ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుబ్రహ్మణ్య భారతియార్-- తమిళులు జాతీయకవిగా చెప్పుకునే మహాకవి సుబ్రహ్మణ్య భారతియార్ గురించి కొన్ని ముచ్చట్లు.... సుబ్రహ్మణ్యానికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్రమణ్యన్. ముద్దు పేరు సుబ్బయ్య. ఆయన ప్రతిభాపాండిత్యాలు భారతి అనే బిరుదును తెచ్చిపెట్టాయి. మహాకవి, మీసాలు, తలపాగా చుట్టుకున్న కవి వంటివి ఆయన పేరు స్ఫురణకు రాగానే అభిమానులతో చెప్పిస్తాయి.ఆయన జన్మస్థలం ఎట్టయపురం. బతికిన మద్రాసులో ట్రిప్లికేన్. పుదుచ్చేరోలో పదమూడేళ్ళు తలదాచుకున్న ఊరు. ఆయనకుండిన మూడిళ్ళూ ఇప్పుడు స్మారకనిలయాలుగా మారాయి. స్వదేశమిత్రన్, చక్రవర్థిని, ఇండియా, విజయ, సూర్యోదయం, కర్మయోగి, ధర్మం తదితర పత్రికలలో పని చేశారు. అలాగే బాలభారత అనే ఆంగ్లపత్రికలోనూ పని చేశారు.జీవితాంతం పాత్రికేయుడిగా రచయితగా కొనసాగారు.మదురై సేతుపతి పాఠశాలలో తమిళ పండితుడిగా రెండు నెలలు పని చేశారు. అప్పుడు ఆయన జీతం పదిహేడున్నర రూపాయలు ఈనాటికీ ఆ స్కూలు ఎంతో ఘనంగా చెప్పుకుంటుంది భారతియార్ తమ స్కూల్లో పని చేశారని.ఏడేళ్ళ వయస్సులోనే పాటలు రాయాలనే ఆసక్తీ కలిగింది.పదకొండో ఏట ఓ పోటీలో సాధించిన విజయం ఆయనకు భారతి అనే బిరుదు తెచ్చిపెట్టింది. భారతి అంటే సరస్వతి అనే అర్థం..తొలిరోజుల్లో ఆయన అనేక రకాల కలంపేర్లతో రచనలు చేశారు. అవి....వేదాంతి నిత్యధీరర్, ఉత్తమ దేశాభిమాని, షెల్లిదాస్, రామదాసన్, కాళిదాసన్, శక్తిదాసన్, సావిత్రి.పద్నాలుగున్నర ఏట పెళ్ళయింది భార్య పేరు చెల్లమ్మా. అప్పుడామె వయస్సు ఏడేళ్ళు. వీరికి ఇద్దరు కుమార్తెలు - తంగమ్మాళ్. శకుంతల.తమిళంలో ఓ కాలమిస్టుగా రాయడం మొదలుపెట్టి విశేష గుర్తింపు పొందిన రచయిత భారతియార్. ప్రపంచ వినోదాలు, పట్టణ సమాచారం, రసవాదం, తరాసు అనే శీర్షికలతో అనేక వ్యాసాలు రాశారు.తమిళంలో తొలి రాజకీయ కార్టూనులను ఆధారంగా చేసుకుని వ్యాసాలు రాసిన ఘనత భారతియారుకే దక్కింది. చిత్రావళి అనే పేరిట కార్టూన్ పత్రిక నడపాలనుకున్నారు. కానీ ఆ కోరిక నెరవేరలేదు.భారతియారుకి పత్రికారంగంలో గురువు జి. సుబ్రహ్మణ్య అయ్యర్. రాజకీయాలలో గురువు తిలక్. ఆధ్యాత్మిక అదర్శవాది అరవిందులు. అలాగే నివేదితి దేవి స్ఫూర్తితోనే ఆయన ఎన్నో రచనలు చేశారు."తనిమై ఇరక్కం" అనే పాటనే ఆయన తొలిసారిగా ఆలపించారు. భారత సముదాయం వర్థిల్లాలి అనే పాటను ఆయన చివరగా పాడిన పాట. స్వదేశ గీతాలు ఆయన పేరిట వెలువడిన తొలి పుస్తకం.ఓ కలెక్టర్ హత్య కేసులో భారతియార్ ను అనుమానించి ప్రశ్నించారు.భారతియారు, మరొక కవి భారతిదాసన్ కలిసి ఓ రోజు పొయ్యి ముట్టించడానికి పడిన పాట్లు తలచి వంట చెయ్యడానికి స్త్రీలు ఎంతలా కష్టపడుతున్నారోనని అనుకున్నారు. మహిళలు జిందాబాద్ అనే పాటను భారతియార్ ఆరోజే ఓ పాట రాశారు. అంతేకాదు భార్యను తిట్టడం అదేరోజు మానేశారు.ఆనాటి ఆచారవ్యవహారాలను పాటించిన భారతియార్ దగ్గర లక్ష్మి, సరస్వతి, కృష్ణుడు ఫోటోలు ఎప్పుడూ ఉండేవి. కృష్ణుడు ఫోటో దగ్గర ఓ కత్తి ఉండేది. దానికో బొట్టుండేది. దానికి నమస్కరించిన తర్వాతే పనులు మొదలుపెట్టేవారు.కనకలింగం, నాగలింగం అనే ఇద్దరికి గాయత్రీ మంత్రోపదేశం చేసిన భారతియార్ కానీ జంధ్యః ధరించరు జంధ్యం ధరించరు.జంధ్యం తీసేసారు అని ఓ పోలీస్ ప్రకటనతో తెలియవచ్చింది.నల్లకోటు ధరించడం ఆయన గుర్తు. ధోవతి చొక్కా మురికిపట్టినా పట్టించుకునే వారు కాదు. చినుగులున్నా పట్టించుకునే వారు కాదు. కానీ చొక్కాలో ఓ గులాబీ పువ్వు ఓ మల్లె పూవు పెట్టుకునే వారు."మిస్టర్ గాంధీ, సముద్రతీరాన రేపు మాట్లాడబోతున్నాను. మీరు అధ్యక్షత వహించాలి" అని భారతియార్ చెప్పినప్పుడు "సభను మరో రోజుకి మార్చడం కుదురుతుందా?" అని గాంధీజీ అడిగారు. "అది అసాధ్యం. కానీ మీరు ఆరంభించబోయే ఉద్యమానికి నా శుభాకాంక్షలు" అని వేదిక దిగిపోయారు. అప్పుడు గాంధీజీ "ఆయనను భద్రంగా రక్షించుకోవాలి" అని అక్కడున్నవారితో చెప్పారు. ఆయన తన రచనలను నలభై సంపుటాలుగా వెలువరించాలనుకుని ఒక్కొక్కరూ వంద రూపాయలు పంపవలసిందిగా కోరారు. కానీ ఎవరూ డబ్బులు పంపలేదు.ఆయన బజారుకెళ్ళేటప్పుడు భార్య చెల్లమ్మాళ్ భుజంమీద చేయేసి నడిచేవారు.అప్పుడు "పిచ్చోడు షికారెళ్తున్నాడు" అని కొందరు హేళనగా మాటలనేవారు. అప్పుడాయన "తలెత్తుకుని నడక...సూటి చూపులు" అని ఓ పాట రాశారు. తమిళం, ఇంగ్లీషు, సంస్కృతం, ఫ్రెంచ్, తెలుగు తదితర భాషలు తెలుసు. ఆయనను ఓ కేసులో విచారించినప్పుడు "మీరు లండన్ లో చదువుకున్నారా ? ఇంగ్లీషు ఉచ్చారణ అంత గొప్పగా ఉందే" అని ఓ పోలీస్ అధికారి ఆశ్చర్యపోయారు.స్వామి వివేకానంద శిష్యురాలైన నివేదితా దేవి భారతియార్ కి ఓ రావి ఆకు ఇచ్చారు. ఆ ఆకు హిమాలయాలనుంచి తీసుకొచ్చిన ఆకు. ఆ ఆకుని భారతియార్ తుదిశ్వాసవరకూ అమూల్న జ్ఞాపకంగా దాచుకున్నారు.తిరువల్లికేణి పార్థసారథి ఆలయ ఏనుగుకి ఆయన బెల్లం ఇస్తుంటే అది తొండంతో నెట్టేయడంతో కింద పడిపోయిన భారతియార్ కి తీవ్రగాయాలయ్యాయి. ఆ గాయాల నుంచి బయటపడిన భారతియార్ ఆలయ ఏనుగు అని ఓ వ్యాసం రాశారు.ఆఫ్ఘన్ రాజు గురించి రేపు ఉదయం ఓ వ్యాసం రాయాల్సి ఉందని పడుకున్న భారతియార్ నిద్దట్లోనే చనిపోయారు.ఆయన భౌతికకాయాన్ని మద్రాసులోని కృష్ణమాపేట శ్మశానవాటికలో పాతిపెట్టిన సమయంలో అక్కడికి హాజరైనవారి సంఖ్య ఇరవై మందిలోపే!!- యామిజాల జగదీశ్
June 23, 2020 • T. VEDANTA SURY • News