ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సెప్టెంబర్‌ 1 నుంచి నూతన విద్యా సంవత్సరం
August 25, 2020 • T. VEDANTA SURY • News

వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. 
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర క్యాబినెట్‌  నిర్ణయం ప్రకారం పాఠశాలలను సెప్టెంబర్‌ 1నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఆదేశించారు. స్కూళ్లలో ప్రవేశాలతోపాటు ఈ-పాఠాలు, దూర విద్యావిధానంలో బోధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీవీ/ టీశాట్‌ ద్వారా పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్‌ 1 నుంచి డిజిటల్‌ పాఠాలు అందించాలని చెప్పారు. ఉపాధ్యాయులంతా ఈ నెల 27 నుంచి స్కూళ్లకు హాజరుకావాలని ఆదేశించారు. విద్యార్థులకు కావాల్సిన డిజిటల్‌ కంటెంట్‌ తయారీకి ప్రణాళికలు రూపొందించడం వంటి విధుల్లో పాల్గొనాల్సి ఉన్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం రెగ్యులర్‌ తరగతుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పటివరకు విద్యార్థులు స్కూళ్లకు వేళ్లేది లేదని స్పష్టంచేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యామ్నాయ విద్యాక్యాలండర్‌ను అమలుచేయాలని, ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేయాలని ఆమె సూచించారు.
విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
రాష్ట్రంలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి ప్రారంభమయ్యే డిజిటల్‌ పాఠాలను నేర్చుకోవడంతోపాటు వాటిని ప్రాక్టీస్‌కు అనుకూలంగా రూపొందించిందిన వర్క్‌షీట్లను సోమవారం ఎస్సీఈఆర్టీ విడుదలచేసింది. తెలంగాణ ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్‌ సైట్‌(https:// scert.telangana.gov.in/ Worksheets_ 24082020/ mobile/index.html)ద్వారా 2-10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఈ వర్క్‌బుక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్‌ చేసుకొనే విధంగా వర్క్‌షీట్‌ను రూపొందించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బీ శేషుకుమారి తెలిపారు. 
టీచర్లు కొవిడ్‌ నిబంధనలు పాటించాలి--ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు
రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి టీచర్లు పాఠశాలల్లో విధుల్లోకి వెళ్లాల్సి ఉన్నదని, వీరంతా కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ విషయంలో టీచర్లే స్వీయనియంత్రణ పాటించాలని, అందరూ మాస్కులు ధరించాలని, తరచూ శానిటైజ్‌ చేసుకోవాలని కోరారు. అనారోగ్యంగా ఉంటే బడికి వెళ్లవద్దని సూచించారు. బస్సుల్లో వెళ్లేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతికదూరం పాటించాలని తెలిపారు.(నమస్తే తెలంగాణ సౌజన్యంతో )