ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సైదాపేట : -మద్రాసు మహానగరంలో సైదాపేట ఓ ప్రాంతం. తమిళంలో సైదాపేట్టయ్ అంటారు. సైదై అనికూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి చుట్టూ ఉన్నవే త్యాగరాయనగర్ (టీనగర్), గిండీ, మాంబళం, కెకె నగర్ వంటివి. మా రెండో అన్నయ్య పెళ్ళయిన తర్వాత కొంతకాలం సైదాపేటలో అద్దెకు ఉండే వాడు. కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళివస్తుండేవాణ్ణి. మేమప్పుడు టీ నగర్లో ఉండేవాళ్ళం. కోడంబాక్కం లో రైలెక్కితే ఏడు నిముషాల్లో సైదాపేట స్టేషన్లో దిగేవాడిని. స్టేషన్ నుంచి ఓ అయిదు నిముషాలు నడిస్తే మా అన్నయ్య ఉండే ఇల్లు వచ్చేది. కనుక సైదాపేటతో కాస్త పరిచయముండేది. మద్రాసు మహానగరంలోని ప్రధానమైన వీధి (ఇప్పుడు అణ్ణా శాలై అంటున్నారు) ఈ ప్రాంతం గుండానే పోతుంది.మా అన్నయ్య ఇంటికి వెళ్ళే దారిలో అత్యంత పురాతనమైన ఆలయం ఉంది. అదే కారణీశ్వర ఆలయం. ఇది సుప్రసిద్ధ ఆలయం. ఇక్కడి దేవేరిని స్వర్ణాంబిక అంటారు. ఈ ఆలయ ఆవరణలోనే ఓ అందమైన కొలను ఉంది. ఇది వెస్ట్ సైదాపేటలో ఉంది. ఇదొక శివాలయం.సైదాపేటలో సౌందరేశ్వర ఆలయం, కడుంబాడి అమ్మన్ ఆలయం, చందన వినాయకుడి ఆలయం‌, అంకాలమ్మ ఆలయం, ప్రసన్న వేంకటేశ్వర ఆలయం, ఇలంకాళియమ్మన్, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, లక్ష్మీ నారాయణ ఆలయం కూడా ఉన్నాయి. ఇతర మతాలకు చెందిన ప్రార్థనాలయాలు కూడా సైదాపేటలో ఉన్నాయి.ఉత్తర భారత దేశంలో చోటుచేసుకున్న సిపాయిల తిరుగుబాటుకన్నా ముందరే మద్రాసులో టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ ఉండేది.అడయార్ నదికి సమీపంలో ఉన్న ఈ కాలేజీని సైదాపేట టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ అనేవారు. దీనికన్నా ముందర 1856 మార్చి ఒకటో తేదీన వెపేరీలో మొట్టమొదటి ప్రభుత్వ.సాధారణ స్కూలు ఉండేది. ఈ పాఠశాలకు జె.టి. ఫావ్లర్ అధిపతి. తొలిరోజుల్లో ఇక్కడ ఉచితంగా నేర్పించేవారు. అలాగే ప్రొఫెషనల్ కోర్సులోనూ శిక్షణ ఇచ్చేవారు. మరే సంస్థతోనూ సంబంధం లేకుండా ఇక్కడ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ఈ విద్యాలయం మద్రాసు విశ్వవిద్యాలయ పరిధిలోనిదే. 1887-నుంచి ఈ స్కూలుని టీచర్స్ ట్రైనింగ్ కాలేజీగా పిలవడం మొదలుపెట్టి అదే ఏడాది సైదాపేటకు మార్చారు. అప్పుడిక్కడే వ్యవసాయ కళాశాల ఉండేది. 1889 లో నూతన భవనం నిర్మించారు. 1888లో మొదటి బ్యాచ్ కు పరీక్షలు నిర్వహించి ప్యాసైనవారికి ఎల్.టి. డిగ్రీ ఇచ్చారు 1892లో మొదటోసారిగా ఇద్దరు బాలికలకు ఇక్కడ ప్రవేశం కల్పించారు. ఈ కళాశాలకు 1897 లో హాస్టల్ భవనం నిర్మించి అరవై మంది విద్యార్థులకు వసతిసౌకర్యం కల్పించారు. 1897 నవంబర్ పదిహేనో తేదీ నుంచి హాస్టల్ పని చేయడం మొదలైంది. 1918 లో టీ.వీ. శివకుమార శాస్త్రి ఈ కళాశాలకు ప్రిన్సిపాలుగా నియమితులయ్యే వరకూ ఇంగ్లీష్ వారే దీనిని నడిపారు. కీ.శే. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ కాలేజీలో చదువుకుని ఎల్.టి. డిగ్రీ పొందారు. తమిళనాడు వెటర్నరీ శాఖ ఆధ్వర్యంలో ఓ ఆస్పత్రి సైతం సైదాపేటలోనే ఉంది.పూర్వం ఈ ప్రాంతం చెంగల్పట్ జిల్లా కిందుండేది. అప్పుడు దీనిని ఓ పంచాయతీగా పరిగణించేవారు.చెంగల్పట్టుకి ఇది ప్రధాన కేంద్రం.మద్రాసు హైకోర్టు పరిధిలోని కోర్టు ఒకటి సైదాపేటలో ఉంది.సైదాపేట బస్ డిపోకూడా ప్రధానమైందే.మన దేశ స్వాతంత్ర్యానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ (బ్రిటీష్) వారి ఆధీనంలో ఉన్న సైదాపేట 1859 నుంచి 1947 వరకూ చెంగల్పట్ జిల్లాకు ఇది హెడ్ క్వార్టర్స్ గా ఉండేది. 1947లో సైదాపేట మద్రాసు నగరంలో ఓ ప్రాంతంగా మారింది.మరైమలై అడిగల్ బ్రిడ్జి ఇక్కడి నుంచి అడయార్ నదిని కలిపేది. ఈ వంతెనను మర్మలాంగ్ బ్రిడ్జి అనేవారు. ఈ వంతెనను 1726లో కోజా పెట.రస్ ఉస్కన్ నిర్మించారు. 1960లలో ఈ పాత వంతెనను పునర్నిర్మించారు.సైదాపేటలో ఒకప్పుడు మరమగ్గాలు ఎక్కువగా ఉండేవి.కారణీశ్వర ఆలయంలో ప్రధానంగా జరిగే ఉత్సవాలు - వార్షిక బ్రహ్మోత్సవం. తిరుమంజనం. కంద షష్ఠి. ఆరుద్రా దర్శనం. తెప్పోత్సవం. సంకటహర చతుర్థి. ప్రదోషకాల పూజలు. 1008 శంఖాభిషేకం. ఈ ఆలయ ఆవరణలోనే సౌందరీశ్వరుడు, త్రిపురసుందరి సన్నిధులుకూడా ఉన్నాయి.450 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయమిది. దేవేంంద్రుడి నుంచి కామధేనువుని పొందడం కోసం వశిష్టమహాముని తపస్సు చేశారు. అయితే ఆయన దీక్షకు కామధేనువు ఆటంకం కలిగిస్తోందని భావించిన మహాముని దానిని అడవి గోవుగా మార్చేశారు. ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు ఇక్కడ వర్షం కురిపించి చలి పుట్టించి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. కామధేనువును విడిపించాడు. ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని తిరుక్కారణి అని పిలిచేవారు. అనంతరం ఇక్కడ ఒక ఆలయం నిర్మించారు. సైదాపేట నియోజకవర్గం డిఎంకెవారికి పట్టుకొమ్మలాంటిదే. ఇక్కడ పెద్ద చేపల మార్కెట్ కూడా ఉంది.- యామిజాల జగదీశ్
July 1, 2020 • T. VEDANTA SURY • Memories