ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సౌగంధీ నిలయం" (కథ)--- లావణ్య
September 7, 2020 • T. VEDANTA SURY • Story

అతడొక నిశ్చలమైన సరస్సు.  ఆమె ఒక పారే సెలయేరు. ఒక అందమైన జంట. చూసినవారికి కన్నుల పంట.
ఆమెను చూసినవారికి ఒక దైవిక భావన కలుగుతుంది. చక్కని కుటుంబ నేపథ్యంలో పెరిగిన ఆమెకు ఎంత స్థిరమైన ఆలోచనలు ధృడమైన నమ్మకాలు ఉన్నాయో, అతడికీ అంతే ఉన్నతమైన ఆలోచనలు అలవాట్లు ఉన్నాయి. అందుకే చూసి చూడగానే ఆమె నచ్చడం, నచ్చిన వెంటనే నిశ్చితార్ధం జరగడం, నిశ్చితార్ధం అవగానే వివాహం, వివాహం అవగానే ఆమెతో కలిసి అతని జీవన పయనం మొదలవడం అన్నీ ఎవరూ ఊహించలేనంత త్వరగా జరిగిపోయేయి.

చూసేవాళ్ళు కుళ్ళుకునే లాగే వారి సంసారం సాగడం మొదలైంది. అతడికి ఆమె తప్ప ప్రపంచం లేదు. ఆమెకూ అతడే సర్వస్వం. పెద్దల పట్ల చక్కని వినయంతో ఉండడం, ఇంట్లో అందరికి తల్లో నాలుకలా మసలుకోవడం అతడికి ఆమె పట్ల మరింత అభిమానం అనురాగం పెరిగేలా చేసిన విషయాలు.

అతడు వివాహానికి మునుపు కాస్త జంకుతూ ఉండేవాడు, వచ్చే అమ్మాయి తన తల్లిదండ్రుల పట్ల ఎలాంటి భావన కలిగి ఉంటుందో, ఇంట్లో అందరితో ఎలా కలిసి మెలిసి ఉంటుందో అని. కానీ వివాహం అయిన తర్వాత తనవన్నీ అనవసరమైన భయాలే అని, తన అభిప్రాయాలన్నీ పటాపంచలు చేస్తూ ఆమె అతడినే మరిపించే విధంగా వారితో వర్తించడం అతడికి ఆనందాన్ని కలిగించింది.

అతడు ఇంటి బాధ్యతల విషయంలో మరింక తిరిగి చూసుకోనక్కర్లేకపోయింది. తన చెల్లెలు చిన్నది. అప్పుడే కాలేజీ లో అడుగు పెట్టిన ఆడపిల్ల పట్ల ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత శ్రద్ధ కూడా తన భార్య చూపడం అతడికి ఒక చక్కని భద్రతాభావాన్ని కలిగించింది.

అతడు ఆమె కలిసి పనులు చేసుకోవడం, అందరితో కలిసి కబుర్లు చెప్తూ సమయం గడపడం, తమ అభిరుచుల పట్ల కూడా అంతే శ్రద్ధ కనపరచడం, తమ గురించి కూడా తాము చక్కని ఏకాంత సమయాన్ని గడపడం లాంటి అన్ని విషయాల్లో అతడు తగిన జాగ్రత్త వహించడం వలన జీవితంలో చెప్పుకోదగ్గ అసంతృప్తి ఏదీ లేకుండా సాఫీగా సాగిపోతోంది.

వివాహం అయిన నాలుగు సంవత్సరాలు ఎంతో ఆనందంగా గడిచిపోయాయి. వారికి ఒక చక్కని పాప, ఇంట్లో చిట్టి చిట్టి పాదాలతో గజ్జెలు ఘల్లు మంటూ, గడపలు దాటుతూ తిరుగుతూ బుజ్జి బుజ్జి కబుర్లు చెప్తూ ఉంటే అది వారికే కాదు, ఆ చుట్టుపక్కల వాళ్లకి కూడా అంతే ఆనందాన్ని కలిగించేది. ఆ పాప వారి జీవితాల్లో మరింత ఆనందాన్ని కళను నింపింది. ఆ సుగంధ పరిమళాలు నింపిన పాపకు సౌగంధి అని నామకరణం చేశారు. 

పాపను మూడవ సంవత్సరం నిండే సమయానికి అందరిలాగే స్కూల్ కు పంపాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు మొదలైంది మనసులో దిగులు వారిద్దరికీ. ఏది ఏమైనా మొత్తానికి పాపని స్కూల్ లో చేర్చే కార్యక్రమం పూర్తి అయింది.

ఇద్దరూ చక్కగా పాపను తయారు చేసి కావలసిన పుస్తకాలు ఇతర వస్తువులు ఇచ్చి స్కూల్ కి పంపించడం, తిరిగి తీసుకు రావడం, స్కూల్ లో ఏం జరిగిందో ఏరోజుకా రోజు అడిగి తెలుసుకోవడం, చెప్పిన పాఠాలు ఇంట్లో శ్రద్ధగా చదివించడం లాంటివి ఆమె చేసేది.

పాపకు తొలి రోజు నుంచీ ఎక్కడ ఏం జరిగినా, ఎవరు ఏమన్నా అన్నీ ఇంట్లో చెప్పడం అలవాటు చేసేరు. అందువల్ల ఏ సందర్భంలో అయినా పాప భయానికి గాని లేదా వేరే ఏ రకమైన ఇబ్బందికి గానీ గురైతే వాళ్లకి తెలుస్తుంది. పాపకు కూడా భయం, దాపరికం లేకుండా అన్నీ అమ్మ నాన్నలతో పంచుకోవడం అలవాటవుతుంది అనేది వాళ్ళ ఆలోచన. దాన్నే ఆచరణ లో పెట్టేరు.

"ఏమండీ, టైం ఐదైపోతున్నా పాప ఇంకా ఇంటికి రాలేదు. స్కూల్ కెళ్ళి చూసా. అక్కడా లేదు. వాచ్మెన్ చూడలేదన్నడు. దాని ఫ్రెండ్స్ తల్లిదండ్రులకి కూడా కాల్ చేశాను. ఎవరూ గమనించలేదన్నారు. నాకెందుకో భయంగా ఉంది. మీరు త్వరగా రండి" అంటూ ఏడుపు స్వరంతో ఆమె అతడికి కాల్ చేసింది. 

పాపే సర్వస్వం అని బ్రతుకుతున్న వాళ్ళిద్దరికీ ఇదో పెద్ద అశనిపాతం లా తగిలింది. అతడికి నోట మాట లేదు. దాదాపు కొయ్యబారిపోయినట్టుండిపోయాడు దిక్కు తోచనట్లుగా. మనసు పరిపరి విధాల పరుగులు తీస్తోంది. ఆందోళనతో గుండె పట్టేసినట్టై కూర్చుండిపోయిన అతడిని తన కొలీగ్ తట్టి ఈ లోకంలోనికి తెచ్చాడు. 

జరిగినదంతా అతడికి చెప్పగా, "పోలీస్ స్టేషన్ లో కంప్లైంటు ఇద్దాం పద. అన్ని తెలిసిన చోట్లా కూడా వెతుకుదాం. చెల్లెమ్మ కూడా కంగారు పడుతోంది కదా, ఆమెకు తోడుగా మా ఆవిడని అక్కడికే రమ్మని చెబుతాను. నువ్వు ముందు లే" అంటూ తొందర పెట్టి అతడితో బండి మీద బయల్దేరాడు. 

ఇద్దరూ తెలిసిన వారందరికీ కాల్స్ చేస్తూ స్కూల్ దగ్గరకి చేరుకుని మళ్ళీ ఒకసారి చుట్టుపక్కలంతా వెతికి, స్కూల్ వాచ్మెన్ తో మాట్లాడి, పాప అక్కడ లేదని నిశ్చయించుకుని పోలీస్ స్టేషన్ కు చేరి కంప్లైంట్ రాసి వాళ్ళని ఎలాగైనా పాప విషయంలో సాయం చెయ్యమని బ్రతిమాలుకుని ఇంటికి చేరారు.

ఇంటికెళ్ళేసరికి ఆమె అసలీ ప్రపంచంలోనే లేదు. దాదాపు పిచ్చి పట్టినట్లు పాపకోసం ఏడుస్తోంది. అతని స్నేహితుని భార్య అనునయించే ప్రయత్నం చేస్తోంది. ఆ దృశ్యం అతడిని విచలితం చేసింది. ఆ దృశ్యం చూసినవారెవరికైనా దుఃఖం ఆగదు. తల్లి బాధ అలాంటిది. 

ఇంతలో ఒక కాల్ వచ్చింది ఆమె నంబరుకు. ఎవరో తెలీదు. ఫోన్ తీయడానికి భయపడుతుంటే, అతడు ధైర్యం చెప్పి, నేనున్నా గా, మాట్లాడమని ఇచ్చాడు. 

ఆమె "హలో" అనగానే అవతలి వ్యక్తి " మీ పాప కనిపించడం లేదు కదూ? మీ పాప పేరు సౌగంధి ఏనా? మీరెక్కడుంటారు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. 

అది వినగానే అతడు కాల్ అందుకొని, "ఎవరు మీరు? మీకేం కావాలి? మా సౌగంధికి ఏమైంది" అంటూ ఆదుర్దాగా అడిగాడు. 

అవతలి వ్యక్తి, "మీరు కంగారు పడకండి. పాప నా దగ్గరే ఉంది. కాస్త భయపడి ఉంది. అందుకే ఏడుస్తోంది. మీరొచ్చేవరకూ నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు రావలసిన చిరునామా మెసేజ్ చేస్తున్నాను. మీకు నేను తెలీదు. కానీ నాకు మీరు తెలుసు. వచ్చి పాపను తీసుకెళ్ళండి" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. 

అతడు వెంటనే పోలీసులకు కాల్ చేసి, జరిగినదంతా చెప్పి, ఒక కానిస్టేబుల్ ని కూడా సాయం తీసుకుని అజ్ఞాత కాలర్ ఇచ్చిన చోటుకు చేరుకున్నారు. అతడిని అక్కడ చూడడం కాల్ చేసిన వ్యక్తికి చాలా ఆనందాన్ని కలిగించింది. అతడిని చూడగానే పాప పరుగులు తీస్తూ వచ్చి కాళ్ళకు చుట్టుకుపోయింది. వెంటనే పాపను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకొని, ఓదారుస్తూ జరిగినది తెలుసుకొనే ప్రయత్నంలో పడ్డాడు. 

కాల్ చేసిన అతడు వివరం చెప్తుంటే, అతడికి రక్తం మరిగిపోతోంది. జరిగినదేంటంటే, కాల్ చేసిన అతడి పేరు మాణిక్యం. అతగాడికి పిల్లలంటే చాలా ఇష్టం. రోజూ ఉదయం సాయంత్రం ఆ స్కూల్ కి వచ్చే చిన్న పిల్లల్ని చూడడం కోసం అదే స్కూలుకు ఎదురుగా పుస్తకాల షాప్ నడిపేవాడు. అతడికి అందరు పిల్లలూ గుర్తే. ఆరోజు సౌగంధి ఉదయం స్కూలుకి రావడం చూశాడు. సాయంత్రం నాలుగ్గంటలకు స్కూల్ విడిచిపెట్టే టైంకి పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్తారు. కానీ, ఎదాలాపంగా స్కూల్ వైపు చూసిన అతడికి సౌగంధిని ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు చేయిపట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళడం గమనించాడు. ఎప్పుడూ చూడని అతడిని చూసి మాణిక్యానికి మనసులో ఏదో కీడు శంకించింది. అందుకే దుకాణం కుర్రాడికి అప్పజెప్పి పరుగున అక్కడికెళ్లి వాళ్ళని ఆపాడు. "పాపా, ఎవరీ అబ్బాయి? ఎక్కడికెళ్తున్నావ్?" అని అడిగితే, పాప, "మా అమ్మ దగ్గరకెళ్తున్నా అంకుల్. ఈ అన్నని అమ్మ నన్ను తీసుకుని రమ్మని పంపించింది" అంటూ సమాధానం చెప్పింది.

అయినా నాకెందుకో మనసు కుదుటపడక ఆ కుర్రాడి వైపు చూశాను, అతడు వెంటనే కాస్త తుత్తరపాటుతో, "ఏయ్, ఎవరయ్యా నువ్వు. మిమ్మల్ని వెళ్ళనీ. మాకు లేట్ అవుతోంది" అంటూ పక్కకి తోసి ముందుకి నడవడం మొదలు పెట్టాడు. 

నాకనుమానం వచ్చి గట్టిగా పట్టుకొని అడిగేసరికి పాపను వదిలిపెట్టి పారిపోయాడు. వీధి చివర ఎవరో బండితో వీడికోసమే ఎదురు చూస్తున్నట్టు వీడు ఎక్కిన వెంటనే స్పీడుగా బండి పోనిచ్చేశాడు. నేను వెనకే కొంత దూరం పరుగు పెట్టినా అందుకోలేక ఆగిపోయా. కానీ బండి నంబరు నోట్ చేశాను, ఇదిగో వివరాలు" అంటూ ఆ చీటీ అతడి చేతికిచ్చాడు. 

ఆనందం ఆశ్చర్యం భయం జలదరింపు కలగలిసిన సమయం, ఆ దంపతులకి పాప దొరికిందని ఆనందపడాలో, ఇలా జరిగిందని బాధ పడాలో తెలియని అయోమయ స్థితి. పోలీసులకు వివరాలు తెలిపి, మాణిక్యం చేసిన సాయానికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుని ఇంటికి చేరారు. 

స్కూలు యాజమాన్యానికి జరిగినదంతా తెలియజేసి, పిల్లలు భద్రత పట్ల శ్రద్ధ తీసుకోలేని పక్షంలో స్కూలెందుకు నడుపుతున్నారని గొడవ పడి స్కూల్ యాజమాన్యం మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ నమోదు చేయించాడు అతడు. 

ఇంటికి చేరాకా సౌగంధి ని జరిగినదంతా వివరంగా చెప్పమని ఒక్కో విషయం అడిగి తెలుసుకుంది ఆమె. "నేను గేట్ దగ్గర ఆడుకుంటుంటే ఆ అన్న నన్ను బయటికి రమ్మని పిలిచాడు మమ్మి. బయటికొచ్చాకా అక్కడున్న వేన్ లోకి నన్ను ఎక్కించి నా బుగ్గ మీద ముద్దు పెట్టి నేను చెప్పింది చేస్తే అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అన్నాడు మమ్మీ. నేను ముద్దు పెట్టాకా, నా ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులేస్తుంటే నేను గట్టిగా అరిచాను మమ్మీ. నువ్వు చెప్పావు కదా, అలా ఎవరు ముట్టుకున్నా అరవమని అందుకే. వెంటనే నా నోరు నొక్కి, సరే ఆగు, మనం ఇంటికెళ్దాం పద అంటూ వేన్ దింపి నడుస్తుంటే ఆ బుక్స్ అంకుల్ ఆపి నాతో మాట్లాడేడు మమ్మీ. ఇంతలో అన్న పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు భయం వేసింది. అందుకే గట్టిగా ఏడ్చేశాను మమ్మీ. ఈ అంకుల్ షాప్ కి తీసుకెళ్ళి నీ ఫోన్ నెంబర్ నా డైరీలో చూసి నీకు కాల్ చేశాడు మమ్మీ" అంటూ జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది. 

చిన్నప్పటినుంచీ తాను చెప్పిన మాటలు, చేసిన అలవాట్లు పాపను ఇలా కాపాడాయని వారిరువురూ ఎంతగానో సంతోషించారు. 

"అందుకే తల్లినే తొలి గురువు అంటారు, నీ పెంపకం కారణంగా మనకింక పాపను గూర్చిన భయం లేదు" అన్నాడతను. 

ఆమెకు వెన్నులోంచి వణుకు పుట్టింది. "కాస్త ఆలస్యం జరిగుంటే ఏం జరిగేదో, ఈ రోజు లేచిన పొద్దు మంచిది" అనుకుంటూ ఆ భగవంతుడికి వేయి నమస్కారాలు తెలుసుకుంది. 

తర్వాత పోలీసులు తీసిన ఆరాను బట్టి, "ఆ కుర్రాడు ఆ స్కూల్ కు వేన్ నడిపే ఒక డ్రైవరు కొడుకనీ, ఆ మరుసటి రోజు నుంచీ పరారీలో ఉన్నాడనీ, ఇలాంటి కొడుకు పుట్టినందుకు కంటికీ మింటికీ ధారలుగా ఏడుస్తున్నారు ఆ డ్రైవరు దంపతులు" అని తెలిపారు.

ఇంతకీ చెప్పనే లేదు కదూ
అతడి పేరు శివుడు, ఆమె పేరు హిమజ. వారి పాప సౌగంధి.
ఇది వారి కథ.