలా చేస్తే చిన్న చిన్న క్లాస్టెటెస్టుల ఫలితాలు త్వరలోనే ప్రకటించబడతాయి. ఇటు వంటి పరీక్షలు పబ్లిక్ పరీక్షలలో మంచి ఫలితాలు పొందేందుకు దోహదం చేస్తాయి. అలా కాని పక్షంలో పరీక్షా ఫలితాలు గాలికి కొట్టుకు పోవలసిందే ! విద్యార్థులు వ్రాసిన పరీక్షా సెంటర్లో మాస్ కాపీయింగ్ జరిగి మంచి రిజల్ట్స్ వచ్చేస్తే అదంతా మా టీచర్లప్రభావమేనంటూ డప్పుకొట్టుకుంటారు. ఆఫలితాలు డొల్ల ఫలితాలు. అంటే విద్యార్థులలో కనీస స్టాండర్డ్స్ లేని ఫలితాలు. కష్టపడి పని చేయని ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఎక్సప్లనేషన్ ఇవ్వనవసరంలేని పరీక్షా ఫలితాలు.ఇలా పాసైన విద్యార్థులు పై తరగతులలో పదే పదే ఫెయిలవ్వడం, విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా దెబ్బతీయడం జరుగుతుంది. ఇటు వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనకుండా ఉండాలంటే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు సంయుక్తంగా, సంయమనంతో కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంది. నేను సీతానగరం పాఠశాలకు వెళ్ళేసరికి పాఠశాల విద్యార్థులలో చాలామంది అతి తక్కువ స్టాండర్డ్స్ తో ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే ! ఆ కారణంగా అందరూ స్పెషల్ క్లాసులు నిర్వహిం చడం విషయంలో సహకరించారు. కష్టపడ్డారు. నాకు కావలసిన స్టాండర్డ్స్ తో కూడుకున్న ఫలితాలు తీసుకువచ్చారు. అలా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియ జేసుకుంటున్నాను. ( సశేషం )-- శివ్వాం.ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 7013360252.
June 24, 2020 • T. VEDANTA SURY • Memories