ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
స్వతో రoజయతి--కె ఎస్.అనంతాచార్య.
September 30, 2020 • T. VEDANTA SURY • Poem

 

సంగీత సాహిత్య సమలoకృతే 
 శ్రీ భారతీ  పదయోగ భూషితే
సర్వత్ర పూజితే !

ఏడు స్వరాలతో
ఏడు గిరులను ఆవిష్కరించిన అన్నమయ్య నోట 
పలికిన అమృతధార

శ్రుతి లయలు తల్లిదండ్రులై సాగే
మృదు మధురమైన మoజుల 
మనోహర నాదవినోదం

ఆసాంతం శబ్దధారలు
చెవులలో కురిపిoచిన
కర్ణాటక సంగీత సామ్రాట్టు 
త్యాగయ్య చేసిన రాగాల కనికట్టు

సామవేదం లో జనియించి తన్మయత్వం సిద్ధింప జేసే తత్ హరిః ఓం..
తదరిణతోమ్...నాదోపాసన

సకల జగత్తును ఏకం చేసే ఆడించే ఊయల
జాగృతం చేసే పాటల కోయిల

మేల్కొల్పే భూపాలం 
తాన్సెన్ సమాధిలోంచి వినిపించే సరళీ స్వర విన్యాసం 

రామదాసు చేసిన వినతులు దాసభక్తికి 
ప్రతీకలై అర్పించిన జోతలు

అనుభూతిని కలిగించే రాగం రుజాగ్రస్తుల గుండెలకు లేపనమై
వియోగంలో ఓదార్పు నాదమై కరుణకు శివరంజనియైన రసరంజని 
అందమైన
జావలికి గానమే ప్రాణమై అలరించే అనుభూతికి జోడించిన రసనిష్పత్తి

ఒత్తిడిని చిత్తడి చేస్తూ
మోడువారిన జీవితాన్ని చిగురింపచేసే చింతామణి

ఒక గమకంలో మునక లేస్తూ తనను తాను మరిచి ఆత్మానందాన్ని
పొందే భావప్రాప్తి

ప్రాoతాలు వేరైనా దేహాలు దూరమైనా
సర్వజన శ్వాస ఈ విశ్వభాష