ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సృజన--కె ఎస్ అనంతాచార్య.
September 16, 2020 • T. VEDANTA SURY • Poem

అనంతమైనది
అజరామరమైంది
కళారూపం
ప్రాణప్రతిష్ట చేసే
విధాత ప్రతిరూపం


కవనం లోంచి
జాలువారిన ప్రతీ అక్షరం 
ఆలోచనాత్మకం
అగ్ని కీలలను హిమ శీతలాన్నీ
చిమ్మే అస్త్రం 
కవి భావనలకెన్ని ప్రతిరూపాలో?


 బొమ్మలై మాటలు
మనుషుల్ని పలుకరిస్తాయి
పక్షులై ఆకాశంలో ఎగురుతాయి
ఊపిరి పోసిన కుంచెకు ఎన్ని అంచులో?

పంటల నిచ్చి ప్రాణాల నిలబెట్టే పుడమితల్లి గర్భంలో
 ఎన్ని మొలకల కలలో ?

శిల్పి చెక్కిన అద్భుత కళాఖండం 
  వెనక ఉలి రాసుకున్న భాష్యాలెన్నో

అక్షరాల  గింజలు నాటి జ్ఞాన మడిని విస్తరించిన  అధ్యాపకుని నైపుణ్యానికి
 దక్కే ఫలాల పౌనః పుణ్యం ఎంతో?

కొండెక్కే ప్రాణ దీపానికి 
తైల దానం చేసే
హరిస్సాక్షి ధన్వన్తరికి  
తప్పని అగ్ని పరీక్ష లేన్నో

రాకెట్లు,
కదిలే యంత్రాలు
కనిపెట్టి కనికట్టు చేసి
మానవాళి ప్రగతికి బాటలు వేసిన
 కపాలం లో రూపుదిద్దుకోని
ఆవిష్కరణ లెన్నో!

శోధించి సాధించే
మంత్ర రహస్యం
ఎవరి సొంతం కాదు
సత్యాన్వేషణతో
  తనంత తాను
చీకటిని
 చీల్చుకుంటూ వచ్చే
 వెలుతురు సూరీడు
ఎవరి జేబు సొత్తూ కానే కాదు