ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
స్వచ్ఛత : -- రామ్మోహన్ రావు తుమ్మూరి
October 11, 2020 • T. VEDANTA SURY • Poem

 

కం.స్వచ్ఛత కావలె ఎల్లెడ 

   విచ్చలవిడితనము పోయి విజ్ఞత హెచ్చన్

   పచ్చని చెట్లను పెంచుడి 

   అచ్చముగా భరత ఖ్యాతి అంబరమంటన్

 

ఆ.వె.ఇంటిముందు వెనుక యినుమాఱు ముమ్మారు 

      శుభ్ర పరచు నియతి శుద్ధి గలిగి 

       ఎల్ల జనులు ఎపుడు ఎరుకతో నున్నచో  

       భరతభూమి స్వచ్ఛ ధరణి గాదె 

 

ఉ.బాలురు బాలికల్ బడుల బాహ్యపు సీమల బాగొనర్చుచున్ 

   మేలిమి పూల మొక్కలను మెండుగ సత్ఫల వృక్షజాతులన్ 

    చాలఁగ నాటుటన్ననొక చక్కని కార్యము చేయనేర్చుచో 

    చాలదె స్వచ్ఛతా సవన సారము చాటుటకన్ని చోటులన్

 

చం.చదువులు సంధ్యలెన్నిటినొ చక్కగనేర్తురు కాని ఏలకో

    మదిని దలంపరెవ్వరును  మానవ నైజమదేమి చెప్పుదున్ 

    హృదయమునందు స్వచ్ఛతను ఉద్యమదీప్తిగ నెంచకున్నచో 

    కదలునె భావి భారతము కాంచన కాంతుల క్రాంతి బాటలో 

 

సీ.కాలుష్య రక్కసి కరకు కోరల మధ్య 

                 సేద్యమ్ము  పడినది చిక్కులోన

      అక్రమార్జన కసి  అన్నింట కల్తీలు  

                  అదుపు లేక పెరిగె అవని యంత 

      పాలు పండ్లు జలము పంటలన్నియు జూడ

                   విషయుక్తమగుచుండె విరివిగాను 

     ప్లాస్టిక్ పదార్థాల ప్రాపు హెచ్చయి పోయి 

                   పర్యావరణ హాని ప్రబలిపోయె

 

గీ.   కాన ఇకనైన జనులంత కనులు దెరచి 

     పరిసరాలను పరిశుభ్ర పరచు కొరకు

     చెట్లు పెంచుచు చెడుఁగాలి చెరిపి వేసి 

     స్వచ్ఛతా యజ్ఞ సాఫల్య శక్తిగొనుడి