ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
స్వార్థపరుల స్నేహం వద్దు (కథ) సరికొండ శ్రీనివాసరాజు: -ఆ పాఠశాలలో ప్రశాంతి అనే అమ్మాయి కొత్తగా ప్రవేశించింది. ప్రశాంతి అందరికంటే తెలివైన విద్యార్థిని. చదువులో ముందు ఉండటమే కాదు. అందరితో స్నేహం చేసి, అందరినీ చదువులో ప్రోత్సహిస్తుంది. ప్రశాంతి ప్రోత్సాహం వల్ల చాలామంది చదువులో వెనుకబడిన విద్యార్థులు తెలివైన విద్యార్థులుగా మారిపోయారు. నీల అనే అమ్మాయి చదువులో చాలా వెనుకబడేది. ప్రశాంతితో నీల కూడా మంచి స్నేహం చేసింది. దాదాపు ప్రాణ స్నేహితులు అన్నంత సన్నిహితంగా ఉండేవారు. వారి స్నేహం అందరికీ ముచ్చటగొలిపేది. ప్రశాంతి నీలతో బాగా చదువుకోవాలని, తాను ఎంత సాయమైనా చేస్తానని అన్నది. నీల కోపంతో "నా చదువు నా ఇష్టం. నా చదువు విషయంలో నీ హితబోధలు అవసరం లేదు." అని వెళ్ళిపోయింది. మూర్ఖులకు హితబోధ అనవసరం అనుకునేది ప్రశాంతి ‌. మరునాడు మళ్ళీ నవ్వుతూ నీల ప్రశాంతి దగ్గరకు చేరేది. ఆప్యాయంగా మాట్లాడేది. ఒకరోజు నీల ప్రశాంతికోసం ప్రత్యేకంగా స్వీట్లు తీసుకుని వచ్చింది. ఎన్నడూ తాను తెచ్చిన తినుబండారాలు తినడమే తప్ప ఎన్నడూ ఏమీ కొనివ్వని నీల ప్రత్యేకంగా తన కోసమే స్వీట్లు ఎందుకు తీసుకువచ్చిందో అని ఆశ్చర్యపోయింది ప్రశాంతి. మరునాడు అర్థవార్షిక పరీక్షలు మొదలు అయినాయి. ప్రశాంతి ముందు నీల కూర్చుంది. ప్రశాంతి రాసే జవాబులు చూపించమని ప్రాధేయపడింది నీల. కష్టపడి చదివి సొంతంగా రాయాలి కానీ ఇలా ఇతరుల మీద ఆధారపడవద్దని హితబోధ చేసింది ప్రశాంతి. పరీక్ష అయిపోయి బయటికి వచ్చాక ప్రశాంతి నీలతో ఇలా అంది. "పరీక్షలో ఇతరులను అడిగి జవాబులు రాయడం అడుక్కొని తినడంతో సమానం. అలా రాస్తే బిచ్చగానికి మనకు తేడా ఉండదు. పరీక్షలో స్లిప్పులు రాసుకుని తెచ్చి చూసి రాయడం దొంగతనంతో సమానం. అలాంటి వారికి మంచి భవిష్యత్తు ఉండదు. చూసి రాసి తెచ్చుకొనే 80 మార్కుల కంటే సొంతంగా రాసి తెచ్చుకొనే 40 మార్కులే మనకు తృప్తిని ఇస్తాయి. కాబట్టి ఇకనైనా కష్టపడి చదివి సొంతంగా రాయాలి." అని. "చాలా బాగా చెప్పావు. మాకు కనువిప్పు కలిగింది." అని చాలామంది ప్రశాంతిని పొగిడారు. నీలకు బాగా కోపం వచ్చింది. "కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయని నీలాంటి నీచుల స్నేహం నాకు వద్దు. నీతో నేను జన్మలో మాట్లాడను." అంటూ వెళ్లిపోయింది. అప్పుడు భావన అనే అమ్మాయి ప్రశాంతిని బాధపడవద్దని అన్నది‌. "అలాంటి స్వార్థపరుల, మూర్ఖుల స్నేహం వదిలినందుకు ఎంతో సంతోషంగా ఉంది. స్నేహాన్ని తన స్వార్థానికి వాడుకునే వారికి మనం దూరంగా ఉండటం మంచిది." అన్నది ప్రశాంతి.
July 24, 2020 • T. VEDANTA SURY • Story